Tips to Get Rich:: ధనవంతుడిగా ఎదగాలనుకుంటున్నారా? ఇలా చేయండి
డబ్బులు సంపాదించేందుకు ప్రతి ఒక్కరూ మార్గాలు వెతుకుతారు. మీకు మేము చెప్పే కొన్ని మార్గాలు ఇవిగో...
ప్రపంచాన్ని నడిపించేది డబ్బే. ప్రతి వ్యక్తికి ఎన్నో కలలు ఉంటాయి. అన్ని కలల్లో కామన్ పాయింట్ డబ్బు. ఆరోగ్యం నుంచి ఆనందం వరకు ఏది పొందాలన్నా ఖర్చు పెట్టాల్సింది ధనమే. ఒకరు మంచి ఇల్లు కొనేందుకు , కార్లు కొనేందుకు డబ్బు సంపాదించాలనుకుంటారు. మరికొందరు పెద్ద పారిశ్రామికవేత్తగా మారేందుకు పెట్టుబడిగా పిలిచే ధనం కోసం వెతుకుతుంటారు. నిజానికి ధనవంతులు ఎలా అవుతారు? అందుకు కావాల్సినవి ఏమిటి? అనే విషయాల గురించి మాత్రం ఎవరూ ఆలోచించరు.
ధనవంతులవ్వాలా... సాహసం చేయక తప్పదు
మీరు నిజంగా ధనవంతులు కావాలనుకుంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకతప్పదు. అదే లక్ష్యంగా పెట్టుకోవాలి. జీవితంలో గొప్ప మార్పులకు సిద్ధంగా ఉండాలి.
1. మీ లక్ష్యం ఒకటే కావాలి. రెండు మూడు పడవలపై ఒకేసారి ప్రయాణం చేయడానికి ప్రయత్నించొద్దు. ఎంచుకున్న ఒక అంశంలోనే పూర్తి నిష్ణాతులుగా మారండి. సాధన చేయండి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి. మిలియనీర్లుగా మారిన సెలెబ్రిటీలను చూసి నైపుణ్యాలను పూర్తిగా ఎలా ఉపయోగించుకున్నారో నేర్చుకోండి. మీకు ఏ విషయంలో మంచి ప్రావీణ్యత ఉందో, ఆసక్తి ఉందో తెలుసుకుని దానిపైనే వర్కవుట్ చేస్తే ఖచ్చితంగా మీరు సంపాదించగలరు.
2. సంపాదించాలంటే ముందు పొదుపు చేయడం నేర్చుకోవాలి. ఆ పొదుపే రేపు మీకు పెట్టుబడిగా మారుతుంది. కనుక రోజూ ఎంతో కొంత పొదుపు చేయడం ప్రారంభించండి. ఒక లక్ష లేదా అయిదు లక్షలు ఇలా ఒక లక్ష్యం పెట్టుకుని, ఆ మొత్తాన్ని చేరేవరకు రోజూ కొంత మొత్తాన్ని ఆదా చేయండి.
3. మొదట్నించే లక్షల కొద్దీ సంపాదించాలనే ఆలోచన మానేసి, ఎక్కువ మంది మనుషులకి దగ్గరవడం ఎలానో ఆలోచించండి. ప్రజలకు ఏది అవసరమో తెలుసుకోవాలంటే దగ్గరవ్వక తప్పదు. వారి అవసరాలే మార్కెట్లో కొత్త ఉత్పత్తులు, రంగాల ప్రారంభానికి నాంది పలికాయి. ఓయో రూమ్స్ నుంచి పేటీఎం వరకు ప్రజల జీవితాలను సులభతరం చేసేందుకు వచ్చినవే కదా.
4. సొంతంగా ఏదైనా ప్రారంభించడానికి ముందు ఓ స్టార్టప్ లో ఉద్యోగిగా చేరండి. ఆ అనుభవం మీ ఎదుగుదలకు, మీ సంస్థ ప్రారంభానికి చాలా ఉపయోగపడుతుంది. ఆపిల్, గూగుల్, మైక్రోసాప్ట్ సంస్థల ప్రారంభంలో పనిచేసిన ఉద్యోగుల్లో చాలా మంది మిలియనీర్లుగా మారారు.
5. మార్కెట్లో రాణించాలంటే రిస్క్ తీసుకోకతప్పదు. ఆస్తిని కొనడం, దాన్ని అభివృద్ధి చేసి, తిరిగి ఎక్కువ రేటుకు అమ్మడం... ఇదీ మూలధనాన్ని పెంచే మార్గం. అలాగే ఈ పద్ధతిలో రుణం తీసుకోవడం కూడా ముఖ్య అంశం. పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదిగిన వాళ్లంతా మొదట్లో రుణాలతో నెగ్గుకుని వచ్చినవాళ్లే.
6. స్టాక్ మార్కెట్లో తెలివిగా పెట్టుబడులు పెడితే మంచి ఫలితాలు పొందవచ్చు. ఒక్కోసారి వచ్చే నష్టాలను తట్టుకునే శక్తి ఉండాలి. ఈక్విటీలు మంచి ఆస్తిలా మారతాయి.
7. ఈ మధ్య కాలంలో స్టార్టప్ లు దూసుకెళ్తున్నాయి. మార్కెట్ కు తగ్గట్టు మంచి స్టార్టప్ మొదలుపెట్టాలి. అది కాస్త సక్సెస్ అవ్వగానే మరో పెద్ద సంస్థకు అమ్మకానికి పెడితే భారీగా లాభాలు పొందవచ్చు. మీరు ఖర్చు పెట్టిన దానికి కొన్ని వందల రెట్లు ఎక్కువిచ్చి మరీ కొన్ని అంతర్జాతీయ కంపెనీలు కొనుగోలు చేస్తాయి.
8. అన్నింటి కన్నా ముఖ్యంగా ఆర్ధికంగా ఎదగాలనుకునే వారు మొదట ఖర్చులను తగ్గించుకోవాలి. మీరు సంపాదించిన దాని కన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం అలవాటు చేసుకుంటే, మీరు ఎంత సంపాదించిన ధనవంతుడిగా మారలేరు.
ధనవంతులు కావడం అంటే?
తాము ధనవంతులం అని ఫీలవ్వడం ఒక మానసిక స్థితి. కొంతమందికి కోట్ల కొద్దీ ఆస్తి ఉంటుంది, కానీ వారు ఇంకా అత్యాశతో సంపాదన గురించే ఆలోచిస్తారు. అంత ఆస్తి ఉన్నా తమను తాము పేదవారిగానే భావిస్తారు. కొంతమంది మాత్రం వీరికి భిన్నం. వారు మానసికంగా చాలా ధనవంతులు. డబ్బు చింత లేకుండా సంతోషంగా జీవిస్తారు. ఉన్నదాంట్లోనే సర్దుకుంటూ ఆనందపడతారు. అందుకే ధనవంతుడనే భావన ఒక మానసిక స్థితి. డబ్బు సంపాదించాలనే చింత లేనివాడు అందరి కన్నా సంతోషపరుడు, ధనవంతుడు కూడా.
Also read: ఉపవాసం చేసినప్పుడు ఈ పనులు చేయకండి, ఆరోగ్యానికి ప్రమాదం
Also read: మగవారిని ఆ క్యాన్సర్ నుంచి కాపాడే దివ్యౌషధం దానిమ్మ... తినమని చెబుతున్న హార్వర్డ్ వైద్యులు
Also read: మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం... అధిక ఆలోచనలతోనే ముప్పు