Actor Shivaji: 'దండోరా'కు ఆ కామెంట్స్ మైనస్సా.. వివాదంపై మళ్ళీ నోరు విప్పిన శివాజీ
Sampradayini Suppini Suddapoosani: 'సాంప్రదాయనీ సుప్పినీ సుద్దపూసని' విడుదల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'దండోరా' వివాదం గురించి శివాజీ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే?

'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళల డ్రెస్సింగ్ స్టైల్ గురించి నటుడు శివాజీ (Actor Shivaji) కామెంట్ చేశారు. చక్కగా చీర కట్టుకోవాలని చెప్పారు. తన స్పీచ్‌లో రెండు అభ్యంతకరమైన పదాలు సైతం ఉపయోగించారు. ఆయన వ్యాఖ్యలపై నటి అనసూయ, గాయని చిన్మయి సహా కొందరు విరుచుకుపడ్డారు. శివాజీ క్షమాపణలు చెప్పారు... తాను రెండు పదాలు వాడకుండా ఉండాల్సిందన్నారు. ఆ వివాదంతో 'దండోరా' పేరు నోళ్ళలో నానింది. సినిమాకు ఆ వివాదం మైనస్ అయ్యిందని కొంత మంది అభిప్రాయడ్డారు కూడా! మార్చి 6న 'సాంప్రదాయనీ సుప్పినీ సుద్దపూసని' విడుదల నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ వివాదం గురించి శివాజీ స్పందించారు.
'దండోరా'... ఆ టైటిల్ క్యారెక్టర్ కాదు
స్క్రిప్ట్ విన్న మొదటి గంటలోనే 'దండోరా' అనే టైటిల్ ఈ సినిమాకు కరెక్ట్ కాదని దర్శకుడికి చెప్పినట్టు శివాజీ తెలిపారు. ఇంకా మాట్లాడుతూ... ''మన సమాజంలో 'దండోరా' అంటే అదొక కమ్యూనిస్ట్ పదంగా, అదొక కమ్యూనిస్ట్ సినిమాగా ప్రజలు భావిస్తారని చెప్పాను. టైటిల్ మార్చమని నెల పోరాడాను. ఓ తండ్రి - కొడుకు - కూతురు మధ్య సాగే ఎమోషనల్ డ్రామా సినిమా గనుక... వాళ్ళ మధ్య అనుబంధం, ప్రేమకు సంబంధించిన పేరు పెడితే బాగుండేదని చెప్పాను. కానీ, వినలేదు'' అని చెప్పారు.
సెన్సార్ సర్టిఫికెట్... విడుదల సమస్యలు
'దండోరా' విడుదలకు ముందు సమస్యలు ఎదురయ్యానని శివాజీ తెలిపారు. ఆ అంశంపై ఆయన మాట్లాడుతూ... ''సెన్సార్ సర్టిఫికెట్ సినిమా విడుదల కావడానికి కేవలం ఒక రోజు ముందు (24వ తేదీ) సాయంత్రం 4 గంటలకు వచ్చింది. సెన్సార్ అవుతుందో? లేదో? అనే అనుమానంతో ఎగ్జిబిటర్లు థియేటర్లు ఇవ్వలేదు. దాంతో హైదరాబాద్ వంటి మెయిన్ సిటీల్లోనూ సాయంత్రం 4 లేదా 7 గంటల షోలు పడ్డాయి. అందువల్ల సినిమా ఆశించినంత మందికి చేరలేదు'' అని చెప్పారు.
నా ఉద్దేశం తప్పు కాదు... మహిళల్ని గౌరవిస్తా
మహిళల వస్త్రధారణపై తాను చేసిన వ్యాఖ్యలు, వివాదం గురించి కూడా శివాజీ స్పందించారు. ఆ విషయం గురించి ఆయన మాట్లాడుతూ... ''తల్లిని, భార్యను, ప్రతి మహిళను నేను గౌరవిస్తా. భారతీయ సంస్కృతిలో మహిళలకు గౌరవం ఇవ్వనివాళ్ళు, స్త్రీలను తప్పుగా చూసేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. నా మాటల్లో పదం పొరపాటు అయి ఉండొచ్చు. కానీ, నా ఉద్దేశం తప్పు కాదు. ఆ విషయంలో క్షమాపణలు కూడా చెప్పాను. కేవలం నాపై కోపం ఉన్న కొందరు వ్యక్తులు దీన్నొక వివాదంగా మార్చారు'' అని వ్యాఖ్యానించారు.
'దండోరా'ను వివాదాలు చుట్టుముట్టినా, థియేటర్ల కొరత ఎదురైనా... నైజాంలో తమ సినిమా కోటి రూపాయలు వసూలు చేసిందని, సినిమాపై ప్రేక్షకులకు ఉన్న చక్కటి ఆదరణ, గౌరవానికి అదొక నిదర్శనమని శివాజీ పేర్కొన్నారు. ఈ సినిమా కేవలం రెండు కులాల మధ్య గొడవ కథ కాదని, ఒక వ్యక్తి తన కులానికి వ్యతిరేకంగా వెళ్తే ఎదురయ్యే సామాజిక వెలివేత ముఖ్యమైన అంశమని అని ఆయన విశ్లేషించారు. 'దండోరా' తన కెరీర్‌లో ఒక గొప్ప సినిమా అని, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందని శివాజీ తెలిపారు.























