world Mental Health Day: ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే అయిదు అద్భుతమైన ఆహారాలు ఇవిగో, వీటిని రోజూ తినండి
world Mental Health Day: మానసిక ఆరోగ్యం బావుంటేనే సమర్థంగా పనులను నిర్వహించగలం. ఈరోజు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం.
world Mental Health Day: శరీరానికి గాయం తగిలితే కంటికి కనిపిస్తుంది లేదా నొప్పయినా తెలుస్తుంది. కానీ మానసిక ఆరోగ్య సమస్యలు మాత్రం కంటికి కనిపించవు. వాటితో ఇబ్బంది పడుతున్న వారికి మాత్రం తెలుస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మెదడు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మెదడు ఎంత చక్కగా పనిచేస్తే శరీరం కూడా అంత మెరుగ్గా పనిచేస్తుంది. కొందరికి ఎంత చదివినా గుర్తుండదు, కొంతమంది సరిగా ఉద్యోగం చేయలేరు, విషయాలేవీ గుర్తుండక ఇబ్బంది పెడుతుంటారు. ఇలాంటి వారు మెదడు కోసం ప్రత్యేకంగా కొన్ని ఆహారాలను తినాల్సి ఉంటుంది. ఇవి మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
పాలకూర
పచ్చని పాలకూర రోజూ తింటే ఎంతో మంచిది. అలాగని మరీ అతిగా తినకూడదు. వండిన పాలకూర రోజుకు మూడు నాలుగు స్పూన్లు తిన్నా చాలు. ఇందులో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఇది జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది అలాగే నేర్చుకునే సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనిలో విటమిన్ B6, E, ఫోలేట్ అధికంగా ఉంటాయి. అల్జీమర్స్ రాకుండా నిరోధించడంలో ఫోలేట్ సహాయపడుతుంది. అలాగే క్యాబేజీ వంటి ఇతర ఆకుపచ్చ కూరగాయలను కూడా తినాలి.
బ్లాక్‌బెర్రీ
బ్లాక్‌బెర్రీ పండ్లు సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి. లేదా ఈ కామర్స్ సైట్లలో కూడా ఉంటాయి. కనీసం రోజుకు రెండు పండ్లు తిన్నా చాలు. వీటిని తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని అధ్యయనాలు రుజువు చేశాయి. ఎవరైతే షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌తో బాధపడుతుంటే వీటిని తినడం మంచిది. మెదడు కణాలను రక్షించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు తగినంత మొత్తంలో వీటిలో ఉంటాయి. అందుకే మెదడు కణాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.
చేపలు
ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి చేపలు. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మెదడును బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పిల్లల మెదడు ఆరోగ్యాన్ని, కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
పాలు
పాలలో విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం వ్యక్తి జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది.
గుమ్మడి గింజలు
రోజుకు గుప్పెడు గుమ్మడి గింజలు తినడం చాలా ముఖ్యం. ఇందులో మెదడు ఆరోగ్యానికి అవసరమైన మెగ్నీషియం, ఐరన్, జింక్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని, మెదడును ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. ఇందుల ఉండే మెగ్నీషియం జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
Also read: Diabetes: మందులు వాడకుండా మధుమేహాన్ని తిప్పికొట్టగలమా?
Also read: బ్రేకప్ అయ్యాక మానసికంగా కుంగిపోయారా? ఇలా బయటపడండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.