Seafood: సముద్రపు చేపలంటే ఇష్టమా? వాటిలో దాక్కున్న అయిదు ప్రమాదాలు ఇవిగో
సముద్రపు చేపలు తింటే ఆరోగ్యమే కానీ కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి.
ప్రపంచవ్యాప్తంగా సీఫుడ్‌కు అభిమానులు ఎక్కువ. రకరకాల చేపలు, రొయ్యలు, పీతలు సముద్రం నుంచి లభిస్తాయి. మనదేశంలో కన్నా ఇతర దేశాల్లో సీఫుడ్ వాడకం మరీ ఎక్కువ. సముద్రపు చేపలు చాలా ఆరోగ్యకరమని తెలుసు కానీ అవి పూర్తిగా సురక్షితమేనా?
సముద్రపు ఆహారంలో ఒమెగా3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. అంతేకాదు మెదడు, గుండె ఆరోగ్యానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే మధ్యధరా, తీర ప్రాంతాలలో వీటి వినియోగం చాలా ఎక్కువ. ఈ సముద్రపు ఆహారాన్ని మితంగా తీసుకుంటే మంచిదే. కానీ అధికంగా తీసుకుంటే మాత్రం కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అవి తీవ్ర అనారోగ్యాలకు కారణమవుతాయి.
లోహాలతో కలిసి
కాడ్మియం, సీసం, పాదరసం వంటి రకరకాల లోహాలు సముద్రపు ఆహారంలో కనిపిస్తాయి. ఈ లోహాలు మానవశరీరంలోకి ప్రవేశించినప్పుడు అవి మెదడు, గుండెకు కీడు చేస్తాయి. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. శరీరాన్ని విషపూరితం చేస్తాయి. సముద్రంలో ఆ లోహాలన్నీ ఉంటాయి. వాటిని చేపలు తింటాయి కాబట్టి వాటి శరీరాల్లో ఈ లోహాలు ఉండే అవకాశం ఎక్కువ.
పరాన్న జీవులతో సమస్యే
పరాన్న జీవులు అంటే ఇతర జీవులపై బతికేవన్నమాట. అలా సముద్రపు చేపలపై కొన్ని రకాల టేప్ వార్మ్‌లు, అనిసాకిస్ సింప్లెక్స్ అనే పరాన్న జీవులు ఉంటాయి. అందుకే చేపలు చాలా శుభ్రపరిచి, బాగా ఉడికించి తినాలి. సుఫీ, సాషిమి వంటి వంటకాల్లో మాత్రం చేపను సగమే ఉడికిస్తారు కాబట్టి వాటిని తింటే పరాన్న జీవులు శరీరంలోకి చేరుతాయి.
సముద్రపు కాలుష్యం
సముద్రం కాలుష్యానికి నిలయంగా మారింది. కాలుష్యం తాలూకు మలినాలు చేపల కొవ్వు కణాజాలాల్లో పేరుకుపోతుంటాయి. వీటిని తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థకు హాని కలుగుతుంది. క్యాన్సర్లు, హార్మోన్ల అసమతుల్యత వంటి రోగాలు దాడి చేసే అవకాశం ఉంది. పాలు తాగే పిల్లలున్న తల్లులు సముద్రపు చేపలను తినకపోవడమే మంచిది.
మెర్క్యురీ టాక్సిసిటీ
సముద్రపు ఆహారంలో అధిక స్థాయిలో పాదరసం ఉండే అవకాశం ఉంది. వీటిని తరచూ తినడం వల్ల పాదరసం శరీరంలో చేరుతుంది. ఇది ‘మెర్క్యురీ టాక్సిసిటీ’ అని పిలిచే సమస్యకు దారి తీస్తుంది. ఇది మానసిక సమస్యలతో పాటూ, అనేక శారీరక సమస్యలకు కారణమవుతుంది.
బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్లు
సముద్రపు ఆహారంలో కనిపించే బ్యాక్టిరియా సాల్మొనెల్లా. క్లోస్ట్రిడియం పెర్‌ఫ్రింజెన్స్, బాసిల్లస్ సెరియస్, విబ్రియో, షిగెల్లా వంటివి కూడా సముద్రపు బ్యాక్టిరియాలే. ఇవి చేపల శరీరంపైన, లోపల చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా సాల్మొనెల్లా అధికంగా సముద్రపు చేపల్లో నివసిస్తోంది. ఈ బ్యాక్టిరియా అధికంగా ఒంట్లో చేరడం వల్ల వికారం, పొత్తికడుపు నొప్పులు, వాంతులు వంటివి కలుగుతాయి.
Also read: కష్టానికి దక్కిన బహుమతి, తన ఉద్యోగికి బెంజ్ కారును గిఫ్టుగా ఇచ్చిన యజమాని