Mothers Health: తల్లులూ మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో చెప్పే ఈ ఆరు పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోండి
ప్రతీ స్త్రీ తల్లి అయిన తర్వాత వారి ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గిపోతుంది. ఫలితంగా అనారోగ్యాలు దాడి చేస్తాయి. మహిళలు ఎక్కువగా వేధించే వ్యాధులకి సంబంధించి పరీక్షలు చేయించుకోవాలి.
తల్లులు ఇంట్లో పిల్లలు, భర్త కుటుంబాన్ని చూసుకుంటూ సమయం గడిపేస్తారు. వారి ఆరోగ్యం విషయానికి వస్తే మాత్రం నిర్లక్ష్యం వహిస్తారు. ఇక ఉద్యోగాలు చేస్తే తల్లులు వారి పని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడంలో మునిగిపోతారు. ఆరోగ్యాన్ని పట్టించుకొకపోవడం వల్ల 40 దాటిన తర్వాత అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి రాకూడదంటే ఈ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.
మధుమేహం: భారతీయ మహిళల్లో మధుమేహం ప్రాబల్యం 7.5 శాతంగా ఉంది. అందుకే రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. మధుమేహం మహిళల ఆరోగ్యంలో గర్భం, ప్రసవానంతరం, చనుబాలు ఇచ్చేటప్పుడు, మెనోపాజ్ వంటి వివధ దశల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని నిర్ధారించడానికి ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్(FPG) పరీక్ష, నోటి గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్( OGTT), గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ (HbA1c) పరీక్ష వంటి రక్త పరీక్షలు చేయించుకోవచ్చు. దీని ద్వారా మధుమేహం నిర్ధారణ అవుతుంది.
థైరాయిడ్: మహిళలు ఎక్కువగా థైరాయిడ్ సమస్యలతో బాధపడతారు. ఇది అనేక విధాలుగా మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొన్ని సార్లు ఆకస్మిక బరువు పెంచుతుంది. మరికొన్ని సార్లు బరువు తగ్గడానికి దారి తీస్తుంది. థైరాయిడ్ కోసం చేయించుకోవాల్సిన పరీక్షలు TSH (థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్) పరీక్ష లేదా T4 (థైరాక్సిన్) పరీక్ష లేదా మొత్తం థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్ష ఉన్నాయి.
విటమిన్ డి: భారతీయుల్లో 70 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని ఇటీవల ఒక అధ్యయనం వెల్లడించింది. ఆరోగ్యకరమైన ఎముకల పెరుగుదల, సమర్థవంతమైన రోగనిరోధక వ్యవస్థ, మధుమేహం, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కోసం మహిళలకు విటమిన్ డి తగినంత స్థాయిలో ఉండాలి. వయసు రీత్యా మహిళల్లో విటమిన్ డి ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. ఫలితంగా అవయవాల్లో నొప్పి, తరచుగా పగుళ్లు, ఎముకల బలహీనతకు దారి తీస్తుంది. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించి చికిత్స తీసుకోవడం ముఖ్యం.
పాప్ స్మెర్: గర్భాశయ క్యాన్సర్ ని ముందుగానే గుర్తించేందుకు 30 ఏళ్లు పైబడిన మహిళలు కటి పరీక్ష, పాప్, స్మెర్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకునేందుకు గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి. భారతీయ మహిళలు హెచ్ పీవీ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఈ క్యాన్సర్ వల్ల మరణించకుండా కాపాడుకోవచ్చు. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలికల దగ్గర నుంచి ఈ వ్యాక్సిన్స్ వేస్తారు. టీకాలు వేసినప్పటికీ 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు లైంగికంగా చురుకుగా ఉన్న మహిళలు పాప్ స్మెర్ పరీక్ష చేయించుకోవాలి.
మమోగ్రామ్: భారతదేశంలో క్యాన్సర్ మరణాలకు రొమ్ము క్యాన్సర్ ప్రధాన కారణం. దీన్ని ముందస్తుగా గుర్తించాలి. ప్రతి స్త్రీ 40 ఏళ్లు పైబడిన వారికి మమోగ్రామ్ పరీక్షలు చేయించుకోవాలి. గడ్డలు, నొప్పి లేదా రొమ్ము నుంచి స్రావం కారడం వంటివి కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులని సంప్రదించాలి.
బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్: మహిళలు తరచూ బోలు ఎముకల వ్యాధి బారిన పడతారు. ఇది వారి ఎముకల్ని బలహీనపరుస్తుంది. దీని వల్ల అవి పెళుసుగా మారిపోతుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల మెనోపాజ్ తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఎముకల బలాన్ని, పగుళ్ళ ప్రమాదాన్ని గుర్తించడానికి రుతువిరతి దాటిన మహిళలు DEXA స్కాన్ అనే ఎముక ఖనిజ సాంద్రత పరీక్ష చేయించుకోవాలని సూచించారు. మహిళలు 40 ఏళ్లు నిండిన తర్వాత ప్రతి ఐదేళ్లకోసారి ఈ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి తల్లి జీవితంలో ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ పరీక్షలు చాలా ముఖ్యం. ఇవే కాకుండా హైపర్ టెన్షన్, బ్లడ్ కౌంట్, కొలెస్ట్రాల్, అలర్జీ టెస్ట్ వంటివి కూడా చేయించుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: కాఫీ, టీలు కాదు ఈ పానీయాలు తాగారంటే నాజూకుగా మారిపోతారు