విచిత్రం.. తన బంగ్లాను అమ్మేస్తున్న కుక్క.. విలువ రూ.238 కోట్లు!
భళా.. ఈ కుక్క జీవితం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన కుక్క.. తన బంగ్లాను అమ్మకానికి పెట్టింది. దాని విలువ ఎంతో తెలుసా?
‘‘ఛీ, మరీ కుక్క జీవితం అయిపోయింది’’ అని వాపోతున్నారా? ఈ కుక్క గురించి తెలిస్తే.. మళ్లీ ఆ మాట అనరు. ‘‘బతికితే ఆ కుక్కలా బతకాలి’’ అని అంటారు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క. దీనికి వందల కోట్లు విలువ చేసే భారీ బంగ్లా కూడా ఉంది. ఇటీవల ఆ కుక్క దాన్ని అమ్మకానికి పెట్టింది. ఇంతకీ దాని విలువ ఎంతో తెలుసా? జస్ట్ 32 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.238 కోట్లు!
గుండె కాస్త.. ఆగి ఆగి కొట్టుకుంటుందా? అయితే, దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే.. గుండె ఆగినా ఆగుతుంది. ఇంత విలాశవంతంగా జీవిస్తున్న ఆ కుక్క పేరు.. గుంథర్ VI. మియామీలో నివసిస్తున్న ఈ కుక్క తాత గుంథర్ IV అనే మరో కుక్క నుంచి 500 మిలియన్ డాలర్ల(రూ.3715 కోట్లు) సంపద వారసత్వంగా లభించింది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ కుక్కలకు ఆస్తులు ఆస్తులు లభిస్తున్నాయి. ఈ కుక్క వంశానికి చెందిన గుంథర్ III 1992లో మరణించింది. దీంతో దాని చివరి యజమాని జర్మన్ కౌంటెస్ కార్లొట్టా లైబెన్‌స్టెయిన్ నుంచి ఈ కుక్కకు 58 మిలియన్ డాలర్లు (సుమారు రూ.431 కోట్లు) విలువ చేసే ట్రస్ట్ వారసత్వంగా లభించింది. రోజులు గడిచే కొద్ది ఆ ఆస్తుల విలువ పెరుగడం వల్ల గుంథర్ VI.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్కగా రికార్డులకెక్కింది. ఈ కుక్కల ఆఖరి యజమాని చనిపోయిన తర్వాత హ్యాండర్ల బృందం వీటి బాధ్యతలు చూసుకుంటున్నారు.
తాజాగా గుంథర్ VI.. తాను నివసిస్తున్న టుస్కాన్ విల్లాను అమ్మకానికి పెట్టింది. వాస్తవానికి ఈ భారీ సౌధాన్ని 2000 సంవత్సరంలో మడొన్నా నుంచి కొనుగోలు చేశారు. అప్పట్లో ఈ బంగ్లా విలువ రూ.7.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.53 కోట్లు). ఇప్పుడు దీన్ని రూ.238 కోట్లకు అమ్మకానికి పెట్టారు. ఈ భవనాన్ని 1928లో నిర్మించారు. ఇందులో మొత్తం 9 బెడ్‌రూమ్‌లు, 8 బాత్‌రూమ్‌లు, ఔట్ డోర్ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇంటిని విక్రయించే బాధ్యతను ది అసోలిన్ టీమ్‌కు చెందిన ‘రూతీ అండ్ ఏతాన్ అస్సౌలిన్’ సంస్థ స్వీకరించింది.
ఈ సందర్భంగా ఆ సంస్థ నిర్వాహకురాలు రుతీ ‘ఫోర్బ్స్’తో మాట్లాడుతూ.. ఈ భారీ బంగ్లా యజమాని కుక్క అని తెలిసి నమ్మలేకపోయాను. మేం లెక్కలేనన్ని మిలియన్ డాలర్ల గృహాలను విక్రయించాం. కానీ ఇది చాలా ప్రత్యేకమైనది. ఆ భవనం నిర్వాహకులు నాకు మొదట ఈ ఆస్తికి ఒక కుక్క యజమాని అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. మరే భవనానికి లేని చరిత్ర దీనికి ఉంది. ఈ బంగ్లా అల్ట్రా-ప్రైవేట్ గేటెడ్ ఎస్టేట్. పచ్చని తోటలు, రాయల్ పామ్ చెట్లు, ఓపెన్ బేతో ఎంతో ఆహ్లాదకరంగా ఈ భవనం ఉంది’’ అని తెలిపింది. ‘‘గుంథర్ VIతో మేం సమావేశమయ్యాం. అది పరిగెత్తుతూ వచ్చి నా ముద్దు ఇచ్చింది. నా లిప్‌స్టిక్ మొత్తం నాకేసింది. మాతో ఒప్పందానికి అది ఈ విధంగా అంగీకారం తెలిపినట్లు భావిస్తున్నాం’’ అని రుతీ పేర్కొంది. ఇప్పుడు చెప్పండి.. కుక్క జీవితమే బెటర్ కదూ!!
Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..