Angry: కోపం ఎక్కువగా వచ్చేస్తోందా? కారణాలు ఇవి కావచ్చు
కోపం ఎన్నో అనర్థాలకు కారణం అవుతుంది. కోపం తరచూ ఎందుకు వస్తుందో చెప్పే కారణాలు ఇవి.
కోపం అనేక అనర్థాలకు కారణం అవుతుంది. బంధాలను విడగొడుతుంది. స్నేహాన్ని చెరిపేస్తుంది. ఆరోగ్యాన్నా పాడు చేస్తుంది. మొత్తం జీవితంపైనే ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే కోపం అధికంగా ఎందుకు వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.అప్పుడప్పుడు వస్తే ఫర్వాలేదు కానీ తరచూ ఇంకా చెప్పాలంటే రోజూ వస్తుంటే మాత్రం దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. కోపం అధికంగా ఉండడం వల్ల ఏ పని మీద కూడా ఏకాగ్రత కుదరదు. మీకు కోపం తరచూ వస్తుంటే దానికి కారణం కింద చెప్పిన కారణాలు కావచ్చు.
ఒత్తిడి
ఒత్తిడి చాలా అనారోగ్యాలకు కారణం. అలాగే కోపానికి కూడా కారణం అని చెప్పుకోవచ్చు. మీరు ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో ఉంటే కోపం అధికంగా వస్తుంది. అది ఏరకమైన ఒత్తిడైన కావచ్చు. కాబట్టి ఒత్తిడి తగ్గించుకుంటే కోపం కూడా తగ్గుతుంది.
మీ కుటుంబ పరిస్థితులు
ఇంట్లో అనారోగ్యకరమైన, విషపూరితమైన వాతావారణం ఉండడం వల్ల కూడా మానసికంగా మీరు మారిపోతారు. ఎల్లప్పుడూ కోపంగా ఉంటారు. ఇంట్లో నిత్యం గొడవలు, అరుపులు వాతావరణం పిల్లల మానసిక పరిస్థితిని కూడా మార్చేస్తుంది. పిల్లలను ఎప్పుడూ కొడుతూ, తిడుతూ, అరుస్తూ ఉండే తల్లిదండ్రుల వల్ల కూడా ఎదుగుతూ ఉన్న కొద్దీ వారిలో కోపం పెరిగిపోతుంది.
బాధించే గతం
ఎవరైనా బాధాకరమైన, విషాదకరమైన గతాన్ని అనుభవించినట్లయితే అలాంటివారికి ఎటువంటి కారణం లేకుండా కోపం రావచ్చు. మీకు జరిగిన గతం అనే గాయం వల్ల పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) కలుగుతుంది. దీని వల్ల మీలో కోపం,నిరాశ లేదా భయం కలుగుతుంది. ఫలితంగా ప్రతి చిన్న దానికి కోపం వచ్చేస్తుంది.
భారీ బాధ్యతలు
బాధ్యతలు భారీగా ఉండి, ఆర్ధిక అవసరాలు అధికంగా ఉన్నప్పుడు వాటి వల్ల కూడా మానసికంగా మార్పులు వస్తాయి. తీవ్రమైన కోపం, అసహనం వస్తుంది.
తీరని దుఃఖం
తీరని దుఃఖం కూడా మానసికంగా చాలా కుంగదీస్తుంది. ఎవరైనా ఆత్మీయులు మరణించినప్పుడు లేదా దూరమైనప్పుడు కోపం అధికంగా వస్తుంది. తీవ్రమైన దుఃఖం కోపంగా మారిపోతుంది.
మానసిక ఆరోగ్య పరిస్థితులు
కొన్ని రకాల మానసిన అనారోగ్యాలు కూడా కోపం రావడానికి కారణం అవుతుంది. యాంగ్జయిటీ, డిప్రెషన్లో ఉన్నవాళ్లలో కూడా కోపం అధికంగా వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే దూకుడుగా వ్యవహరిస్తారు. ఇలాంటి సమయంలో మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
Also read: రోగనిరోధక శక్తి పెంచే మష్రూమ్ ఆమ్లెట్ - చలికాలంలో తింటే మంచిది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.