Easy Detox Drinks Recipes : శరీరాన్ని టాక్సిన్స్ నుంచి రక్షించే డ్రింక్ ఇవే.. పండుగ తర్వాత ఇవి తాగాల్సిందే
Detox Drinks : పండుగల సమయంలో రకరకాల పిండివంటలు తింటూ ఉంటాము. తిన్న ఆహారం శరీరంలో పేరుకుపోతే టాక్సిన్స్గా మారుతాయి. కాబట్టి పండుగ తర్వాత టాక్సిన్లను బయటకు పంపే డ్రింక్స్ తాగితే హెల్త్‌కి మంచిది.
Detox Drinks for a Healthy Life : సంక్రాంతి (Sankranthi 2024) సమయంలో మీరు తినకపోయినా ఇంట్లో వాళ్లు బలవంతంగా ఏదొకటి తెచ్చిపెడుతూ ఉంటారు. వాళ్లని బాధపెట్టడం ఇష్టంలేక మీరు కూడా తినే ఉంటారు. ఇలా శరీరంలోకి వెళ్లిన ఫుడ్ బయటకు రాకపోతే లోపల టాక్సిన్స్ ఏర్పడే ప్రమాదముంది. ఇలా లోపల పేరుకుపోయిన టాక్సిన్స్ చెడు కొవ్వుగా మారుతాయి. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచివి. అందుకే పండుగల తర్వాత శరీరాన్ని డిటాక్స్ చేసుకోవాలి అంటున్నారు ఆహారనిపుణులు. ఈ ప్రక్రియ ఎంత త్వరగా ప్రారంభిస్తే మీ శరీరం అన్ని ప్రయోజనాలు పొందుతుంది.
పోషకాలు లేని, అనారోగ్యకరమైన ఫుడ్, అతిగా తీసుకునే జంక్‌ఫుడ్ శరీరంలో టాక్సిన్స్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇది శరీరంలోని అవయవాలకు, మొత్తం శరీరానికి హానికరం. దీనివల్ల మీరు త్వరగా అలసిపోతారు. నిద్ర ఉండదు. బరువు పెరిగిపోతారు. జుట్టు రాలిపోతూ.. చర్మం నిర్జీవంగా మారుతుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే శరీరాన్ని లోపలి నుంచి డిటాక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ డిటాక్స్ కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఉండే కొన్ని సింపుల్ హోమ్ డిటాక్స్ డ్రింక్స్ మీరు ట్రై చేయవచ్చు. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి.. హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి.
నిమ్మరసంతో..
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి దానితో మీ రోజును ప్రారంభించండి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకి పంపడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. దీనిలోని సిట్రిక్ యాసిడ్ మీ జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలను ప్రోత్సాహిస్తుంది. తద్వార మీ శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు సమర్థవంతంగా బయటకు వచ్చేస్తాయి. నిమ్మకాయల్లో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. దీనిని మీరు తీసుకున్నప్పుడు ఇది మిమ్మల్ని హైడ్రేట్ చేస్తుంది. మీ కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. ఉదయాన్నే పరగడుపుతో దీనిని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
నీళ్లు
శరీరం నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి నీళ్లు బాగా హెల్ప్ చేస్తాయి. కాబట్టి శరీరానికి తగినంత నీరు అందించడం చాలా ముఖ్యం. ఇది కేవలం టాక్సిన్స్‌ను బయటకు పంపడమే కాకుండా మీ చర్మం మెరిసేలా చేస్తుంది. బరువు తగ్గించడంలో అనేక ప్రయోజనాలు అందిస్తుంది. ఆరోగ్యకరమైన అవయవాల పనితీరును ప్రోత్సాహిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగేందుకు ప్రయత్నించండి. కేవలం టాక్సిన్స్ కోసమే కాదు.. ఇతర ప్రయోజనాల కోసం కూడా మీరు నీళ్లు తాగాల్సి ఉంటుంది.
హెర్బల్ టీ
గ్రీన్ టీ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాలు పేర్కొన్నారు. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కాలేయ పనితీరు మెరుగై.. శరీరంలోని హానికరమైన పదార్థాలు ప్రభావవంతంగా బయటకు వచ్చేస్తాయి. ఆరోగ్యకరమైన కాలేయం అంటే ఆరోగ్యకరమైన శరీరం అని చెప్పవచ్చు. అది ఒక్కటి బాగా పనిచేస్తే.. శరీరంలోని అన్ని భాగాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కేవలం గ్రీన్ టీ అనే కాదు.. హెర్బల్స్ తయారు చేసుకునే ఈ ఏ టీలు అయినా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తాయి. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. అల్లంటీ, జీరా టీ, దాల్చిన చెక్క టీ ఇలాంటి హెర్బల్ టీలు మీ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తాయ. కడుపు ఉబ్బరాన్ని తగ్గించి మీకు హెల్ప్ చేస్తాయి.
ఫ్రూట్స్, వెజిటెబుల్స్
పండ్లు, కూరగాయలతో తయారు చేసిన డ్రింక్స్ శరీరాన్ని చక్కగా డిటాక్స్ చేస్తాయి. కాకపోతే వీటిని ఫ్రెష్‌గా ఇంట్లో చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఎందుకంటే తాజాగా ఉండే కూరగాయల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి.. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. జీర్ణం కాకుండా ఉన్న ఆహారాన్ని సమర్థవంతంగా బయటకు పంపిస్తాయి. మీరు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి.. కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి మీరు మీ డైట్లో ఫ్రూట్స్, వెజిటెబుల్స్‌తో తయారు చేసిన డిటాక్స్ డ్రింక్స్ ట్రై చేయవచ్చు.
శరీరాన్ని డిటాక్స్ చేయడానికి ఇంకా చాలా డ్రింక్స్ ఉంటాయి కానీ.. ఈ డ్రింక్స్ త్వరగా ఫలితాలు చూపిస్తాయి. అంతేకాకుండా వీటిని తయారు చేసుకోవడం చాలా తేలిక. కాబట్టి పండుగ తర్వాత మీ శరీరాన్న డిటాక్స్ చేసుకోవడానికి వీటిని కచ్చితంగా తాగండి. కేవలం పండుగ తర్వాతే కాకుండా వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం మీరు వీటిని మీ రెగ్యూలర్ డైట్లో చేర్చుకోవచ్చు.
Also Read : ఈ ఫుడ్స్ క్యాన్సర్‌ను నివారించడంలో హెల్ప్ చేస్తాయట.. నిపుణుల సలహా ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.