Kanchipuram Idly Recipe : కాంచీపురం ఇడ్లీ.. రెసిపీ వెరీ డెడ్లీ
Tasty Idly Recipe : రోటీన్ ఇడ్లీలకు బదులుగా.. ఎంతో రుచిగా ఉండే కాంచీపురం ఇడ్లీలను చాలా సింపుల్‌గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు.
Tasty Breakfast Recipe : కాకినాడ కాజా.. ఆత్రేయపురం పూతరేకులు ఎంత ఫేమస్సో.. కాంచీపురం ఇడ్లీ కూడా అంతే ఫేమస్. ఎందుకంటే ఇక్కడ రోటీన్ ఇడ్లీకి బదులు కాస్త వెరైటీగా.. నోటికి మరింత రుచిగా ఉండేలా వీటిని తయారు చేస్తారు. రోజూ ఇడ్లీనేనా అని మీ ఇంట్లో వాళ్లు అంటే కనుక.. కాంచీపురం ఇడ్లీని రుచి చూపించేయండి. ఇంకో రెండు ఇడ్లీలు వేయమంటూ తినేస్తారు.
ఈ దక్షిణాది వంటకంలో జీలకర్ర, మిరియాలు, కరివేపాకు వంటి వంట దినుసులు వేసి కుక్ చేస్తారు. అదేలా అనుకుంటున్నారా? ఈ పూర్తి సాంప్రదాయమైన వంటకం.. రుచిలో డెడ్లీగా ఉంటే.. ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ కాంచీపురం ఇడ్లీ తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలు కావాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
ఇడ్లీ పిండి - మీకు నచ్చినంత
ఉప్పు - రుచికి తగినంత
నెయ్యి - 2 టీస్పూన్లు
కరివేపాకు - 1 రెబ్బ
ఇంగువ - అర టీస్పూన్
శొంఠి - అరటీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఎండుమిర్చి - 2
శనగపప్పు - 1 టీస్పూన్
కాంచీపురం ఇడ్లీ తయారీ విధానం
కడాయి తీసుకుని స్టౌవ్ వెలిగించండి. దానిలో నెయ్యి వేసి.. ఇంగువ, శొంఠి పొడి, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు అన్ని వేసి తాళింపు వేయండి. ఇప్పుడు ఈ తాళింపును ఇడ్లీ కోసం రెడీ చేసుకున్న మిశ్రమంలో వేసి బాగా కలపాలి. దానిపై మూత వేసి పక్కన పెట్టండి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా బాగా పులియనివ్వండి. ఉదయాన్నే మరోసారి పిండిని బాగా కలిపి.. ఉప్పు వేయండి. అది సరిగా మిక్స్ అయ్యేవరకు బాగా కలిపి.. ఇడ్లీ స్టీమర్లో ఇడ్లీలు వేసుకోవచ్చు.
మసాల దినుసలతో చేసే ఈ కాంచీపురం ఇడ్లీలు టేస్ట్‌లో ఎవరెస్ట్‌ను మించిపోతాయి. మీ నోటికి ఎంతో రుచిని అందిస్తాయి. ఈ ఇడ్లీలను కొబ్బరి, పల్లీ చట్నీలతో హాయిగా లాగించవచ్చు. అల్లం, నిమ్మకాయ ఆవకాయలు కూడా వీటి టేస్ట్‌ని పెంచుతాయి. సాంబర్తో కలిపి తీసుకుంటే దీని రుచి మరింత రెట్టింపు అవుతుంది. జ్వరం వచ్చి నోరు చచ్బబడిపోయినట్లు అనిపిస్తే.. మీరు ఈ కాంచీపురం ఇడ్లీలు హాయిగా తయారు చేసుకుని తినేయొచ్చు.
ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. తాళింపులో ఉపయోగించే శొంఠి పొడి.. దగ్గు, జలుబు వంటి గొంతు సమస్యలను దూరం చేస్తుంది. శ్వాస సమస్యలున్నా కూడా తగ్గిస్తుంది. తాళింపులో వినియోగించే కరివేపాకు, జీలకర్ర, శనగపప్పు, నెయ్యి ఇలా అన్ని కూడా ఆరోగ్యానికి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చేవే. కాబట్టి రోటీన్ ఇడ్లీలకు చెక్ పెడుతూ.. మీరు హాయిగా కాంచీపురం ఇడ్లీ తయారు చేసుకుని లాగించేయండి.
Also Read : మీలో ఆల్ఫా మేల్ లక్షణాలు ఉన్నాయా? యానిమల్ సినిమాలో చెప్పింది దీని గురించేనా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.