Diabetes: మధుమేహం ఉన్నా అరటి పండు తినొచ్చు, కానీ ఈ జాగ్రత్తలతో..
మధుమేహం ఉన్న వారు అరటిపండు తినాలంటే చాలా భయపడతారు.
డయాబెటిస్ వచ్చిందా అంతే సంగతులు, ఏది తిన్నాలన్నా ఓసారి ఆలోచించుకుని తినాలి. అధికంగా అన్నం కూడా తినకూడదు. కొన్ని రకాల ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. పండ్ల విషయంలో ఇంకా కొంతమందిలో సందేహం ఉంది. కొన్ని రకాల పండ్లు తినకూడదనుకుంటారు. అలా తినకూడదనుకునే పండ్లలో అరటిపండు కూడా ఒకటి. చాలామంది డయాబెటిక్ రోగులు అరటిపండును తినడానికి సందేహిస్తుంటారు. కానీ డయాబెటిస్ ఉన్న వారు కూడా అరటిపండు తినవచ్చని చెబుతున్నారు వైద్యులు. కాకపోతే కొన్ని కండిషన్స్‌తో.
ఈ జాగ్రత్తలు తప్పవు...
భోజనంతో కలిపి అరటి పండు తినకూడదు. అంటే భోజనం తిన్న వెంటనే అరటి పండు తినడం చేయకూడదు. అన్నంలో అప్పటికే చక్కెర ఉంటుంది, దానికి అరటి పండు కూడా జత చేరితే రక్తంలోని చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి అన్నం తిన్న రెండు గంటల తరువాత తినవచ్చు. రోజుకు ఒకటి లేదా రెండు అరటి పండ్ల వరకు తినవచ్చు. అంతకుమించి ఎక్కువ తినడానికి వీల్లేదు. ఈ పండులో ఫ్రక్టోజ్ షుగర్ ఉంటుంది కాబట్టి మితంగానే తీసుకోవాలి. బాగా పండిన, నల్లటి మచ్చలు పడిన అరటి పండ్లు తింటే మంచిది. వాటి ద్వారా పొటాషియం పొటాషియం, ఫైబర్ లభిస్తాయి. ఇవి రెండూ కూడా షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. హైబీపీని తగ్గించి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటే మాత్రం అరటి పండ్ల జోలికి వెళ్లకండి. అలాగే రాత్రి పూట ఈ పండ్లను తినకండి. దీనివల్ల షుగర్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.
Also Read: ధూమపానం వల్ల పెరిగిపోతున్న గుండె జబ్బులు, మానకపోతే పోటు వచ్చే అవకాశం
ఏ పండ్లు మంచివి?
మధుమేహరోగులు దానిమ్మ, స్ట్రాబెర్రీ, ద్రాక్షలు, అవకాడోలు, రేగు పండ్లు తినవచ్చు. తక్కువ చక్కెర స్థాయిలు ఉన్న ఏ పండ్లయినా హాయిగా తినవచ్చు. ఎక్కువ తీపిగా ఉన్న పండ్లను కాస్త తక్కువగా తింటే మంచిది. పండ్ల రసాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. పండ్ల రసాల వల్ల చాలా పోషకాలు నశిస్తాయి. బయట అమ్మే పండ్ల రసాలు అసలు తాగవద్దు. అందులో పంచదార కలుపుతారు. స్ట్రాబెర్రీలు కూడా అధికంగా తినకూడదు. రోజుకు మూడు నాలుగు తింటే మంచిది.
Also Read: ఇతడో మంచి దొంగ, ఏమీ ఎత్తుకుపోలేదు సరికదా తిరిగి ఇచ్చి వెళ్లాడు
పండ్లు అన్నం తిన్న వెంటనే తింటే చక్కెర స్థాయిలు పెరగచ్చు. కాబట్టి అవి తినడానికి ఉత్తమ సమయం భోజనం చేసిన రెండు గంటల తరువాత. అలాగే సాయంత్రం ఏడు తరువాత తినకపోతేనే మంచిది. ఒకవేళ తిన్నా కూడా అధిక చక్కెర ఉండే పండ్లను ఎంచుకోవద్దు.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.