How Do You Make Choices Without Regret: ఈ పొరపాట్లు అసలు చేయొద్దు, తర్వాత చాలా రిగ్రెట్ ఫీలవుతారు!
Life Style: జీవితం చివరి దశలో ఏదో చేయలేకపోయామనే రిగ్రెట్ వెంటాడకుండా ఉండాలంటే ఇప్పుడే ఈ పొరపాట్లు చేయకూడదు. అప్పుడే సంతృప్తిగా ఉండగలుగుతారు.
What To Do When You Regret Your Life Choices: ఒక డెబ్భై, ఎనభైయేళ్లు వచ్చాక..ఇలా చేసుంటే నా జీవితం నేను అనుకున్నట్లుగా ఉండేదేమో, నేను ఇది చేయలేకపోయాను, అది చేయాలేకపోయాను అనే రిగ్రెట్స్ ఉంటే ఆ నిస్సహాయ స్థితి ఊహించటానికే బాలేదు కదూ! మరి శరీరం సహకరించినపుడు తీసుకునే తప్పుడు నిర్ణయాలే వయసు మళ్ళాక రిగ్రెట్ ఫీలవటానికి కారణమవుతాయి. అవేంటో తెలుసుకుంటే యుక్తవయసులో ఉన్నపుడే అధిగమించి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవచ్చు.
మీ కలలను, ఇష్టాలను పట్టించుకోకపోవటం
నచ్చిన పనిలో మునిగిపోవటాన్ని మించిన జీవిత సార్థకత ఇంకోటి ఉండదు. సంగీతం, డాన్స్, ఆర్ట్ వంటి చిన్ననాటి ఇష్టాలో, మీకంటూ కొత్త ఐడెంటిటీ తెచ్చుకోవాలనుకున్న బిజినెస్ ఐడియానో, మీరు ఎప్పట్నుంచో చేయాలనుకున్న ఒక అడ్వెంచరో ఇలా..మీ సోల్ ను సంతృప్తిపరిచే పనులన్నింటినీ పట్టించుకోకుండా ఏదో బతుదెరువు కోసం సర్వైవల్ మోడ్ లో జీవిస్తుండటం వల్ల జీవితపు చివరిదశలో ఆలోచిస్తే ఎందుకోసం ఇంత తృప్తిలేని జీవితాన్ని బతికామనిపిస్తే, ఆ పొరపాటు దిద్దుకోవటానికి మిగిలిన జీవితకాలం సరిపోదు. అందుకని ఇప్పుడే మీ ఇష్టాలు, కలలు, ఆశయాలు తెలుసుకొని వాటి వెంట ఆనందంగా పరిగెత్తండి. మీరు అందులో నేర్పు పొందలేకపోయినా సరే..ప్రయత్నించాననే సంతృప్తి మిగులుతుంది. లేదా ఆ కల మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడుతుంది.
వేరే వాళ్ల దారిలో వెళ్ళి సక్సెస్ వెతుక్కోవటం
మీ సైజ్ కాని చెప్పుల్లో కాలు పెట్టి చూసి, అవి మీకు పనికిరావని వదిలేసారా ఎప్పుడైనా? మీకు ఇరుకుగా లేదా వదులుగా, ఇబ్బందిగా ఉన్నంతమాత్రాన అవి పనికిరాని చెప్పులు కావు. వేరే వాళ్లకు పనికొస్తాయి. సక్సెస్ కూడా అంతే. వేరే వాళ్లు ఏదో సాధించారని అదే దారిలో మీరు పరిగెడితే కొన్నాళ్లకు ఇమడలేకపోతారు. సక్సెస్ అనేది ఎవరిది వారికి ప్రత్యేకం. ఈ చిన్న విషయం ఈరోజు యువత గుర్తించలేకపోతోంది. పక్కనవారు డాక్టరో, యాక్టరో అయ్యారని సెల్ఫ్ పిటీ తో, వారి కల ఏమిటో తెలుసుకునే సమయం ఇచ్చుకోకుండా ఎదుటివారు ఇది చేశారు కనుక మనం చేయాలి అనే ధోరణిలో పరుగులు పెడుతున్నారు. అందుకే, మీ గోల్స్ ఏమిటో ముందు తెలుసుకొని వాటి కోసం దారిని ఏర్పరచుకోండి.
వర్క్ తప్ప వేరే జీవితం లేకపోవటం
మీ ప్యాషన్, ప్రొఫెషన్ ఒకటే అయితే సమస్య లేదు కానీ, కేవలం సంపాదన కోసమే జీవితాంతం గొడ్డులా కష్టపడితే, చివరకు మీకంటూ ఒక పర్పస్ లేకుండా పోతుంది. ఆఫీస్, ఇల్లు ఇదే ప్రపంచంగా బతకకుండా మీకంటూ చిన్ని చిన్ని ఆనందాలు ఉండాలి. ఫ్యామిలీ అంతా ఒక చోట చేరి జ్ఞాపకాలను పంచుకోవటమో, మీ హాబీలకు పనిచెప్పటమో, ఎప్పటినుంచో వాయిదా వేసిన అడ్వెంచర్ ట్రిప్ పూర్తి చేయటమో ఇలాంటివి ఎంతో చిన్న విషయాలే కానీ వీటిని లెక్కచేయకుండా ఎప్పుడూ వర్క్ చేస్తూనే కూర్చుంటే తర్వాత చాలా రిగ్రెట్ అవుతారు.
రిస్క్ తీసుకోకపోవటం
కంఫర్ట్ జోన్ లో బతకటం అంటే బావిలో కప్పకు బయటి ప్రపంచం ఏమీ తెలియకుండా బతుకుతున్నట్టు! బావి బాగానే ఉన్నా, జీవితంలో ఇంకెంతో ఉందనే నిజానికి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. అప్పుడప్పుడు రిస్క్ తీసుకోవటం వల్ల జీవితంలో కొత్త దారులు తెరుచుకుంటాయి. అవి ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఫెయిల్ అవుతామనే భయం సహజం. కానీ చివరి దశలో ఫెయిల్ అయినందుకు రిగ్రెట్స్ ఉండవు. ప్రయత్నించకపోతే మాత్రం రిగ్రెట్ అవటం తప్పదు.