Music Therapy: సంగీతంతో మానసికోల్లాసం... ఒత్తిడి మాయం
ఒత్తిడి బారిన పడకుండా సంతోషంగా జీవించాలనుందా? అయితే రోజూ చక్కటి సంగీతాన్ని వినడం అలవాటు చేసుకోండి.
కరోనాతో కనిపించని మానసిక ఒత్తిడి జనాలను చిత్తు చేస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉద్యోగ నిర్వహణ కూడా గంటగంటలుగా సాగుతూ ఒత్తిడి స్థాయిని మరింత పెంచుతోంది. దీని వల్ల మానసిక ఆందోళన వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. అందుకే ఒత్తిడిని దరి చేరకుండా సంగీతంతో సాంత్వన పొందమని చెబుతున్నారు మానసిక వైద్యులు.
మనసు పెట్టి వింటే సంగీతం మంచి నేస్తంలా మారుతుంది. మనసుకి హాయిని కలిగిస్తుంది. ఆలోచనలను రీఫ్రెష్ చేస్తుంది. బాధల్ని మరపుకు తెస్తుంది. రోజూ కాసేపు సంగీతం వినడం అలవాటు చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఓసారి మసాచుసెట్స్ లోని జనరల్ ఆసుపత్రిలో గుండెజబ్బులతో బాధపడుతున్న వారికి కొద్ది రోజుల పాటూ మ్యూజిక్ థెరపీ ఇచ్చారు. శ్రావ్యమైన సంగీతాన్ని వినిపించారు. వారిలో చాలా మందికి వ్యాధి తగ్గుముఖం పట్టడాన్ని గుర్తించారు. రోజూ మధురమైన సంగీతం వినేవారిలో గుండె పోటు వచ్చే అవకాశం తగ్గుతుందని ఫిన్ లాండ్ పరిశోధకులు చేసిన అధ్యయనంల తేలింది.
చక్కటి పాటలు మానసికంగా ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఈ లోకం నుంచి ఊహాలోకంలో విహరించేలా చేస్తాయి. విషాదభరిత పాటలు వినడం వల్ల ఉపయోగం లేదు. హాయిగా సాగిపోయే సంగీతాన్ని వినాలి. దీనివల్ల శరీరంలో సిరోటిన్ అనే రసాయనం విడుదలవుతుంది. కేవలం సంతోషంగా అనిపించినప్పుడే శరీరం సిరోటిన్ ను విడుదల చేస్తుంది. దీని వల్ల ఒత్తిడి పోయి మంచి నిద్ర పడుతుంది. ఒత్తిడి వల్ల కలిగి ఇతర సమస్యలు డిప్రెషన్, ఆందోళన మన దరికి చేరవు. అంతేకాదు చక్కటి పాటలు వింటూ భోజనం చేసేవారు తమకు తెలియకుండా తక్కువ తింటారట. దీని బరువు తగ్గే అవకాశం ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. చంటి పిల్లలపై పాటలు మంచి ప్రభావమే చూపిస్తాయి. ముఖ్యంగా తల్లి లాలిపాటలు పాడుతూ ఉంటే, పిల్లలకి త్వరగా మాట్లాడే సామర్థ్యం వస్తుంది.
అంతేకాదు శస్త్రచికిత్సకు వెళ్లే రోగులకు పావుగంట ముందు మధురమైన సంగీతాన్ని వినిపిస్తే, వారు ఆపరేషన్ సమయంలో ఎలాంటి ఆత్రుతకు ఒత్తిడికి గురవ్వకుండా ఉండడాన్ని ఫ్రాన్స్ కు చెందిన అధ్యయనకర్తలు కనిపెట్టారు. ముఖ్యంగా కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్లేవారికి అనస్థీషియా ఇచ్చేముందు ఇలా సంగీతం వినిపించి, ఆ తరువాత ఆపరేషన్ థియేటర్లోకి పంపిస్తే శస్త్రచికిత్స సమయంలో వారు స్థిరంగా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. కనుక మధురమైన సంగీతం అన్ని వర్గాల వారిపై మంచి ప్రభావమే చూపిస్తుంది.
Also read:కాఫీ తాగుతున్నారా? అయితే ఈ మూడు తప్పులు చేయకండి
Also read:జ్యూయలరీ ప్రకటనలో పెళ్లికూతురిగా ట్రాన్స్ జెండర్... ఇన్ స్టాలో లక్షల వ్యూస్