Warning Signs of a Stroke : వ్యాయామం చేసేప్పుడు ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. గుండెపోటు కావొచ్చు
Heart Attack : ఈ మధ్య వ్యాయామాలు చేసేప్పుడు చాలామంది గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కొన్ని లక్షణాలు కనిపిస్తే ఎక్సర్సైజ్ ఆపేయాలి అంటున్నారు నిపుణులు.
Heart Problems with Workouts : వ్యాయామం చేస్తే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఎక్సర్సైజ్లు ఎక్కువగా చేసినా.. కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు అదే పనిగా వ్యాయామాలు చేసినా అది మీ ప్రాణాలకే ముప్పు అవుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవడానికి రోజువారీ వ్యాయామం ఉత్తమమైన మార్గాలలో ఒకటి. రెగ్యూలర్ వర్క్వుట్ సెషన్లు లేదా ఏదైనా శారీరక శ్రమ అనేది మొత్తం ఆరోగ్యంతో పాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ వ్యాయామం చేసేప్పుడు ఎక్కువ ఒత్తిడి, అధిక వ్యాయామం చేయడం అస్సలు మంచిది కాదు.
వ్యాయామ సమయంలో గుండె సమస్యలు వచ్చే ప్రమాదాలు ఈ మధ్య బాగా ఎక్కువ అవుతున్నాయి. అయితే ఇలాంటి ప్రమాదం ఎదురయ్యే ముందు కొన్ని లక్షణాలు మనకి కనిపిస్తాయి. వాటిని తెలుసుకుని.. వ్యాయామానికి బ్రేక్ ఇవ్వాలి అంటున్నారు నిపుణులు. వీటి గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అంటున్నారు. దీనివల్ల సకాలంలో చికిత్స పొంది.. ప్రాణాలు కాపాడుకోవచ్చని చెప్తున్నారు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటి? వాటిని ఎలా గుర్తించాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాయామం చేసేప్పుడు కనిపించే కొన్ని సాధారణ సంకేతాలు (Symptoms of Heart Attack) గుండె సమస్యలను ప్రేరేపిస్తాయి. అలసట, ఛాతీలో అసౌకర్యం, బరువు లేదా వ్యాయామం చేసే సమయంలో విపరీతమైన చెమట వంటి లక్షణాలు గుండె సమస్యలకు సాధారణ సంకేతాలు. వీటిని అస్సలు విస్మరించకూడదు. గుండె సమస్యలకు దారితీసే మరిన్ని సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఛాతీ నొప్పి
ఎక్సర్సైజ్ చేసేప్పుడు ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం కలగడం అనేది అస్సలు విస్మరించకూడని లక్షణం. కొందరు ఛాతీ నొప్పి వస్తుంటే వ్యాయామం వల్ల కలిగిందేమో అనుకుంటారు. మీకు కలుగుతున్న నొప్పి మునుపెన్నడూ లేనివిధంగా ఉంటే మీరు వెంటనే అలర్ట్ అయిపోవాలి. గుండె నొప్పి ఎడమ చేతికి వ్యాపిస్తుంది. చెమట ఎక్కువగా పడుతుంది. ఈ లక్షణాలను అస్సలు విస్మరించకూడదు. మధుమేహమున్నవారికి అయితే ఈ లక్షణాలు కనిపించవు. వారి సైలంట్ హార్ట్ ఎటాక్ అవుతుంది.
ఊపిరి ఆడకపోవడం..
వర్కౌట్స్ చేస్తున్నప్పుడు మీకు ఛాతీలో అసౌకర్యంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగితే వెంటనే వ్యాయామం ఆపేయండి. అక్కడున్నవారికి మీ సమస్యను చెప్పండి. ఇది గుండెపోటు ప్రారంభ లక్షణాలలో ఒకటి. ఈ లక్షణం ఛాతీ నొప్పితో వస్తుంది. కొన్నిసార్లు నొప్పి లేకుండా కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదముంది.
కళ్లు తిరగడం..
జిమ్ చేసే సమయంలో అలసిపోవడం అనేది కామన్. కానీ.. ఎక్కువగా అలసిపోతున్న భావన మీలో ఉంటే.. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఈ జిమ్ ఫీల్డ్కి కొత్త అయితే.. మీకున్న లక్షణాలను వెంటనే ట్రైనర్ దృష్టికి తీసుకువెళ్లాలి. ఎందుకంటే ఇది గుండెపోటు హెచ్చరికలు ఇస్తుంది. కాబట్టి వెంటనే వ్యాయామం ఆపేయండి.
గుండెలయలో మార్పులు
వ్యాయామం చేస్తున్నప్పుడు హృదయ స్పందనలో మార్పులు గమనిస్తే కాస్త జాగ్రత్తగా ఉండండి. దడగా, చప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న అది గుండె సంబంధిత సమస్యకు సూచన కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాలి.
గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు
టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలు, ఊబకాయం, ధూమపానం, కుటుంబసభ్యులకు గుండెపోటు సమస్యలున్నవారు.. వ్యాయామాలు చేసేముందు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వారానికి మూడు నుంచి ఐదుసార్లు 30 నిమిషాలు మితమైన, శక్తివంతమైన వ్యాయామం చేస్తే మంచిది. ఇది మొత్తం ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు.. హార్మోన్లను విడుదల చేయడానికి సహాయం చేస్తుంది. మీరు అంతకుమించి వర్కౌట్ చేయాలనుకుంటే నిపుణుల సలహా కచ్చితంగా తీసుకోవాలి.
Also Read : మహిళలు రోజుకు ఇన్ని గంటలు కచ్చితంగా నిద్రపోవాలట.. లేదంటే అంతే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.