Heart attack: పని ఒత్తిడి పెరుగుతోందా... మగవాళ్ల కన్నా ఆడవాళ్లకే ముప్పు ఎక్కువ
ఉద్యోగినులకు పని ఒత్తిడి పెరిగితే గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువని కొత్త అధ్యయనం చెబుతోంది.
ఇంటా బయటా పనులతో బిజీగా మారిపోయింది ఆధునిక మహిళ. కుటుంబ బాధ్యతలతో పాటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలు తమకు తెలియకుండానే ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా పని ఒత్తిడి కారణంగా విపరీత అలసట, నిద్రలేమి బారిన పడే మహిళలకు గుండెపోటు వచ్చే అవకాశం ఉందంటూ కొత్త అధ్యయనం తేల్చింది. సాధారణంగా మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, ఊబకాయం వంటివి గుండె జబ్బులకు దారి తీస్తాయి. కానీ అలాంటి అలవాట్లు లేని మహిళలు కూడా పని ఒత్తిడి వల్ల కలిగే ఇతర సమస్యల వల్ల గుండె పోటుకు గురయ్యే అవకాశం ఉన్నట్టు యూరోపియన్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ చేసిన అధ్యయనంలో తేలింది. అయితే పురుష ఉద్యోగులతో పోలిస్తే మహిళలకే ఈ ముప్పు ఎక్కువని అధ్యయనకర్తలు చెబుతున్నారు.
ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ మార్టిన్ హాన్సెల్ మాట్లాడుతూ ‘నిజానికి ధూమపానం, ఊబకాయం పురుషుల్లోనే ఎక్కువ. కానీ వారి కన్నా మహిళలకు గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది. దానికి కారణం ఒత్తిడి కారణంగా కలిగే సైడ్ ఎఫెక్టులే’ అని వివరించారు. పరిశోధకులు 22,000 మంది పురుషులు, మహిళలపై 2007, 2012, 2017 సంవత్సరాలలో చేసిన సర్వేలోని డేటాను పరిశీలించాక ఈ అధ్యయనం తాలూకు ఫలితాన్ని ప్రకటించారు.
సర్వేలో పాల్గొన్న స్త్రీ పురుషులిద్దరూ పనిలో ఒత్తిడి పెరిగినట్టు చెప్పారు. 2012లో 59 శాతం మంది పని ఒత్తిడి పెరిగిందని చెప్పగా, 2017లో 66శాతం మంది ఒత్తిడి అధికంగా ఉన్నట్టు తెలిపారు. వీరు అలసట కూడా పెరిగినట్టు పరిశోధకులకు తెలియజేశారు. సుదీర్ఘ పనివేళలు, ఉద్యోగ-వ్యక్తిగత జీవితాల మధ్య సంఘర్షణ, పిల్లల బాధ్యతలు, ఆర్ధిక అభద్రత... ఇలా చాలా కారకాలు ఒత్తిడికి కారణాలుగా మారుతున్నాయి.
ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలి. నిద్రకు ప్రాముఖ్యత ఇవ్వాలి. కచ్చితంగా ఎనిమిది గంటల పాటూ నిద్రపోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. నలుగురితో కాసేపు నవ్వుతూ మాట్లాడాలి. డార్క్ చాక్లెట్ ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి. అప్పుడప్పుడూ చిన్నముక్క తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా తినడం వల్ల ఒత్తిడి ఛాయలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ధూమపానం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి.
Also read: మహిళలు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి? నెలసరికి ముందా? తరువాతా?
Also read: ఎర్రబియ్యం తింటే బానపొట్ట మాయం... మధుమేహులకు అమృతం
Also read: అక్షరాస్యతలో భారత స్థానం ఇంకా అక్కడే...