Beauty with Coffee: కాఫీ పొడితో ఇన్ని ప్రయోజనాలా? బ్యూటీ పార్లరే మీ ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది
కాఫీ కేవలం తాగడానికికే కాదు, ముఖ సౌందర్యాన్ని పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది.
కాఫీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అలాగే కాఫీ పొడితో చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు.కాఫీ గింజల్లో ఉన్న సహజసిద్ధమైన లక్షణాలు చర్మ సమస్యలను దూరం చేసి కాంతిమంతంగా మారుస్తాయి. ఇప్పుడు కాఫీ పొడిని బ్యూటీ ఉత్పత్తుల్లో వాడడం చాలా పెరిగింది. అనేక రకాల చర్మ సమస్యలకు కాఫీ పొడితో చెక్ పెట్టచ్చు.
మొటిమలు
మొటిమల సమస్యతో బాధపడేవారు కాఫీ పొడితో కాస్త ఉపశమనం పొందచ్చు. మొటిమలు రావడానికి కొన్నిరకాల బ్యాక్టీరియాలు కారణమవుతాయి. వాటిని తుడిచిపెట్టేయడం వల్ల మొటిమల సమస్య అదుపులో ఉంటుంది. కాఫీపొడిలో కాస్త కొబ్బరి నూనె, పంచదార కలిపి మిశ్రమంలా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. కాసేపు సున్నితంగా మసాజ్ చేయాలి. ఓ పదినిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
మెరుపు కోసం
చర్మం కళావిహీనంగా మారిందా? అయితే కాఫీ పొడిలో కలబంద జెల్‌ను కలిపి మాస్క్‌లా ముఖానికి వేసుకోవాలి. ఈ మిశ్రమంతో తరచూ మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే చర్మం కాంతిమంతంగా మారుతుంది. సహజసిద్ధమైన మెరుపు వస్తుంది.
ముడతలు పోయేలా
కాలుష్యం వల్ల ముఖంపై ముడతలు, గీతలు, మచ్చలు వస్తూ ఉంటాయి. కాఫీ పొడితో వీటికి చెక్ పెట్టొచ్చు. కాఫీ పొడిలో, కాస్త కోకో పొడి (చాక్లెట్ పొడి) వేసి, పాలు కలిపి పేస్టులా చేసుకోవాలి. ఆ మిశ్రమంలో కాస్త నిమ్మరసం, తేనె కూడా కలిపి ముఖానికి పూయాలి. అలా పావుగంట పాటూ వదిలేయాలి. ఆ తరువాత చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి.
డార్క్ సర్కిల్స్‌కి
చాలా మందిని వేధించే సమస్య డార్క్ సర్కిల్స్. కాఫీ పొడిలో బ్లీచింగ్ చేస్తే లక్షణలు ఉంటాయి. ఒక స్పూను కాఫీ పొడిలో విటమిన్ ఇ నూనెను, కాస్త తేనెను కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ల కింద రాయాలి. పావుగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే డార్క్ సర్కిల్స్ మాయం అవుతాయి.
ముఖం పొడిబారుతోందా?
చర్మం పొడి బారే సమస్య ఉన్నవారికి ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది. కాఫీపొడి, పెరుగు కలిపి పేస్టులా చేసి ముఖానికి పూసుకోవాలి. కావాలంటే తేనె కూడా కలుపుకోవచ్చు. రాత్రి పూట ఈ ప్యాక్ వేసుకుని ఓ అరగంట పాటూ వదిలేసి తరువాత వాష్ చేసుకుంటే మంచిది.
పెదవులకు
పెదవులు పొడిబారుతూ ఇబ్బంది పెడుతున్నాయా? కాఫీ పొడిలో కరిగించిన నెయ్యి వేసి పెదవులపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తరువాత చూడండి పెదవులు మెరిసిపోవడం ఖాయం.
కాఫీ స్క్రబ్ ఇలా...
కాఫీ పొడితో చర్మంపై మురికిని తొలగించే స్క్రబ్ ను తయారుచేసుకోవచ్చు. కాఫీ పొడిలో, కొబ్బరినూనె కలిపితే స్క్రబ్ లా మారుతుంది. ముఖాన్ని ఓసారి తడుపుకుని ఈ మిశ్రమంతో మసాజ్ చేసుకోవాలి. చర్మంపై కనిపించని మురికి కూడా ఈ మసాజ్ వల్ల పోతుంది. చర్మం మెరుపులీనుతుంది.
Also read: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆవు పాలను తాగమంటున్న ఆరోగ్యనిపుణులు
Also read: మీ కుటుంబచరిత్రలో ఎవరికైనా క్యాన్సర్ ఉందా? అయితే వీటిని తినడం మానేయండి, రిస్క్ తగ్గుతుంది