Baby Skin Care: మీ బుజ్జాయి చర్మ సంరక్షణ ఎలా చేస్తున్నారు? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మొదటి సారి తల్లి అయిన ప్రతి అమ్మ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. మీ బుజ్జాయిల చర్మ సంరక్షణ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారు.
పెద్దల కంటే పసి పిల్లల చర్మ సంరక్షణ మరింత కఠినం. మీ బిడ్డకు వెచ్చగా, పోషణ కలిగిన చర్మం అందించాలంటే అందుకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. బుజ్జాయిలు పుట్టినప్పటి నుంచి ఎటువంటి సోప్ ఉపయోగించాలి, ఏ పౌడర్ స్కిన్ కి సరిపోతుందనే విషయాల గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. ఎందుకంటే శిశువు చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే వారి చర్మ సంరక్షణ కఠినమైన సవాలు అంటారు. లేదంటే వాళ్ళకి చికాకు, దద్దుర్లు, దురదగా అనిపిస్తుంది. దాని వల్ల ఏడుస్తూ ఉంటారు. చర్మం మీద చిన్నతనం నుంచే మచ్చలు పడతాయి. అందుకే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
శిశువు చర్మ సంరక్షణలో చేయాల్సినవి
శుభ్రంగా స్నానం చేయించాలి: నవజాత శిశువుల చుట్టూ పరిశుభ్రత అవసరం. ఎందుకంటే వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అంటువ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే శిశువుకి వారానికి 2,3 సార్లు చేయిస్తే వాళ్ళ చర్మం శుభ్రంగా ఉంటుంది. అలాగే మీరు పిల్లల్ని ఎత్తుకునే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి. బయట వాళ్ళు కూడా బిడ్డని తాకే ముందు చేతులు, కాళ్ళు కడుక్కుని రమ్మని చెప్పాలి.
మాయిశ్చరైజింగ్: శిశువు చర్మం సాధారణంగా పొడిగా ఉంటుంది. గర్భం వెలుపల వాతావరణానికి అలవాటు పడినప్పుడు శరీరం బయటకు రాగానే ఉన్న వాతావరణాన్ని తట్టుకోవడం కొంచెం కష్టం. అందుకె చర్మం పొడిబారకుండా ఉండాలంటే వారి కళ్ళకు చికాకు కలిగించకుండా ఉండే సబ్బు ఉపయోగించడం చాలా అవసరం. స్నానం చేసిన తర్వాత శరీరం అంతటా లోషన్ పూయాలి. సెటాఫిల్ బేబీ డైలీ లోషన్ లో సన్ ఫ్లవర్ సయీద్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ ఉన్నవి ఎంపిక చేసుకోవాలి. ఇవి సున్నితమైన చర్మాన్ని తేమగా ఉంచుతాయి. షియా బటర్, గ్లిజరిన్ మిశ్రమం వంటి సహజ ఎమోలియెంట్ లు ఉన్నాయి.
దద్దుర్లుకి చికిత్స: నవజాత శిశువుల్లో దద్దుర్లు చాలా సాధారణం. అవి తగ్గిపోవడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఎర్రబడటం మచ్చలు ఏర్పడం కూడా కొన్ని సార్లు జరుగుతుంది. శిశువు చర్మంపై మొటిమల వంటి దద్దుర్లు, చర్మం పొట్టు రాలడం వంటివి కనిపిస్తే భయపడొద్దు. ఆ ప్రాంతాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచాలి. ఎంతకీ తగ్గకపోతే వైద్యులని సంప్రదించాలి. చర్మానికి సరిపోయే ఆయిల్ తీసుకుని స్నానం చేయించే ముందు కాసేపు మసాజ్ చేయడం మంచిది.
హైడ్రేట్ గా ఉంచాలి: పిల్లలు, పెద్దలు ఇద్దరూ హైడ్రేట్ గా ఉంచడం చాలా అవసరం నీరు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని కూడా ఇస్తుంది. హైడ్రేషన్ గా ఉంటే శరీరంలోని అన్ని విష పదార్థాలు బయటకి పోతాయి. శిశువు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బిడ్డకి గంట గంటకి తల్లిపాలు ఇవ్వడం చాలా అవసరం.
శిశువు చర్మ సంరక్షణలో చేయకూడని పనులు
నేరుగా సూర్యకాంతికి పెట్టడం: తెల్లవారుజామున సూర్యుని కిరణాలు బిడ్డకు తగిలితే మంచిదని చెప్తారు. అది నిజమే కానీ నేరుగా ఎండ వేడి శరీరం మీద పడకూడదు. యూవీ రేడియేషన్ వారి లేత చర్మాన్ని దెబ్బతీస్తుంది. అందుకే మొదటి ఆరు నెలలు నేరుగా సూర్యరశ్మి పడేలా చేయకుండా నివారించాలని సూచిస్తున్నారు. బయటకి వెళ్లేటప్పుడు శిశువుకి అనుకూలమైన సన్ స్క్రీన్ రాయాలి. గొడుగు వేసుకుని తీసుకువెళ్లడం ఉత్తమం.
రంగులు, సువాసనల ఉత్పత్తులు వద్దు: మార్కెట్లో ఎన్నో రకాల ఉత్పత్తులు ఉన్నాయి. కానీ అవన్నీ సురక్షితమైనవి కావు. సువాసన, కృత్రిమ రంగులు శిశువు చర్మానికి చికాకు కలిగిస్తాయ్ఈ. దద్దుర్లు వచ్చేలా చేస్తాయి.
బిర్రుగా ఉండే దుస్తులు వేయడం: శరీరానికి బిగుతుగా ఉండే దుస్తులు శిశువుకి చికాకు కలిగిస్తాయి. గాలి తగలదు. బిగుతుగా ఉండటం వల్ల చెమట పట్టి వేడి దద్దుర్లు సులభంగా ఏర్పడతాయి. అందుకే వారికి దుస్తులు వదులుగా ఉండేలా చూసుకోవాలి. అవి వాళ్ళు కదలడానికి కూడా హాయిగా ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఐస్ ఫేషియల్‌తో మతిమరపు సమస్య పోతుందా? ఈ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు