Director Sudheer Sriram: గీతా ఆర్ట్స్, సితారలో అవమానాలు.. నెరేషన్‌కు వెళితే బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ - సుధీర్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
శివాజీ, లయ జంటగా నటించిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని'తో సుధీర్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న రిజెక్షన్స్ గురించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

హిట్ పెయిర్ శివాజీ, లయ కొంత విరామం తర్వాత జంటగా నటించిన సినిమా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' (Sampradayini Suppini Suddapoosani Movie). ఇదొక క్రైమ్ థ్రిల్లర్. దీనితో సుధీర్ శ్రీరామ్ (Director Sudheer Sriram) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి ముందు బడా నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, సితారలో కథలు చెప్పడానికి ప్రయత్నించానని... బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌లు ఉన్నాయని వివరించారు.
గీతా ఆర్ట్స్ సంస్థలో చేదు అనుభవం గురించి సుధీర్ శ్రీరామ్ మాట్లాడుతూ... ''గీతా ఆర్ట్స్‌లోని ఓ వ్యక్తికి కథ చెప్పడానికి చాలా రోజులు ప్రయత్నించా. ప్రతిరోజూ 'రేపు కలుద్దాం, మాట్లాడదాం' అని ఆయన వాయిదాలు వేస్తూ ఉండేవారు. ఓ రోజు గంటలో కలుద్దామని చెప్పి రిప్లై ఇవ్వలేదు. ఆయన గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గరే ఉంటారని ఊహించి అక్కడికి వెళ్లాను. నన్ను కలుద్దామని చెప్పిన వ్యక్తి బయట కారులో కనిపించారు. నేను ఫోన్ చేస్తే 'దూరంగా ఉన్నాను' అని అబద్ధం చెప్పారు. నేను ఆఫీస్ దగ్గర ఉన్నానని చెప్పగా... ఆయన కోపంతో 'నువ్వు ఎందుకు వచ్చావు? ఇంత తొందర అయితే ఎలా?' అని విసుక్కొని వెళ్ళిపోయారు'' అని చెప్పారు.
ఏడు గంటలకు వెళితే... 9 వరకు నో రిప్లై!
ఒక రోజు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాక్ సైడ్ ఉన్న ఆఫీసుకు నేరేషన్ ఇవ్వడానికి వెళితే అక్కడ కూడా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఎదురైనట్టు సుధీర్ శ్రీరామ్ చెప్పారు. ఆ రోజు జరిగిన విషయం గురించి ఆయన మాట్లాడుతూ... ''ఉదయం 7 గంటలకు నేరేషన్ కోసం రమ్మన్నారు. నేను 6:45 గంటల కల్లా అక్కడికి చేరుకుని మెసేజ్ చేశా. అవతలి వ్యక్తి ఓకే అని రిప్లై ఇచ్చారు. కానీ 8:45 గంటల వరకు ఎదురు చూసినా ఆయన రాలేదు. ఫోన్ చేస్తే కట్ చేశారు. చివరకు 9:15 గంటలకు 'నేను అర్జెంట్ పని మీద వైజాగ్ వచ్చాను, ఫ్లైట్‌లో ఉన్నాను' అని మెసేజ్ పంపారు'' అని చెప్పుకొచ్చారు.
ఓ పెద్ద నిర్మాణ సంస్థలో కథ చెబుతుంటే అవతలి వ్యక్తి నిద్రపోయారని, ఒక పది రోజుల తర్వాత కాల్ చేసి "కథ నచ్చలేదు" అని చెప్పారని సుధీర్ శ్రీరామ్ తెలిపారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో కథలు వినే వ్యక్తిని కలవడానికి చాలా సార్లు ప్రయత్నించినా... కలవడానికి ఆసక్తి చూపలేదని ఆయన వివరించారు.
ఈటీవీ విన్ (ETV)లో 2021లో కథ చెప్పినప్పుడు ఉదయం 5:30 గంటలకు రమ్మన్నారని, ఆయన ఎంతో అంకితభావంతో వెళ్తే, అక్కడ వినే వ్యక్తి మాస్క్ పెట్టుకుని నిద్రపోతున్నాడో? లేదో? తెలియని స్థితిలో కూర్చున్నారని, కథ విన్న తర్వాత సరిగ్గా స్పందించకుండా 'చెప్తాం' అని పంపించేశారని సుధీర్ శ్రీరామ్ చెప్పారు. శివాజీ గారు 'పిచ్చి డెక్' చూసి కేవలం 10 నిమిషాల్లో ఫోన్ చేసి మరుసటి రోజు కథ చెప్పడానికి రమ్మన్నారని, కథ విన్న తర్వాత 'నేనే ప్రొడ్యూస్ చేస్తా' అని చెప్పారని సుధీర్ శ్రీరామ్ చెప్పారు.
ఈటీవీ బాపినీడు గారికి & సీనియర్ సిటిజన్లు ఉన్న బృందానికి కథ నచ్చుతుందో లేదో? అని భయపడినా... కథను బాగా ఎంజాయ్ చేసి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సుధీర్ శ్రీరామ్ సంతోషం వ్యక్తం చేశారు. హీరోయిన్ లయ కథలోని చిన్న చిన్న షాక్ మూమెంట్లను కూడా బాగా ఎంజాయ్ చేస్తూ కథ విన్నారని ఆయన తెలిపారు. 'స్కై ల్యాబ్' ప్రొడ్యూసర్ ప్రవళికకు 15 నిమిషాల్లో కథ చెప్పాలని వెళ్లగా, ఆమె సుమారు గంటన్నర పాటు ఆసక్తిగా విన్నారని, ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని సుధీర్ శ్రీరామ్ తెలిపారు.
Before You Go
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
ట్రెండింగ్ వార్తలు






















