World Literacy Day: అక్షరాస్యతలో భారత స్థానం ఇంకా అక్కడే...
నేడు ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం. ఈ సందర్భంగా మన దేశం అక్షరాస్యతలో ఏ స్థానంలో ఉందో, ఏ రాష్ట్రం ముందుందో తెలుసుకుందాం.
ప్రపంచ దేశాల్లో అక్షరాస్యతలో ముందున్న అయిదు దేశాల పేర్లు చెప్పగలరా? అని అడిగితే... మొదట ఎవరైనా అమెరికా, బ్రిటన్ ఇలా చెప్పడం మొదలుపెడతారు. ఎందుకంటే అవే ప్రపంచంలో ధనిక దేశాలుగా, బలమైన రాజ్యాలుగా పేరుపొందాయి. నిజానికి ప్రపంచంలో ధనిక దేశాలు లేదా అత్యధిక జనాభా కలిగిన దేశాలేవి అక్షరాస్యతలో ముందుస్థానంలో లేవు. అతి చిన్నదేశాలు అత్యధిక అక్షరాస్యతను సాధించి మొదటి అయిదు స్థానాల్లో నిలిచాయి.
ఫిన్ లాండ్ మొదటి స్థానంలో ఉండగా, నార్వే, ఐస్లాండ్, డెన్మార్క్, స్వీడన్ దేశాలు తరువాతి స్థానాలను వరుసగా సాధించాయి. స్విట్టర్లాండ్ ఆరో స్థానాన్ని, అమెరికా ఏడవ స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇక ఫ్రాన్స్ 12, బ్రిటన్ 17వ స్థానాల్లో ఉన్నాయి. మనదేశం ఈ దరిదాపుల్లో ఎక్కడా లేదు. అంతెందుకు అతి చిన్న దేశాలైన లక్సమ్ బర్గ్, అజర్ బైజాన్, అండోరా వంటివి కూడా వందశాతం అక్షరాస్యతను సాధించాయి.
మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతోంది. 1947లో మన దేశ అక్షరాస్యతా శాతం కేవలం 12. ఇప్పుడు 74 శాతం. 2001 ఇది 60.47 శాతంగా ఉండేది. వందశాతం సాధించడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. ప్రపంచంలో ప్రతి ముగ్గురు నిరక్ష రాస్యులలో ఒకరు కచ్చితంగా భారతదేశంలో ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. 2005 లెక్కల ప్రకారం 127 దేశాల జాబితాలో అక్షరాస్యతలో భారత్ 106 వస్థానంలో నిలిచింది. 2017లో 105వ స్థానానికి వచ్చింది. పన్నెండేళ్ల కాలంలో అక్షరాస్యత శాతంలో పెద్దగా మార్పు రాకపోవడం శోచనీయం.
ముందున్న కేరళ
మనదేశంలో అక్షరాస్యతలో ముందున్న రాష్ట్రం కేరళ. గతేడాది లెక్కల ప్రకారం కేరళ 96.2 శాతం అక్షరాస్యతను సాధించింది. వందశాతం సాధించే దిశగా దూసుకుపోతోంది. 2016-20 మధ్య కాలంలో లక్షమందికి పైగా ప్రజలను అక్షరాస్యులను చేసి రికార్డు సాధించింది. వీరందరూ కూడా అట్టడుగు వర్గాలకు చెందినవారే. మత్స్యకారులు, ఉపాధి కార్మికులు, వారి కుటుంబాలను ఎంపిక చేసుకుని వారందరినీ అక్షరాస్యులుగా చేసింది.
తెలుగు రాష్ట్రాలెక్కడ?
నేషనల్ శాంపిల్ సర్వే 2017-18 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 66.4 శాతం మంది అక్షరాస్యులు ఉండగా, తెలంగాణాలో 72.8 శాతం మంది ఉన్నట్టు గుర్తించారు.
అసలేంటీ అక్షరాస్యతా దినోత్సవం?
యునెస్కో సభ్యదేశాల విద్యామంత్రులంతా కలిసి 1965 నవంబర్ లో ప్రతి ఏడాది అక్షరాస్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 1966 నుంచి ప్రతి సెప్టెంబరు8 న అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహించడం ప్రపంచవ్యాప్తంగా మొదలైంది.
Also read: సంగీతంతో మానసికోల్లాసం... ఒత్తిడి మాయం
Also read: ఈ బిర్యానీల రుచి అదిరిపోతుంది... ఒక్కసారి తిని చూడండి
Also read: జ్యూయలరీ ప్రకటనలో పెళ్లికూతురిగా ట్రాన్స్ జెండర్... ఇన్ స్టాలో లక్షల వ్యూస్