High BP: హై బీపీ లేనివారు కూడా ఉప్పు తింటే ప్రమాదమే
అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారే కాదు, సాధారణ వ్యక్తులు కూడా ఉప్పును తినకూడదు.
హై బీపీతో బాధపడుతున్న వారే ఉప్పును దూరంగా పెట్టాలని ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. నిజానికి హైబీపీ లేని వ్యక్తులు కూడా ఉప్పును తగ్గించాల్సిందే. అధిక రక్తపోటు లేదు కదా అని ఉప్పును అధికంగా తింటే వారికి గుండె ,మెదడు సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు స్వీడన్ పరిశోధకులు చెబుతున్నారు. అధిక రక్తపోటు వల్ల గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతుంది. అందుకే హై బీపీ బారిన పడినవారు ఉప్పు అధికంగా తినకూడదు. వారు అధికంగా ఉప్పు తింటే మరిన్ని సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటు సమస్య లేనివారు కూడా ఉప్పు తినకూడదని చెబుతున్నారు పరిశోధకులు. తమకు హైబీపీ లేదు కాబట్టి ఉప్పు తినవచ్చు అనుకుంటే అది చాలా ప్రమాదకరం. రక్తపోటు సాధారణంగా ఉన్నవారు కూడా ఉప్పు అధికంగా తినడం వల్ల వారికి భవిష్యత్తులో గుండె, మెదడు రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని ఈ తాజా అధ్యయనం తేల్చింది.
హై బీపీ రావడానికి ముందే ఉప్పు వల్ల రక్తనాళాలు కూడా దెబ్బతింటున్నట్టు ఈ కొత్త అధ్యయనంలో కనుగొన్నారు. రక్తనాళాల్లో అడ్డంకులు, పూడికలు ఏర్పడడానికి ఉప్పు పాత్ర ఎంతగా ఉందో ఇంతవరకు తెలియదు. ఇప్పుడు తొలిసారి స్వీడన్ పరిశోధకులు ఉప్పు వల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడుతున్నట్టు కనిపెట్టారు. రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడానికి ఉప్పుకి మధ్య సంబంధం ఉందని తేల్చారు. కాబట్టి ఉప్పు వల్ల గుండె, మెదడుకు తీవ్ర ముప్పు పొంచి ఉన్నట్టు చెబుతున్నారు.
ఉప్పు అధికంగా తినే వారిలో హై బీపీ త్వరగా వస్తుంది. కేవలం హై బీపీ మాత్రమే కాదు గుండె నాళాలు పూడుకుపోతాయి. మెదడులోని నాళాలు కూడా పూడుకుపోతాయి. దీని వల్ల ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఉప్పు ఎంతగా తగ్గిస్తే అంత మంచిది. నాలిక రుచి కోసం చూసుకుంటే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి ఉప్పుని దూరం పెట్టండి. భోజనం చేసేటప్పుడు చాలామంది కూరల్లో ఉప్పు సరిపోకపోతే పచ్చి ఉప్పును వేసి కలుపుకొని తింటారు. ఇది చాలా ప్రమాదకరం. వండుతున్నప్పుడు వేసిన ఉప్పుతోనే సరిపెట్టుకోవాలి. కూర ఉడుకుతున్నప్పుడే ఉప్పు వేయాలి. ఉప్పు వేశాక కూరను కనీసం 10 నిమిషాలు బాగా ఉడికించాలి. దీనివల్ల ఉప్పు ప్రభావం కాస్త తగ్గుతుంది. కానీ పచ్చి ఉప్పును తినడం మాత్రం చాలా ప్రమాదకరం. సలాడ్లలో ఎక్కువ మంది పచ్చి ఉప్పుని జల్లుకొని తింటారు. ఇలా తినడం వల్ల త్వరగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. రుచి తగ్గితే ఉప్పు బదులు నిమ్మరసం చల్లుకొని తినడం అలవాటు చేసుకోండి.
Also read: దానిమ్మ తొక్కలు పడేస్తున్నారా? వాటితో అందాన్ని ఇలా పెంచేయొచ్చు
Also read: ముందు రోజే చపాతీ, పూరి పిండిని కలిపి నిల్వ చేయడం మంచిదేనా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.