Post graduate Rajani story: ఆమె చదివింది ఎమ్మెస్సీ... చేసేది రోడ్లు ఊడ్చేపని
రోడ్లు ఊడ్చే పని చేసేందుకు సిగ్గుపడేవాళ్లు ఎంతోమంది. కానీ రజని ఎమ్మెస్సీ చేసి కూడా కుటుంబం కోసం ఆ పనినే చేస్తోంది.
అంతా బావుంటే... సజావుగా సాగుంటే... రజని జీవితమే మరోలా ఉండేది. డాక్టర్ రజనిగా మారేది. పెద్ద ఉద్యోగాలు తలుపు తట్టేవి. కానీ ఊహించనిది జరగడమే జీవితం. వరుస పెట్టి వచ్చిన కష్టాలు ఆమె జీవితాన్ని అతలాకుతలం చేశాయి. పీహెచ్ డీ సీటు వచ్చినప్పటికీ అందులో చేరలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి జీహెచ్ఎమ్ సీలో స్వీపర్ గా చేరింది రజని. నాలుగు నెలలుగా ఆమె ఆ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆమె తన కథను ‘హక్కు ఛానెల్’ అనే యూట్యూబ్ ఛానెల్ తో పంచుకుంది.
రజని చిన్నప్పట్నించి చదువులో ముందే. ఇంటర్లో కెమిస్ట్రీలో 60 కి 60 మార్కులు తెచ్చుకుంది. డిగ్రీ, ఆ తరువాత ఆర్గానిక్ కెమస్ట్రీలో ఎమ్మెస్సీ పూర్తిచేసింది. పీహెచ్ డీ చేయాలన్న కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నించింది. సెంట్రల్ యూనివర్సీటీలో పీహెచ్ డీ అయ్యేందుకు క్వాలిఫై కూడా అయ్యింది. అంతవరకు బాగానే ఉంది. అప్పుడే కష్టాలు మొదలయ్యయి. పెళ్లి అయ్యింది. పీహెచ్ డీ లో చేరాల్సినప్పుడే ఆమె అత్తకు ఆరోగ్యం పాడైంది. ఆసుపత్రిలో చేర్పించారు. కోమాలోకి వెళ్లిపోయింది. ఆ వెంటనే రజని గర్భవతి అయింది. ఇద్దరు పిల్లలు కలిగారు. ఇంతలోనే కేవలం 27 ఏళ్ల వయసులోనే రజని భర్తకు గుండె జబ్బు ఉందని తెలిసింది. రెండు స్టంట్లు వేశారు. మళ్లీ ఏడాదికే మరో స్టంటు వేయాల్సి వచ్చింది. అతనొక్కడే కష్టపడి కుటుంబ భారాన్ని మోయల్సిన పరిస్థితి.
Also read: ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే...
Also read: బంగాళాదుంపలతో చేసిన వంటలను రుచి చూసే ఉద్యోగం... జీతం ఎంతంటే...
Also read: తరగని అందం అనసూయకే సొంతం
రజని పీహెచ్ డీ ఆశను చంపేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎక్కడా దొరకలేదు. కరోనా కాలం మొదలయ్యాక ఇంకా కష్టాలు ఎక్కువయ్యాయి. ఇంట్లో చిన్న పిల్లలు, అనారోగ్యం పాలైన భర్త.... వారిని చూసుకోవాల్సిన బాధ్యత రజనిదే. ఉద్యోగం దొరక్కపోయేసరికి చివరికి స్వీపర్ గా మారింది. నాలుగు నెలలుగా జీహెచ్ఎమ్ సీలో పనిచేస్తోంది. రోడ్లు ఊడ్చడం, గడ్డి పీకడం వంటి పనులు చేస్తోంది. తెలిసిన వాళ్లంతా నువ్వు చదివిన చదువేంటి? నువ్వు చేసే పనేంటి? అని వేళాకోళామాడుతున్న కుటుంబం కోసం సర్దుకుపోతోంది రజని. ఆమె కోరిక ఒక్కటే... తన చదువుకు తగ్గ ఉద్యోగం ఇవ్వమని కోరుతోంది. ఆ సాయం మీరు చేయగలిస్తే చేయండి.. లేదా చేసే స్థాయిలో ఉన్నవారికి ఆమె గురించి చెప్పండి.