Fat Removal Surgery: కొవ్వును కరిగించే లైపోసక్షన్ ఆపరేషన్ ఎలా చేస్తారు? అది ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఎందుకు మారుతోంది?
అందం మీద వ్యామోహంతో మరో నటి ప్రాణాలు కోల్పోయింది. కారణం ఫ్యాట్ రిమూవల్ సర్జరీ.
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన నటి ఆర్తి అగర్వాల్. బరువు తగ్గేందుకు సహజ పద్ధతులను అనుసరించకుండా కాస్మోటిక్ సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమైంది. నడుము, పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు లైపోసక్షన్ చేయించుకుంది. కానీ కొన్నిరోజులకే మరణించింది. ఇప్పుడు కన్నడ నటి చేతనా రాజ్. వయసు కేవలం 21. అంత చిన్న వయసులోనే కొవ్వును కరిగించే సర్జరీ బాట పట్టింది. కనీసం తల్లిదండ్రులకు కూడా విషయం చెప్పలేదు. వారికి విషయం తెలిసి ఆసుపత్రికి వచ్చేసరికే విగతజీవిగా మారిపోయింది. 21 ఏళ్ల వయసులో బరువు తగ్గడం సులువే. కాకపోతే శారీరకంగా కాస్త కష్టపడాలి, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వీరి ప్రాణాలు తీసిన ఫ్యాట్ రిమూవల్ సర్జరీ లేదా లైపోసక్షన్ వంటివి ఎలా చేస్తారో, అవి ఎందుకు ప్రాణాంతకంగా మారుతున్నాయో ఓసారి చూద్దాం.
ఏమిటీ సర్జరీ?
ఊబకాయం బారిన పడినవాళ్లు త్వరగా బరువు తగ్గేందుకు కాస్మోటిక్ సర్జరీల బాట పడుతున్నారు. ఈ సర్జరీలను ఫ్యాట్ రిమూవల్ సర్జరీ లేదా లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీ అని పిలుస్తారు. లైపోసక్షన శస్త్రచికిత్సలో పొట్ట, నడుము, పిరుదుల దగ్గర పేరుకున్న కొవ్వును వైద్యులు తొలగిస్తారు. ఇది రిస్క్‌తో కూడుకున్న సర్జరీ. అనస్థీషియా ఇచ్చి ఈ ఆపరేషన్ కొనసాగిస్తారు. ఇది సౌందర్య శస్త్రచికిత్స కిందకే వస్తుంది. ఈ చికిత్సలో ప్రధానంగా కనిపించే సైడ్ ఎఫెక్టు ఎంబోలిజం. అంటే రక్త గడ్డకట్టే సమస్య. ఇది చాలా ప్రాణాంతకమైనది. అనస్థీషియ ఇవ్వడం ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. చివరికి గుండెపోటుకు కారణమవుతుంది. ఆర్తి అగర్వాల్, చేతనా రాజ్ ఈ సర్జరీ అయ్యాక గుండెపోటుతోనే మరణించినట్టు వైద్యులు చెబుతున్నారు.
ఈ సర్జరీ అయ్యాక రోగికి ఎలాంటి ప్రాణాంతక సమస్యలు కనిపించకుండా ఇంటికి చేరవచ్చు. సర్జరీ అయిన 21 రోజుల్లోపు రక్తస్రావం కావడం, జ్వరం, వాంతులు వంటివి తీవ్రంగా వేధించడం జరగవచ్చు. అలాంటప్పుడు వెంటనే చికిత్స అందించకపోయినా ప్రాణానికే ప్రమాదం ఏర్పడవచ్చు. ఏది ఏమైనీ ఈ కాస్మోటిక్ సర్జరీలు ప్రాణాంతకమైనవనే చెప్పాలి. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వారు ఇలాంటి సర్జరీల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరడం వంటి సమస్య ఏర్పడి ప్రాణం పోయే ప్రమాదం ఉంది.
బేరియాట్రిక్ సర్జరీ కాస్త డిఫరెంట్
లైపోసక్షన్ తో పోలిస్తే బేరియాట్రిక్ సర్జరీ కాస్త భిన్నంగా ఉంటుంది.ఊబకాయం వల్ల కలిగే రోగాల ప్రమాదాన్ని తగ్గించడానికి అధికంగా ఈ సర్జరీని చేయించుకుంటారు. శస్త్రచికిత్స ద్వారా జీర్ణక్రియ ప్రక్రియను మార్చడం లేదా అంతరాయం కలిగించేలా చేస్తారు. దీని వల్ల ఆహారం విచ్చిన్నం అవ్వదు, సాధారణంగా శోషణ కాదు. దీనివల్ల ఆహారంలోని కేలరీలు శరీరానికి చేరవు కాబట్టి రోగులు బరువు తగ్గుతారు. బేరియాట్రిక్ సర్జరీలో నాలుగు రకాలు ఉన్నాయి. రోగిన వైద్యుడిని కలిశాక వారికి ఏ రకం సర్జరీ చేయాలో నిర్ణయించుకుంటారు. ఇది కాస్మోటిక్ సర్జరీ కిందకి రాదు.
ఏది ఏమైనా సహజంగా బరువు తగ్గే అవకాశాలను పాటించకుండా ఇలా సర్జరీల వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. ఆరోగ్యకరమైన జీవనశైలి, నడక, కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల మూడు నెలల్లో బరువు తగ్గొచ్చు. ప్రయ్నత్నించి చూడండి. ఇలాంటి సర్జరీల చేయించుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.