Beauty: దానిమ్మ తొక్కలు పడేస్తున్నారా? వాటితో అందాన్ని ఇలా పెంచేయొచ్చు
దానిమ్మలతో ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో, దానిమ్మ తొక్కలతో అందానికి అంతే మేలు జరుగుతుంది.
దానిమ్మ పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. ముఖ్యంగా రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. చాలామంది పండ్లు తిన్నాక దానిమ్మ తొక్కలను పడేస్తూ ఉంటారు. కానీ వాటితో అందాన్ని పెంచుకోవచ్చు. దానిమ్మ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తాయి. దానిమ్మ తొక్కలను పొడిగా చేసుకుని నీళ్లలో కలిపి తాగితే ఎంతో మంచిది. గుండె జబ్బు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను బయటికి పంపిస్తుంది. అలాగే చర్మ క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది. దానిమ్మ తొక్కలను పొడిగా చేసి, ఆ పొడిని ముఖానికి, చేతులకు, కాళ్లకు రాసుకోండి. ఎండలోకి వెళ్లేటప్పుడు హానికరమైన కిరణాల నుంచి రక్షణ పొందవచ్చు.
దానిమ్మ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఈ దానిమ్మ తొక్క పొడిని అప్పుడప్పుడు నీళ్లలో కలిపి తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. దానిమ్మ తొక్కలను నీటిలో మరిగించి, ఆ నీళ్లను తాగితే గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ దానిమ్మ తొక్కలను బాగా కడిగి రసం తీసి, ఆ రసాన్ని తాగితే ఎంతో మంచిది. శరీరంలోకి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా చేరుతాయి. ఇవి మనల్ని వైరస్, బ్యాక్టీరియా నుంచి కాపాడతాయి. ఒక కప్పు నీటిలో కాస్త నిమ్మరసం, ఒక స్పూన్ దానిమ్మ పొడి వేసి తాగడం అలవాటు చేసుకోవాలి.
దానిమ్మ పొడిని ఒకసారి చేసి దాచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. దీనికోసం ముందుగా దానిమ్మ తొక్కలను ఎండలో ఆరబెట్టాలి. తడి లేకుండా అవి బాగా ఎండిపోవాలి. తర్వాత మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. ఒక డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. దాన్ని అవసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉండొచ్చు.
ఈ దానిమ్మ పొడి స్క్రబ్ లా ఉపయోగపడుతుంది. ఈ పొడిలో కాస్త నీళ్లు కలిపి ముఖంపై మర్దనా చేస్తే మృతకణాలు పోతాయి. ట్యాన్ తొలగిపోతుంది. చర్మం మెరుస్తుంది. ఈ పొడిలో కాస్త నీళ్లు కలిపి మెత్తని పేస్టులా చేసి మొటిమలు ఉన్నచోట రాస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. ఈ దానిమ్మ పొడిని పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా రావు. కొబ్బరి నూనెలో దానిమ్మ తొక్కలను వేసి వేడి చేయాలి. చల్లారాక ఆ నూనెను తలకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు పూర్తిగా తగ్గిపోతుంది.
Also read: ముందు రోజే చపాతీ, పూరి పిండిని కలిపి నిల్వ చేయడం మంచిదేనా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.