Hot or cold shower: చన్నీళ్లు లేదా వేణ్నీళ్లు... ఏ నీళ్లతో స్నానం చేస్తే బెటర్?
ప్రతిరోజూ కొంతమంది చన్నీళ్లతో స్నానం చేస్తారు... మరికొంతమంది కేవలం వేణ్నీళ్లకే ప్రాధ్యాన్యత ఇస్తారు... ఇంతకీ నిపుణులు ఏం చెబుతున్నారు?
పల్లెటూళ్లలో చన్నీళ్ల స్నానానికే ప్రాధాన్యతనిస్తారు... అదే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది వేణ్నీళ్లతో చేయడానికే ఇష్టపడతారు. కొంతమంది చన్నీళ్ల స్నానం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు, మరికొంత మంది వేడినీళ్లతోనే ఆరోగ్యమని వాదిస్తారు. ఇంతకీ ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారు?
రెండింటిలో ఏది ఆరోగ్యమో చెప్పాలంటే... ఈ రెండు స్నానాల వల్ల కలిగే ప్రయోజనాలేంటో ముందు తెలుసుకోవాలి. దాని ద్వారా ఎవరికి ఏ స్నానం ఉత్తమమో వారే నిర్ణయించుకోవచ్చు.
చన్నీళ్ల వల్ల లాభాలు...
దీనితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఆరోగ్యం బాగోనప్పుడు మాత్రం చన్నీళ్ల స్నానాన్నిదూరం పెట్టాలి. తీవ్రంగా వర్కవుట్స్ చేశాక చన్నీళ్ల స్నానం చేయడం వల్ల కండరాలకు సాంత్వన కలుగుతుంది. శరీరా భాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తుంది. తిమ్మిరి, వాపు కలగకుండా నిరోధిస్తుంది. అలాగే చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. జుట్టు రాలకుండా కాపాడుతుంది. రోజూ ఉదయాన చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల ఆ రోజంతా ఉత్సాహంగా పనిచేయగలరు. గుండె, ఆక్సిజన్ ను మరింత గ్రహించేలా చేసి పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మంపై దురదలు తగ్గేందుకు సహకరిస్తుంది.
వేణ్నీళ్ల స్నానం వల్ల ప్రయోజనాలు...
వేణ్నీళ్ల స్నానం వల్ల కండరాలు, నరాలు ఒత్తిడి లేకుండా సాంత్వన పొందుతాయి. ఇది జాయింట్ల (భుజాలు, మోకాలు, పాదాలు) దగ్గర పట్టేసి ఉన్నట్టు లేకుండా చేసి, ఆ ప్రాంతాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రాచీన కాలం నుంచి దగ్గు, జలుబు, కఫం వంటి సమస్యకు వేణ్నీళ్లతోనే ఆవిరిపడతారు. పూడుకుపోయిన చర్మరంధ్రాలను తెరుచుకునేలా చేస్తుంది. వేణ్నీళ్ల స్నానం వల్ల ఒత్తిడి తొలగిపోయినట్టు అనిపిస్తుంది. చక్కగా నిద్రపట్టేలా చేస్తుంది. కాకపోతే గోరువెచ్చని నీళ్లతోనే స్నానం చేయాలి. వేడి ఎక్కువగా ఉంటే చర్మం పొడిబారిపోతుంది. అలాగే జుట్టు కూడా చిట్లిపోయే ప్రమాదం ఉంది.
ఈ ప్రయోజనాలను బట్టి మీకు ఏ స్నానం మంచిదని అదే ఎంచుకోవచ్చు. వాతావరణాన్ని బట్టి, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏ స్నానం మంచిదని మీరు భావిస్తారో అదే చేయడం మంచిది. జ్వరం ఉన్న వాళ్లు చల్ల నీళ్ల స్నానానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. దీనికి ‘ఏబీపీ దేశం’ బాధ్యత వహించదు.
Also read: నేను పడిన బాధ ఎవ్వరు పడొద్దనే ఆ సంస్థను స్థాపించా
Also read: సోంపు నీళ్లతో బరువు తగ్గుతారా? నిజమేనా?
Also read: గుడ్లు తిన్నాక... వీటిని తినకండి, తింటే ఏమవుతుందంటే...