HIV/AIDS Prevention Tips : కేవలం శృంగారం వల్లనే కాదు.. ఈ తప్పుల వల్ల కూడా HIV, AIDS వస్తుంది, జాగ్రత్త
HIV Facts : హెచ్ఐవి లైంగిక సంబంధం ద్వారానే కాదు.. చాలారకాలుగా కూడా సోకుతుంది. ఎయిడ్స్ సోకకుండా ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి అంటున్నారు నిపుణులు.

HIV Spread and Prevention : HIV అనేది ఒక వైరస్. ఇది ఎలాంటి అలెర్ట్ లేకుండానే శరీరాన్ని లోపలి నుంచి బలహీనపరుస్తుంది. ఇది లైంగికంగా వ్యాపిస్తుంది. అయితే ఇది కేవలం లైంగిక సంబంధాల ద్వారానే వ్యాపిస్తుంది అనుకోవడం మూర్ఖత్వమని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ లైంగిక చర్యల వల్లనే కాకుండా.. వివిధ కారణాల వల్ల కూడా వ్యాపిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ దీనికి ఎలాంటి మందులు లేదా వ్యాక్సిన్లు అందుబాటులో లేవు కాబట్టి.. ఈ అంశంపై అందరికీ అవగాహన కలిగి ఉండాలంటున్నారు డాక్టర్. శుచిన్ బజాజ్.
HIV లైంగిక సంబంధాల ద్వారానే కాకుండా.. వైరస్ సోకిన రక్తం, వైరస్ సోకిన వ్యక్తికి చేసిన ఇంజెక్షన్లు, వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. కాబట్టి దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని అర్థం చేసుకోవడం, దాని నుంచి రక్షించుకోవడానికి పూర్తి అవగాహన కలిగి ఉండటం ముఖ్యమని చెప్తున్నారు.
రక్తం ద్వారా
రక్తం ఎక్కించే ముందు HIV పరీక్ష చేయకపోతే.. ఆ రక్తంలో హెచ్ఐవీ ఉంటే.. ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లేదా అనధికారిక సెటప్‌లలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని పరీక్షలు పూర్తి చేసి.. సేఫ్ అనుకున్న బ్లడ్‌ని మాత్రమే ఎక్కించాలి.
సూదుల ద్వారా
వ్యాధికి చికిత్సకోసం ఆస్పత్రికి వెళ్లినప్పుడు కొత్త ఇంజెక్షన్ కాకుండా.. పాతదే పదేపదే వినియోగించడం వల్ల కూడా ఈ వ్యాప్తి ఉంటుంది. వైరస్ సోకిన వ్యక్తికి ఉపయోగించిన సూదిని మళ్లీ ఉపయోగిస్తే HIV వేగంగా వ్యాప్తి చెందుతుంది. డ్రగ్స్ తీసుకునే వ్యక్తులు, టాటూ వేయించుకునే వ్యక్తులకు ఈ ఇబ్బంది కలగవచ్చని గుర్తించుకోవాలి. కొత్త సూదులను వాడకుంటే అడిగి మరీ వాటిని మార్చమని చెప్పాల్సి ఉంటుంది.
వస్తువుల ద్వారా..
వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించిన రేజర్‌లు, టూత్‌బ్రష్‌లు లేదా బ్లేడ్‌లు వంటివి షేర్ చేసుకున్నప్పుడు వాటిపై రక్తం ఉంటే.. ఈ అంటువ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.
గర్భధారణ సమయంలో
గర్భధారణ సమయంలో లేదా పాలిచ్చే సమయంలో తల్లి HIV పాజిటివ్ అయితే.. ఎలాంటి చికిత్స తీసుకోకుంటే ఈ వైరస్ గర్భంలో ఉన్న బిడ్డకు వస్తుంది. అలాగే తల్లిపాలు ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది.
పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే
- ఇతరులతో వ్యక్తిగత వస్తువులను పంచుకోవద్దు. రేజర్‌లు, బ్లేడ్‌లు, టూత్‌బ్రష్‌లు మొదలైనవి దూరంగా ఉంచాలి.
- లైంగిక సంబంధాలు ఎప్పుడూ సేఫ్‌గా ఉండేలా చూసుకోండి. ఎల్లప్పుడూ కండోమ్‌లను ఉపయోగించాలి.
- క్రమం తప్పకుండా మందులు వాడాలి. వైద్యుడు సూచించిన యాంటీరెట్రోవైరల్ చికిత్సను సకాలంలో తీసుకోండి.
- రక్తం డొనేట్ చేయకూడదు. రక్తం ఎక్కించుకునేప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
HIV/AIDS అనేది జాగ్రత్త, అవగాహనతో నివారించగలిగే ఒక అంటువ్యాధి. దీనిని కేవలం లైంగిక సంబంధాలకు సంబంధించిన వ్యాధిగా చూడకూడదు. తప్పుడు ఆలోచనలను విడిచిపెట్టి సరైన సమాచారాన్ని స్వీకరించడం చాలా అవసరం.






















