Yawning: ఆవులింతలు అధికంగా వస్తున్నాయా? అయితే ఈ ఐదు ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం
ఆవులించడం అనేది అలసటకు ఒక సంకేతం.
Yawning: కొంతమంది తరచూ ఆవలిస్తూ ఉంటారు. అలసట వల్ల, విసుగ్గా అనిపించడం వల్ల కూడా ఇలా ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఆవలింత అనేది హృదయ స్పందన రేటు, చురుకుదనాన్ని పెంచే కొన్ని హార్మోన్లతో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే అలసటగా అనిపించినప్పుడు, విసుగ్గా అనిపించినప్పుడు ఆవలించడం అనేది మనల్ని అప్రమత్తంగా ఉంచేందుకు, మెలకువగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఇది శరీరం చేసే ఒక ప్రయత్నం. ఆవలింత రావడం అనేది చాలా సర్వసాధారణం. అయితే అది కొంతమేరకే. ఒకదాని వెనుక ఒకటి వరుసగా ఆవలింతలు వస్తూ ఉంటే దాన్ని తేలికగా తీసుకోకూడదు. అతిగా ఆవలించడం అనేది కొన్ని ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. పావు గంటలో మూడు నాలుగు సార్లు ఆవలింతలు వస్తున్నాయంటే అది సాధారణ విషయం కాదని అర్థం చేసుకోవాలి. ఇలా అధికంగా ఆవలింతలు రావడం వెనక ఐదు ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది.
స్లీప్ అప్నియా
నిద్ర సరిపోకపోవడం, తక్కువ సమయం పోవడం నిద్ర పోవడం వంటి వాటివల్ల అధికంగా ఆవలింతలు వస్తాయి. స్లీప్ ఆప్నియా, ఇన్ సోమ్నియా వంటి అంతర్లీన ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా ఈ నిద్రలేమి రావచ్చు. స్లీప్ ఆప్నియా అనేది ఒక తీవ్రమైన నిద్ర రోగం. దీనిలో శ్వాస పదేపదే ఆగిపోయి మళ్ళీ ప్రారంభమవుతుంది. మీరు బిగ్గరగా గురక పెడుతూ నిద్రపోవడం, ఎక్కువ సమయం నిద్రపోయాక కూడా ఉదయం అలసటగా అనిపించడం వంటివి స్లీప్ ఆప్నియా లక్షణాలు. కాబట్టి అధికంగా అవలింతలు వస్తున్నప్పుడు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
నిద్రలేమి
నిద్రపోయే సమయం మీ శరీరానికి సరిపోకపోయినా కూడా శరీరం ప్రతి చర్యగా ఆవలింతలను ఇస్తుంది. అంటే మీకు నిద్ర సరిపోవడం లేదు అని అర్థం. కాబట్టి మరి కొంచెం ఎక్కువ సేపు నిద్రించడానికి ప్రయత్నించండి.
వాడే మందులు
మీరు వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా విపరీతమైన ఆవలింతలు రావచ్చు. యాంటీ సైకోటిక్స్ లేదా యాంటీ డిప్రెసెంట్స్ వంటి మందులు వాడినప్పుడు వాటికి సైడ్ ఎఫెక్టుగా విపరీతమైన ఆవలింతలు వస్తాయి. ఇలాంటి మందులను వైద్యుల పర్యవేక్షణలోనే వేసుకోవాలి. అధికంగా ఆవలింతలు వస్తే వైద్య సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మెదడు రుగ్మతలు
అధికంగా ఆవలించడం అనేది మెదడు రుగ్మతలను కూడా సూచిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి, మైగ్రేన్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి పరిస్థితులు విపరీతమైన ఆవలింతలకు కారణం అవుతాయి.
మానసిక రోగాలు
మానసిక ఆందోళన, తీవ్రమైన ఒత్తిడి వల్ల కూడా అధిక ఆవలింతలు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఆందోళన, ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు ఆ టెన్షన్ తట్టుకోవడానికి ఆవులించడం ఒక మార్గమని భావిస్తుంది శరీరం. ప్రతి చర్యగా ఆవలింతలను ఇస్తుంది. కాబట్టి మానసిక ఆందోళనలను తగ్గించుకుంటే ఆవలింతలు తగ్గుతాయి.
గుండె సమస్యలు
గుండెపోటుకు ముందు కూడా విపరీతమైన ఆవలింతలు వచ్చే అవకాశం ఉంది. శరీరం లో ఆక్సిజన్ సరఫరా దెబ్బతిన్నప్పుడు విపరీతంగా ఆవలింతలు వస్తాయి. అలా అని ఆవలించడం అనేది గుండెపోటుకు ప్రధాన లక్షణం కాదు. విపరీతంగా అవలింతలు వస్తే భయపడకండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి.