Avocado: రోజుకో అవకాడో తింటే బరువు తగ్గుతారా? గుండె జబ్బులు దరిచేరవా?
చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి అన్ని విధాలుగా చెడు చేస్తుంది. దీన్ని తగ్గించుకోవడంలో సహాయపడే పండు అవకాడో.
ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఇష్టపడుతున్న పండుగా అవకాడో మారిపోయింది. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది. ఇందులో విటమిన్ సి, ఇ, కె, ఫోలేట్, పొటాషియంతో పాటు ఖనిజాలు సమృద్ధిగా అందుతాయి. తాజా పరిశోధన ప్రకారం అవకాడో తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.
కొలెస్ట్రాల్ ఎలా తగ్గిస్తుంది?
వివిధ అధ్యయనాల ప్రకారం అవకాడో తీసుకోవడం వల్ల HDL, LDL కొలెస్ట్రాల్ స్థాయిలని నియంత్రిస్తుంది. గుండెకి ఆరోగ్యాన్ని ఇచ్చే మోనోశాచురేటెడ్ కొవ్వులు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. వాటితో పాటి విటమిన్ సి, కె, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇదే కాకుండా ఫైటోస్టెరాల్స్ పోషకాలు మెండుగా ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఐదు వారాల పాటు సాగిన ఒక అధ్యయనంలో అవకాడో తీసుకున్న వారిలో LDL స్థాయిల్లో గణనీయంగా మార్పులు చోటుచేసుకున్నట్టు గుర్తించారు. అవకాడో తిన్న వారిలో లూటీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా అధిక స్థాయిలో ఉండటం గమనించారు.
అవకాడోతో చేసిన పదార్థాలు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 16 శాతం తక్కువగా ఉందని ఒక అధ్యయనం తేల్చింది. మీడియం సైజ్ అవకాడోలో 96 కేలరీలు, 6 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వులు, 4 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేసి గుండె స్ట్రోక్ రాకుండా నివారిస్తుంది.
ఆరోగ్యమే కానీ పరిమితం
అవకాడో వల్ల గుండెకి ఆరోగ్యం ఇస్తుంది. కానీ అతిగా తింటే మాత్రం ఇతర ప్రభావాలు చూపిస్తుంది. ఇందులో కేలరీలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మోనోశాచురేటెడ్ కొవ్వు అయినప్పటికీ దాన్ని అధిక మొత్తంలో తీసుకుంటే బరువు పెరగడానికి దోహదపడుతుంది. అందుకనే ఆరోగ్యంగా ఉండటం కోసం వైద్యులు సిఫార్సు చేసిన దాని ప్రకారం మితంగా మాత్రమే తీసుకోవాలి. ఒక వేల ఆరోగ్యకరంగా బరువు పెరగాలని అనుకునే వాళ్ళు అవకాడో తీసుకుంటే మంచిది.
ఎలా తినాలి?
అవకాడో మొక్కల ఆధారిత ఆహార జాబితాలోకి వస్తుంది. భోజనంలో తీసుకోవచ్చు. వీటిని నాచో చిప్స్, బ్రెడ్ టోస్ట్, వెజిటబుల్ క్రూడిట్స్, సలాడ్ పై డ్రెస్సింగ్, టాపింగ్ గా కూడా తీసుకోవచ్చు. రెగ్యులర్ గా చేసుకునే డెజర్ట్ లకు అదనపు రుచి జోడించాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవకాడో ట్రై చేయొచ్చు. మనదగ్గర అవకాడో వాడకం చాలా తక్కువ. సూపర్ మార్కెట్లో, ఆన్ లైన్ గ్రోసరీలలో మాత్రమే ఇవి దొరుకుతాయి.
గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం సమతుల్య ఆహారం క్రమం తప్పని వ్యాయామం, శరీరం హైడ్రేట్ గా ఉంచుకోవడం, కంటి నిండా నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం చాలా ముఖ్యం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: నిద్రలో పళ్ళు గట్టిగా కొరికేస్తున్నారా? జాగ్రత్త, ఈ సమస్యలు తప్పవు!