Beauty: మొటిమలను తగ్గించే ప్రభావవంతమైన చిట్కాలు ఇవిగో
మొటిమలతో ముఖం అందవికారంగా మారిందా, వాటిని పోగొట్టే కొన్ని సులువైన చిట్కాలు ఇవిగో
వయసు ప్రభావం వల్ల, కొన్ని రకాల చర్మ సమస్యల వల్ల మొటిమలు వస్తుంటాయి. అందులో కొన్ని వచ్చి పోతుంటాయి. కాని కొన్ని రకాల మొటిమలు మాత్రం రోజుల తరబడి ఉంటాయి. స్రావాలు కారుతూ ఇబ్బంది పెడతాయి. ఎలాంటి రకమైన మొటిమలైన ముఖంపై అధికంగా ఉంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ముఖం కాంతి కూడా తగ్గుతుంది. ఇంట్లనే చేసుకునే కొన్ని రకాల చిట్కాల ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు.
కలబంద గుజ్జుతో...
ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటారు చాలా మంది. అందాన్ని పెంచడంలో దీని పాత్ర ముఖ్యమైనది. ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో కలబంద గుజ్జును ఉపయోగిస్తారు. కలబంద ఆకుల మధ్యలోంచి జిగటగా ఉండే గుజ్జును తీసి మొటిమలపై రాయాలి. ఇలా రోజు రాత్రి పడుకోబోయే ముందు చేయాలి. అలాగే నిద్రపోయి మరుసటి రోజు ఉదయం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా కొన్ని రోజుల పాటూ చేస్తుంటే మొటిమలు తగ్గుతాయి.
ఐస్‌క్యూబ్‌లు...
ఫ్రిజ్‌లో ఉండే ఐస్ క్యూబులు కూడా మొటిమలను తగ్గించేందుకు చాలా సహాయపడతాయి. ఒక రుమాలులో ఐస్‌క్యూబ్ వేసి చుట్టాలి. ఆ క్లాత్ తో మొటిమలపై కొన్ని సెకన్ల పాటూ మర్ధనా చేయాలి. ఇలా రెండు మూడు నిమిషాలపాటు చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమలు తగ్గుతాయి. ఇలా మొటిమలు పోయేంత వరకు చేయాలి. మొటిమలు లేని వారు కూడా ఇలా ఐస్ క్యూబులతో చేయడం వల్ల చర్మం శుభ్రపడుతుంది.
ఆస్పిరిన్ టాబ్లెట్లతో
గుండె పోటు వచ్చే అవకాశాన్ని తగ్గించడానికి ఆస్పిరిన్ ను వేసుకుంటారు చాలా మంది. జ్వరానికి, జలుబుకు, నొప్పిని తగ్గించడానికి కూడా దీన్ని వాడతారు. వీటిలో మొటిమలను తగ్గించే శక్తి కూడా ఉంటుంది. ఆ మాత్రలను పొడిలా చేసుకోవాలి. కొంచెం గోరు వెచ్చని నీటిని కలిపి పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టును మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసుకోవాలి. అలా పావు గంటలసేపు ఉంచుకున్నాక ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రంచేసుకోవాలి. మొటిమలు అధికంగా బాధిస్తున్నప్పుడు రోజుకు రెండు సార్లు చేయాలి. దీంతో మొటిమలు వెంటనే తగ్గిపోతాయి.
ఇవి చేయద్దు
1. మొటిమలు వచ్చాక గిల్లకూడదు. సమస్య పెరుగుతుంది.
2. మొటిమలు వస్తున్నప్పుడు స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఆయిల్, వేపుళ్లువంటి కొవ్వు అధికంగా ఉన్న ఆహారపదార్థాలను తినకూడదు.
3. మానసిక ఆందోళన లేకుండా ఉండాలి. ఒత్తిడి, డిప్రెషన్ వల్ల కూడా మొటిమలు పెరుగుతాయి.
4. నిద్ర తక్కువైనా కూడా చర్మంపై మొటిమలు అధికంగా పెరుగుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం, నిద్ర చాలా అవసరం.
Also read: బప్పీ లహిరి ప్రాణాలు తీసిన స్లీప్ డిజార్డర్, ఏంటి ఆ ఆరోగ్య సమస్య? ఎందుకొస్తుంది?