Smoking: ధూమపానం వల్ల పెరిగిపోతున్న గుండె జబ్బులు, మానకపోతే పోటు వచ్చే అవకాశం
వయసుతో సంబంధం లేకుండా విరుచుకుపడుతోంది గుండెపోటు.

ఒకప్పుడు గుండె జబ్బులంటే వయసు పెరిగాక వచ్చేవి. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. పాతికేళ్ల కుర్రాడికి కూడా ఎప్పుడైనా గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. చిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడి మరణించిన యువత సంఖ్య పెరుగుతోంది. అంతెందుకు హైదరాబాద్‌లోనే ఒక రాజకీయ నేత కొడుకు కేవలం 21 ఏళ్ల వయసులోనే గుండెపోటుకు గురై మరణించాడు. 2015లో భారతదేశంలో దాదాపు ఆరుకోట్ల 20 లక్షల మందికి గుండె సంబంధ వ్యాధులు ఉన్నాయని, వారిలో రెండు కోట్ల 30 లక్షల మంది వయసు కేవలం 40 ఏళ్ల లోపేనని ఒక సర్వే తేల్చింది. ఆధునిక కాలంలో ఇలా గుండె సంబంధ వ్యాధులు పెరిగిపోవడానికి లైఫ్‌స్టైల్ ప్రధాన కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. అందులో ఒత్తిళ్లు, చెడు ఆహారపు అలవాట్లతో పాటూ ధూమపానం ప్రధాన పాత్ర వహిస్తోంది.
సగం రిస్క్ వీటి వల్లే...
ఓ సర్వే ప్రకారం ఒక వ్యక్తి ధూమపానానికి ఏడాది పాటూ దూరంగా ఉంటే గుండె పోటు వచ్చే అవకాశాలు సగం వరకు తగ్గిపోతాయి. రోజూ ధూమపానం చేసే వారిలో, చేయని వారితో పోలిస్తే కొరోనరీ ఆర్టరీ వ్యాధి వచ్చే అవకాశం అధికం అని చెబుతున్నారు వైద్యులు. సిగరెట్ తాగడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది నుంచి పదిహేను శాతం మంది గుండె సంబంధ మరణాలు సంభవిస్తున్నాయి. ఇదొక్కటే కాదు బ్రెయిన్ స్ట్రోక్‌లు, రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడం, కాళ్లల్లో ధమనులు గట్టిగా మారడం వంటివి సంభవిస్తాయి. ధూమపానం గుండె కండరాలకు ఆక్సిజన్ తీసుకువెళ్లే రక్తనాళాల్లో గడ్డలు, ఫలకాలు ఏర్పడటానికి కారణం అవుతుంది. దీని వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం అధికంగా పెరుగుతుందని కార్డియాలజిస్టులు వివరిస్తున్నారు. కాబట్టి ధూమపానం అలవాటున్న వారు వెంటనే దాన్ని వదిలివేయడం అన్ని విధాలా మంచిది.
Also read: వారానికోసారి సముద్రపు చేపలు తినాల్సిందే, ఈ సమస్యలున్న వారికి మరీ మంచిది
గుండె రక్షణకు ఈ అలవాట్లు...
గుండెకు రక్షణను, ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని ఏరికోరి తినాలి. ముఖ్యంగా సాల్మాన్, టూనా, మాకెరెల్ వంటి చేపలు, ఇతర సముద్రపు చేపలు తరచూ తినాలి. ఈ చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. గుండెకు ఇవి చాలా అవసరం. ఓట్స్‌ను రోజూ తినడం మంచిది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. శరీరంలో చేరిన కొవ్వును ఇది తగ్గిస్తుంది. గుండెలోని ధమనుల్లో ఇన్‌ఫ్లమ్మేషన్ సమస్య రాకుండా ఉండాలంటే బాదం, వాల్‌నట్స్, కిస్‌మిస్లు, జీడిపప్పులు, ఖర్జూరాలు, అంజీర్లు వంటి నట్స్ రోజూ ఓ గుప్పెడు తినాలి. గుండెకు మేలు చేసే క్యారెట్లు, చిలగడ దుంపలు అధికంగా తీసుకోవాలి. మద్యపానం పూర్తిగా మానివేయాలి. మాంసాహారం అతిగా కాకుండా మితంగా తినాలి. అతిగా తింటే కొవ్వు చేరే అవకాశం ఉంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: శక్తినిచ్చే పుట్టగొడుగుల ఆమ్లెట్... చేయడం చాలా సులువు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

