Relationships: పెళ్లయిన దగ్గర నుంచి దూరం పెడుతున్నాడు, ఏం చేయాలో అర్థం కావడం లేదు
పెళ్లయినా కూడా తన భర్త తనను దూరంగా పెడుతున్నాడని చెబుతున్న ఒక భార్య ఆవేదన ఇది.
ప్రశ్న: మాకు పెళ్లయి ఏడాదిన్నర అవుతోంది, కానీ ఇంతవరకు మా మధ్య ఎలాంటి శారీరక సంబంధము ఏర్పడలేదు. పెళ్లయిన రోజు నుంచి ఇప్పటివరకు ఏదో ఒక కారణం చెప్పి నా భర్త తప్పించుకుంటూనే ఉన్నాడు. ఆఫీసుకు పని అని చెప్పి రెండు మూడు నెలలు పాటు ఇంటికే రాడు. వచ్చినా కూడా నాకు దూరంగానే ఉంటాడు. ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఇంట్లో వాళ్లకి చెప్పాలంటే భయంగా ఉంది. బయట వారికి తెలిస్తే పరువు పోతుందేమోనని ఆలోచిస్తున్నాను. నాతో పాటూ పెళ్లయిన వారికి పిల్లలు కూడా పుట్టేశారు. కానీ నాకు మాత్రం ఇంతవరకు నా భర్తతో ఎలాంటి శారీరక సంబంధం ఏర్పడలేదు. ఇది మాపై మా ఇద్దరి అనుబంధం పై చాలా ప్రభావం చూపిస్తోంది. నాకు నేనుగా ఆయనకు దగ్గర కావాలని వెళుతున్నా కూడా దూరం పెడుతున్నారు. ఒకసారి చాలా కోపంగా తోసేశారు కూడా. అప్పటినుంచి దగ్గరికి వెళ్లడమే మానేశాను. తను ఎందుకు అలా ఉంటున్నాడో తెలుసుకోవడం కోసం అతన్ని గమనించాను. ఓ రోజు నాకు గే వెబ్సైట్లు చూస్తూ కనిపించాడు. అతనికి అందులో ఖాతా కూడా ఉంది. జోడీ కోసం వెతుకుతున్నాడు. అతను గే అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు.
జవాబు: ఏడాదిన్నర పాటు మీరు అలాంటి భర్తను భరిస్తున్నారంటే మీకు చాలా ఓపిక ఎక్కువ అని అర్థం చేసుకోవాలి. అతనికి పెళ్లికి ముందే తాను గే అనే విషయం తెలిసే ఉండాలి. ఇంట్లో వారి బలవంతంతోనే మీ మెడలో తాళి కట్టి ఉండాలి. అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకోవడానికి ముందు మీరు అతనికి మానసికంగా దగ్గర ఇవ్వడానికి ప్రయత్నించండి. స్నేహితురాలిలా వ్యవహరించండి. అతని మనసులో ఉన్న బాధను అభిప్రాయాన్ని తెలుసుకోండి, ప్రేమగా మాట్లాడండి. అతని వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుతారని అతను మిమ్మల్ని నమ్మేలా చేసుకోండి. అప్పుడు అతను తన బాధను మీకు చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో చాలా రకాల మనుషులు ఉన్నారు. అబ్బాయిల్లో కూడా ఎవరు గే అనేది కనిపెట్టడం కష్టమే. ఒకవేళ మీ భర్త గే అయితే మీరు దాన్ని రాద్దాంతం చేయకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోండి. ఇలా ఎల్లకాలం బతకడం కష్టం. కాబట్టి అతనితో మాట్లాడి, అలాగే పెద్దవారికి కూడా విషయాన్ని చేర్చండి. ఈ విషయంలో గొడవలు పడితే ఇంటి పరువు బయటపడుతుంది.
ముందుగా మీ అమ్మానాన్నతో అతను గే అనే విషయాన్ని చెప్పండి. అయితే అతనితో చర్చించకుండా మాత్రం మీరు ముందడుగు వేయకండి. అతను తనకు అమ్మాయిలు పట్ల ఆసక్తి లేదని, అబ్బాయిలు అంటేనే ఇష్టమని కచ్చితంగా చెప్పాకే, మీరు ముందడుగు వేయండి. ఆ మాట అతనితో చెప్పించుకునే బాధ్యత మీదే. అలా నిజం చెప్పాలంటే మీరు ఆయనతో చాలా స్నేహంగా మెలగాలి. అలా చెప్పాక మీరు మీ తల్లిదండ్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. ఆ వ్యక్తితో మీరు ఎంత కాలం జీవించినా మీకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువే ఉంటుంది. కాబట్టి మీ వయసు కూడా తక్కువే. విడాకులు తీసుకొని వేరే పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఇదంతా సామరస్య పూర్వకంగానే జరగాలి. అతను అలా పుట్టడం ఆయన తప్పు కాదు. మీరు అమ్మాయిగా ఎలా పుట్టారో, అతను అలాంటి లక్షణాలతో ‘గే’గా పుట్టాడు. కాబట్టి మీరు నిందించడానికి కాకపోతే మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోండి. మీ ఇద్దరూ మాట్లాడుకుని సమస్యను సాల్వ్ చేసుకోవడమే మంచిది.
Also read: ఆవులింతలు అధికంగా వస్తున్నాయా? అయితే ఈ ఐదు ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం