Rare Disorder: ఉదయం లేచాడు.... భార్యాకూతురిని కూడా మర్చిపోయాడు... ఇదో వింత జబ్బు
ఓ వ్యక్తి ముందురోజు రాత్రి భార్యాబిడ్డలతో కలిసి భోజనం చేశాక నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం లేచి, వాళ్లిద్దరూ ఎవరో తెలియనట్టు ప్రవర్తించసాగాడు.
డేనియల్ కు 36 ఏళ్లు. భార్య రూత్, పదేళ్ల కూతురితో జీవిస్తున్నాడు. ముందు రోజు రాత్రి వరకు సాధారణంగానే ఉన్న వ్యక్తి, మరుసటి రోజు ఉదయం మాత్రం విచిత్రంగా ప్రవర్తించసాగాడు. పక్కనున్న భార్యను ‘ఎవరు నువ్వు? నేనెక్కడున్నాను?’ అంటూ ప్రశ్నించసాగాడు. అంతేకాదు తనకు స్కూలుకి టైమ్ అవుతోందని, త్వరగా యూనిఫామ్ వేసుకుని వెళ్లాలని గాభరా పడ్డాడు. తనను తాను అద్దంలో చూసుకుని ‘ఇదేంటి నేనింత పొడవు, లావు ఎప్పుడయ్యాను? అసలేం జరిగింది’ అంటూ చాలా మానసిక ఆందోళనకు గురయ్యాడు. చివరికి తన కూతురిని చూసి కూడా స్కూల్ లో జూనియర్ అనుకున్నాడు. ‘నేను మీ భార్యను, ఆమె నీ కూతురుని’ అని చెబుతున్నా వినకుండా ‘మీరు నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారా’ అంటూ ప్రశ్నించాడు.
ఈ వింత ప్రవర్తన చూసి అతడిని తీసుకుని ఆసుపత్రికి పరిగెట్టింది భార్య. వైద్యులు వివిధ రకాల పరీక్షలు చేసి విషయం తేల్చారు.
డేనియల్ రాత్రి పడుకున్నప్పుడు నార్మల్ గానే ఉన్నాడు. ఉదయం నిద్రలేచే సమయానికి మాత్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాడు. 2021 లో ఉన్నా కూడా, తాను ఇంకా 1999లో ఉన్నట్టు గుర్తుంది ఆయన. ఈ ఇరవై ఏళ్ల కాలంలో జరిగినవి మర్చిపోయాడు. అందుకే భార్య, కూతురు కూడా డేనియల్ కు గుర్తు రాలేదు. కానీ తల్లిదండ్రులు మాత్రం గుర్తున్నారు. దీనికి కారణం ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నేషియా (Transient Global Amnesia) అనే డిజార్డర్ అని వైద్యులు తెలిపారు. దీనివల్ల హఠాత్తుగా షార్ట్ టెర్మ్ మెమోరీ లాస్ అవుతుందని చెప్పారు. తిరిగి అన్నీ గుర్తుకు వచ్చే అవకాశం ఉందని వివరించారు. మానసికంగా విపరీతమైన ఒత్తిడి కారణంగా ఇలాంటి డిజార్డర్లు కలుగుతాయని తెలిపారు.
2020లో డేనియల్ విపరీతమైన ఒత్తిడికి గురైనట్టు చెప్పింది రూత్. అతని ఉద్యోగం పోవడంతో, ఇల్లును అమ్మాల్సి వచ్చిందని చెప్పింది. దీని వల్ల డేనియల్ ఒత్తిడి వల్ల కలిగే మూర్ఛ బారిన పడ్డారని తెలిపింది. దాని వల్లే మెమోరీ లాస్ కూడా సంభవించి ఉంటుందని ఆమె అభిప్రాయ పడింది. వైద్యులు 24 గంటల్లో అంతా సజావుగా అవుతుందని, డేనియల్ కు మెమోరీ తిరిగి వస్తుందని చెప్పారు. కానీ అలా జరుగలేదు. దీంతో రూత్ డేనియల్ ను పరిచయస్థులు, స్నేహితుల ఇళ్లకి తీసుకెళుతోంది. వారికి మళ్లీ కొత్తగా పరిచయం చేస్తోంది. థెరపీలు ఇస్తున్నప్పటికీ మర్చిపోయిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకునేందుకు డేనియల్ చాలా కష్టపడుతున్నాడు. వీళ్లు ప్రస్తుతం అమెరికాలోని మిస్సోరీలో నివసిస్తున్నారు.
Also read: రోజుకు నాలుగైదు వేరు శెనగపలుకులు తినండి చాలు... ఆ జబ్బులకు దూరంగా ఉండొచ్చు
Also read: ఆమె చదివింది ఎమ్మెస్సీ... చేసేది రోడ్లు ఊడ్చేపని
Also read: ఈ టీ తాగితే .. అందం అమాంతం పెరిగిపోతుందా!