(Source: ECI/ABP News/ABP Majha)
Blue tea: ఈ టీ తాగితే .. అందం అమాంతం పెరిగిపోతుందా!
అందంగా కనిపించాలని, ఆరోగ్యంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. ఈ బ్లూ టీ తాగడం అలవాటు చేసుకుంటే ఆ రెండూ మీ సొంతమవుతాయి.
‘బటర్ ఫ్లై పీ ఫ్లవర్స్’ (Butterfly pea flowers) అంటే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు. తెలుగిళ్లల్లో వీటిని శంఖం పూలు అంటారు. ఎక్కువగా ఇళ్ల ముందు కనిపించే తీగమొక్కలు ఇవి. శివుడికి ఆ పూలు ప్రీతిపాత్రమైనవి. వాటితో తయారుచేసే టీ ‘బ్లూ టీ’. హెర్బల్ టీలలో ఇదీ ఒకటి. ఇప్పుడు చాలా మంది సెలెబ్రిటీల బ్యూటీ మంత్ర ఈ బ్లూ టీనే. బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ బ్లూ టీ తాగుతున్నట్టు చెబుతూ ఆ ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ బ్లూటీ తాగడం వల్ల అందం కూడా ఇనుమడిస్తుందంటున్నారు ఆహారనిపుణులు.
కెఫీన్ నిండుగా ఉండే టీ, కాఫీల కన్నా బ్లూ టీ లాంటి హెర్బల్ టీలు తాగడం వంద రెట్లు ఉత్తమం. శంఖం పూలలో యాంటీ గ్లైకేషన్ గుణాలు ఎక్కువ. ఇవి వయసు పెరుగుతుండడం వల్ల వచ్చే చర్మం సమస్యలను రాకుండా నిరోధిస్తాయి. కొలాజిన్ ఉత్పత్తిని పెంచి చర్మం సౌందర్యాన్ని కాపాడతాయి. ముఖంపై ముడతలు రాకుండా అడ్డుకుంటాయి. 2018లో చేసిన ఓ స్టడీ ప్రకారం శంఖం పూలతో చేసిన ఫేస్ మాస్కులు ముఖంపై దురదలు, మొటిమలు, చర్మం పొడిగా మారడం వంటి సమస్యలను దూరంగా ఉంచుతాయి. ఈ టీ వల్ల చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. ఇందులో ఉండే ఆంథోసైనిన్ జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు సహకరిస్తుంది. మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మంపై పొరని కాపాడడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. బ్లూ టీ తాగడం మొదలుపెట్టిన పదిహేను రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది.
ఎలా చేయాలి?
శంఖం పూలను బాగా ఎండబెట్టి, గాలి చేరని సీసాల్లో భద్రపరచుకోవాలి. టీ తాగాలనిపించినప్పుడు వాటిలో మూడు, నాలుగు ఎండు పూలను తీసి వేడినీళ్లలో వేసి కాసేపు మరిగించాలి. నీరంతా నీలం రంగులోకి మారుతుంది. ఓ గ్లాసులోకి వడకట్టకుని, అందులో కాస్త తేనె చేర్చుకుని తాగాలి. తీపి అవసరం లేదు అనకునే వాళ్లు, ఏం కలుపుకోకుండా నేరుగా తాగేయవచ్చు. కావాలనుకుంటే లెమన్ గ్రాస్, అల్లం ముక్క లాంటివి వేసి మరిగించుకుని తాగొచ్చు.
అన్ని వయసుల వారు దీన్ని తాగవచ్చు. గర్భిణులు, పాలిచ్చే తల్లలు మాత్రం వైద్యుని సలహాను తీసుకుని తాగడం మంచిది.
Also read: చపాతి, పూరీ, పుల్కా... వీటిల్లో ఏది తింటే మంచిది?
Also read: ఎర్రబియ్యం తింటే బానపొట్ట మాయం... మధుమేహులకు అమృతం
Also read: మనం తినే ఆహారం సరిపోదంట.... మరికొంచెం గట్టిగా తినమంటున్నారు...