Potato taster: బంగాళాదుంపలతో చేసిన వంటలను రుచి చూసే ఉద్యోగం... జీతం ఎంతంటే...
మీకు బంగాళాదుంపలతో చేసిన వంటకాలంటే ఇష్టమా? అయితే ఈ ఉద్యోగం మీ కోసమే.
ప్రపంచంలో బంగాళాదుంపకు చాలా మంది అభిమానులున్నారు. వాటితో చేసిన వంటకాలంటే చెవి కోసుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ వింత ఉద్యోగ ప్రకటన ఇన్ స్టాలో హల్ చల్ చేస్తోంది. యూకేకు చెందిన రెస్టరెంట్ బొటానిస్ట్ తమ ఇన్ స్టా ఖాతాలో ఈ ఉద్యోగ ప్రకటనను ఇచ్చింది. తమ రెస్టరెంట్ లో వండిన బంగాళాదుంప వంటకాలను రుచి చూసేందుకు ఓ వ్యక్తి కావాలని ఆ ప్రకటన సారాంశం. ఇంకేముంది ఆ పోస్టు కాస్త వైరల్ గా మారింది. ఈ ఉద్యోగం పేరు ‘రోస్ట్ రివ్యూవర్’గా చెప్పింది. ఇది పార్ట్ టైమ్ ఉద్యోగం.
ఇన్ స్టాలో ఇచ్చిన ప్రకటన ప్రకారం.... రోస్ట్ రివ్యూవర్ గా ఎంపికైన వ్యక్తి సెప్టెంబర్ 19న తమ రెస్టారెంట్ కు రావాలి. తనతో పాటు మరో అయిదుగురి వరకు తెచ్చుకోవచ్చు. వారంతా అక్కడ చెఫ్ లు వండిన బంగాళాదుంప వేపుళ్లు, కాల్చిన బంగాళా దుంప ముక్కలు తినాలి. అవెలా ఉన్నాయో చెబుతూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో కథనాలు రాయాలి. ఇందుకు రోస్ట్ రివ్యూవర్ గా ఎంపికైన వ్యక్తికి అయిదు వందల పౌండ్లు ఇస్తారు. అంటే మన రూపాయల్లో యాభైవేల రూపాయలన్నమాట. ఒక్కసారి టేస్టు చూసి రివ్యూ రాసినందుకే ఈ మొత్తం చెల్లిస్తారు. నెలలో ఎన్నిసార్లు ఇలా పిలిచి ఫుడ్ టేస్టు చేయమన్నా కూడా, ప్రతి రివ్యూకు అయిదువందల పౌండ్లు చెల్లిస్తారు. తమ తమ ఉద్యోగాలు చేసుకుంటూనే రోస్ట్ రివ్యూవర్ ఉద్యోగాన్ని కూడా చేసుకోవచ్చు. అందుకే యూకే ఈ పోస్టు వైరల్ అయింది.
బిస్కట్ టేస్టర్....
గతంలో యూకేకు చెందిన బోర్డర్ బిస్కెట్క్ కూడా ఇలాంటి ఓ వింత ఉద్యోగాన్ని ప్రకటించింది. అదేంటంటే... వారు తయారుచేసిన బిస్కెట్లను రుచి చూసే ఉద్యోగం. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారికి రకరకాల పరీక్షలు నిర్వహించారు. బిస్కెట్లపై ఎంత పరిజ్ఞానం ఉందో తెలుసుకున్నారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్లను ఈ ఉద్యోగానికి ఎంపిక చేసుకున్నారు. జీతం ఎంత ఇచ్చారో తెలుసా? ఏడాదికి 40 వేల పౌండ్లు. అంటే మన కరెన్సీలో నలభై లక్షల రూపాయలు. మన కస్టమర్లకు మంచి నాణ్యమైన, రుచికరమైన బిస్కెట్లను అందించడమే లక్ష్యంగా ఆ సంస్థ ఈ కొత్త ఉద్యోగాన్ని సృష్టించింది. ఈ ఉద్యోగానికి ఎంపికైనవారికి బిస్కెట్లు మాస్టర్లు అని పిలుస్తున్నారు.
ప్రముఖ చాక్లెట్ తయారీ సంస్థ క్యాడ్ బరీ కూడా 2019లో చాక్లెట్ టేస్టర్ ఉద్యోగానికి కొంతమందిని ఎంపిక చేసుకుంది. ఇప్పటికే చాలా టీ ఉత్పత్తి సంస్థలు టీ రుచిని చూసి చెప్పే ‘టీ మాస్టర్ల’ ఉద్యోగాలను భర్తీ చేశాయి. భవిష్యత్తులో ఇలాంటి ఉద్యోగాలు అన్ని ఆహారపు తయారీ సంస్థలలో పుట్టుకొచ్చేలా కనిపిస్తున్నాయి.
Also read:పిల్లల లంచ్ బాక్సు రెసిపీ... కొత్తిమీర రైస్
Also read: పని ఒత్తిడి పెరుగుతోందా... మగవాళ్ల కన్నా ఆడవాళ్లకే ముప్పు ఎక్కువ
Also read: ఎర్రబియ్యం తింటే బానపొట్ట మాయం... మధుమేహులకు అమృతం