(Source: ECI/ABP News/ABP Majha)
Rice Balls: మిగిలిన అన్నంతో ఇలా రైస్ బాల్స్ చేయండి, రుచి అదిరిపోతుంది
ఇంట్లో అన్నం మిగిలిపోతే ఇలా రైస్ బాల్స్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి.
ప్రతి ఇంట్లో అన్నం మిగిలిపోవడం సహజం. ఆ మిగిలి పోయిన అన్నాన్ని పడేయకుండా ఎంతో మంది లెమన్ రైస్ చేసుకుని తింటూ ఉంటారు. కేవలం అది మాత్రమే కాదు, టేస్టీ రైస్ బాల్స్ వండితే ఇంకా బావుంటాయి. పిల్లలకు ఇవి కచ్చితంగా నచ్చుతాయి. ఇవి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లా మాత్రమే కాదు, సాయంత్రం స్నాక్స్‌లా కూడా తినవచ్చు.
కావాల్సిన పదార్థాలు
అన్నం - ఒక కప్పు
కొబ్బరి తురుము - అర కప్పు
బియ్యప్పిండి - అర కప్పు
ఉల్లిపాయ - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
పచ్చిమిరప కాయ - రెండు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
తయారీ ఇలా
ఒక గిన్నెల్లో అన్నం వేసి మెత్తగా నలపాలి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. అవసరమైతే కాస్త నీళ్లు పోయాలి. వాటిని గుండ్రంగా చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె బాగా వేడెక్కాక బాల్స్ ను వేసి వేయించాలి. అవి బ్రౌన్ రంగులోకి మారే వరకు వేయించాలి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తినేటప్పుడు కెచప్ తో కలిపి తింటే మంచి టేస్టీగా ఉంటాయి.
అన్నం తినడం బోర్ కొట్టిన వారు ఇలా రైస్ బాల్స్ చేసుకుని తింటే రుచిగా ఉంటాయి. పిజ్జా, బర్గర్ లతో పోలిస్తే ఇవి మంచి స్నాక్స్ అనే చెప్పాలి. ఇందులో వాడినవన్నీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. కాబట్టి అన్నం మిగిలిపోయినప్పుడు వీటిని తరచూ చేసుకుంటూ ఉంటే మంచిదే.
అన్నం మిగిలిపోతే దోశెలు కూడా వేసుకోవచ్చు. దోశెలు వేయడం చాలా సులువు. మిగిలిపోయిన అన్నంలో ఒక కప్పు రవ్వ వేసి బాగా కలపాలి. అలాగే పులిసిన పెరుగును కూడా వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. క్రిస్పీగా రావాలనుకుంటే చిటికెడు వంటసోడా కలుపుకోండి. వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పెనం పెట్టాలి. అది వేడెక్కాక నూనె వేసి అన్నం మిశ్రమంతో దోశెల్లా పోసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి.
ఒకసారి మిగిలిపోయిన అన్నంతో పైన చెప్పిన రెండు రకాల రెసిపీలు ప్రయత్నించి చూడండి. ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతాయి. ముఖ్యంగా పిల్లలకు ఈ రెండు నచ్చే వంటకాలు. ఒకసారి తినిపిస్తే వారు మళ్లీ మళ్లీ అడుగుతారు.
Also read: రోజులో ఎక్కువకాలం ఏసీలో ఉంటున్నారా? గుండె జాగ్రత్త
Also read: పీడకలలు వస్తుంటే తేలికగా తీసుకుంటున్నారా? వాటి ఫలితం ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.