(Source: Poll of Polls)
Deepika padukone: నేను పడిన బాధ ఎవ్వరు పడొద్దనే ఆ సంస్థను స్థాపించా
అందాల చందమామ దీపికను చూస్తే ఆమెకు ఏం బాధలుంటాయ్ అనిపిస్తుంది, కానీ ఆమె కూడా డిప్రెషన్ బాధితురాలే.

కళ్లను కట్టిపడేసే అందం, చేతినిండా సినిమాలు, ప్రేమించిన వ్యక్తితో పెళ్లి... ఇవన్నీ దీపిక గురించి మనకు తెలిసిన విషయాలు. మనకు తెలియని దీపిక కూడా ఉంది. ఆమె సాధారణ వ్యక్తుల్లాగే బాధలకు భయపడి డిప్రెషన్ బారిన పడిన అమ్మాయే. తిరిగి మానసిక వైద్యుల సహకారంతో ఆరోగ్యంగా మారింది. ఆ విషయాన్ని కేబీసీ13 కార్యక్రమంలో వెల్లడించింది. ఇందులో సెలెబ్రిటీ ఎపిసోడ్ కోసం ఫరాఖాన్ తో కలిసి, దీపిక పాల్గొంది. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాన్ని నిర్భయంగా బయటికి చెప్పింది.
2014లో దీపికా తీవ్రమైన డిప్రెషన్ కు గురైనట్టు తెలిపింది. తాను ఆ వ్యాధి బారిన పడినట్టు కూడా గుర్తించలేకపోయింది. ఉదయం లేవగానే విచిత్రంగా అనిపించేదని, రాత్రి పూట సరిగా నిద్రపట్టేది కాదని, ఏ పని చేయాలనిపించేది కాదని, అకారణంగా ఏడుపు వచ్చేదని చెప్పుకొచ్చింది. నిజానికి తనకెందుకలా అవుతుందో అర్థమవ్వలేదని తెలిపింది. తల్లి తన ప్రవర్తలో మార్పును గమనించి ఒకసారి మానసిక వైద్యుడిని కలవమని సలహా ఇచ్చిందని, ఆ సలహాతోనే తాను సైక్రియాటిస్టును కలిసి చికిత్స తీసుకున్నట్టు చెప్పింది దీపికా. ఆ చికిత్స కొన్ని నెలల పాటూ కొనసాగినట్టు చెప్పింది. అలా దీపిక డిప్రెషన్ లో ఉన్నప్పుడే ‘హ్యాపీ న్యూ ఇయర్’ అనే సినిమాలో నటించిందని, కానీ ఎక్కడా ఆమె మానసిక వ్యాధితో బాధపడినట్టు లేదని తెలిపింది ఫరాఖాన్. ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాకు ఫరానే దర్శకత్వం వహించింది.
డిప్రెషన్ తో నరకం చూసిన దీపికా తనలా ఎవ్వరూ ఆ వ్యాధి లక్షణాలతో బాధపడకూడదని కోరుకుంది. అందుకే ‘లివ్, లవ్ లాఫ్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించినట్టు చెప్పింది. దాని ద్వారా ఇప్పటికే చాలా మంది మానసిక వేదనల నుంచి, డిప్రెషన్ వంటి రోగాల నుంచి బయటపడేందుకు సహకరించినట్టు చెప్పింది.
View this post on Instagram





















