Miss India 2022: మిస్ ఇండియా 2022గా సినీ శెట్టి, నాట్యమే ప్రాణమంటున్న అందాల రాణి
మిస్ ఇండియా పోటీల్లో మరో కొత్తందం మెరిసింది. విజేతగా నిలిచి దేశం దృష్టిని తనవైపు తిప్పుకుంది.
ఆమె నవ్వితే వెన్నెల కురవాల్సిందే...
అజంతా శిల్పానికి కూడా ఆమెకున్న కొలతలు ఉండవేమో...
చక్కటి ఎత్తు, చూస్తూ ఉండిపోవాలనిపించే రూపం, అందులోనూ తెలివైన పిల్ల... అందుకేనేమో మిస్ ఇండియా 2022 కిరీటం ఏరికోరి ఆమెను ఎంచుకుంది.
మిస్ ఇండియా 2022గా ఎంపికైంది కర్ణాటకకు చెందిన సినీ శెట్టి. వయసు కేవలం 21 ఏళ్లు. ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు కిరీటం తలపై ధరించి ఎన్నో సేవా కార్యక్రమాలకు ప్రతినిధిగా మారబోతోంది. అంతేనా మిస్ వరల్డ్ పోటీలకు మన దేశం నుంచి వెళ్లబోయే ఏకైక అందగత్తే ఈమెనే. అసలు ఎవరీమే? ఇన్నాళ్లు ఎక్కడ దాక్కుంది?
నాట్యమంటే ప్రాణం...
సినీశెట్టి తల్లిదండ్రలది కర్ణాటక.ఉద్యోగ రీత్యా వారు ముంబైలో స్థిరపడ్డారు. దీంతో అక్కడే పుట్టి పెరిగింది సినీశెట్టి. చిన్నప్పట్నించి శాస్త్రీయ నాట్యం అంటే ప్రాణం. అందుకే భరతనాట్యంలో ఆరితేరింది. నాలుగేళ్ల వయసు నుంచే నేర్చుకోవడం మొదలుపెట్టింది. పద్నాలుగేళ్లకు అరంగేట్రం చేసింది. ఈ టాలెంట్‌తోనే మిస్ ఇండియా పోటీల్లో మిస్ టాలెంట్ అవార్డును కూడా సినీనే గెలుచుకుంది. ఇక చదువు సంగతికి వస్తే అకౌంటింగ్ అండ్ ఫైనాన్సింగ్ డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్టు కోర్సు చేస్తోంది. ఆమె బ్యూటీ క్వీన్ గా నిలిచేందుకు కుటుంబం నుంచి సంపూర్ణ సహకారం అందింది. ఈమె మొదట మిస్ కర్ణాటకగా గెలిచి ఆ రాష్ట్రం తరుపునే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. మాది సాంప్రదాయక కుటుంబం
విన్నర్ గా మారాక ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడింది. ‘నేను చాలా సాంప్రదాయక కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాను. కానీ నా కుటుంబం సమకాలీన మార్పులను ఆహ్వానిస్తారు. వారే నా వెన్నుదన్నుగా నిలిచారు. నా చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం చాలా సాంప్రదాయకమైనది. ఇక్కడ స్త్రీ ఒక నిర్ధిష్ట మార్గంలో స్త్రీ విలువను నిర్వచించడానికి ప్రయత్నిస్తారు. నేను స్త్రీ విలువకు నా సొంత అర్థాన్ని కనుగొనాలని భావిస్తున్నాను. నేను నమ్మిన విలువ కోసం నిలబడడం, నా స్థానాన్ని నిలబెట్టుకోవడం నాకు ఒక సవాలు’ అని చెప్పుకొచ్చింది. సినీ శెట్టి తల్లి పేరు హేమ శెట్టి. తండ్రి పేరు తెలియదు. ఇక ఆమెకు ఒక సోదరుడు ఉన్నాడు. పేరు సికిన్ శెట్టి.
ప్రకటనల్లోనూ నటించింది...
సినీ శెట్టిని మనం ఇంతకుముందే టీవీలో చూశాం. చాలా కమర్షియల్ ప్రకటనల్లో నటించింది. పదహారేళ్ల నుంచే మోడలింగ్ రంగంలో రాణిస్తున్న సినీ ఓ మోడలింగ్ ఏజెన్సీ ద్వారా అవకాశాలు దక్కించుకుంది. ఇప్పటికే ఎయిర్ టెల్, ఫ్రీ ఫైర్, పాంటలూన్స్ వంటి సంస్థలకు చెందిన ప్రకటనల్లో కనిపించింది. ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమె డ్యాన్స్ రీల్స్ ను రెండు కోట్ల మంది చూసిన సందర్భాలూ ఉన్నాయి. ఎందరినో ఓడించి
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఫెమినీ మిస్ ఇండియా వరల్డ్ 2022 పోటీలు జరిగాయి. ఈ పోటీలో సినీ శెట్టి మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో రాజస్థాన్ కు చెందిన రూబల్ షెకావత్, ఉత్తరప్రదేశ్ కు చెందిన షినతా చౌహాన్ మూడో స్థానంలో నిలిచారు. ఈ పోటీలో 30 రాష్ట్రాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. వారందరినీ తన అందంతో, తెలివితో, నాట్యంతో ఓడించింది సినీ శెట్టి.
View this post on Instagram