చ్యవన్‌ప్రాష్ మొదటిసారి ఎప్పుడు తయారు చేశారో తెలుసా? దాన్ని తినాల్సిన పద్ధతి ఇది
చ్యవన్ ప్రాష్ మొదట ఎప్పుడు తయారు చేశారు? ఎవరి కోసం తయారు చేశారో తెలుసుకోవాలంట చదవండి.
చ్యవన్‌ప్రాష్ రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యమని చెబుతారు. ఇప్పటికీ దాన్ని కచ్చితంగా రోజూ తినే వారు ఉన్నారు. దానొక్క అద్భుత ఔషధంగా భావిస్తారు. ఆ మిశ్రమాన్ని ఎవరు తయారు చేశారో మాత్రం తెలియదు. కానీ చరిత్ర చెబుతున్న కథల ప్రకారం అది ఈనాటిది కాదు. కొన్ని వేల ఏళ్ల క్రితమే తయారైందని తెలుస్తోంది. దీన్ని రుషులు తయారు చేశారని, చ్యవనుడు అనే రుషి కోసం మరో ఇద్దరు రుషులు కలిసి దీన్ని సిద్ధం చేశారని, ఇది యవ్వనాన్ని అందిస్తుందనే కథలు వాడుకలో ఉన్నాయి. ఆ రుషి పేరు మీదే దీనికి చ్యవన్‌ప్రాష్ అని పేరు పెట్టినట్టు చెబుతున్నారు. ప్రాష్ అంటే ఏదైనా తయారు చేయడం అని అర్థం.
ఏమేం ఉన్నాయి?
చ్యవన్‌ప్రాష్ అద్భుత మూలికల సమ్మేళనం. ఇందులో 40 రకాల ఔషధ మూలికలు ఉన్నట్టు సమాచారం. ఇవన్నీ మన శరీరానికి ఏదో ఒక విధంగా ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. ఉసిరి, బ్రహ్మి, తులసి, వేప, కేసర, పిప్పలి, అశ్వగంధ, గోక్షుర, తెల్ల చందనం, బ్రాహ్మి, పచ్చి యాలకులు, నెయ్యి, తేనె, అర్జున వంటి చాలా పదార్థాలు ఇందులో ఉన్నాయి.
ఎలా తినాలి?
చలికాలంలో రోజూ ఒక స్పూన్ చ్యవన్‌ప్రాష్ తీసుకోవడం మంచిది. పిల్లలకు, వయసు పెరిగిన వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఎప్పుడు తినాలో చాలా మందికి అవగాహన లేదు. ఖాళీ పొట్టతో చ్యవన్ ప్రాష్ తినడం మంచిది. దీన్ని తిన్నాక రెండు గంటల పాటూ ఏ ఆహారాన్ని తినకపోవడం ఉత్తమం. లేదా రాత్రి భోజనం చేశాక రెండు మూడు గంటల తరువాత చ్యవన్ ప్రాష్ తినాలి.
ప్రయోజనాలేంటి?
చ్యవన్‌ప్రాష్‌లో ముఖ్య పదార్ధం ఉసిరి. దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది.రోగనిరోధక శక్తిని మరింత సమర్థవంతంగా పెంచుతుంది. చ్యవన్‌ప్రాష్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఇన్‌ఫెక్షన్‌ల నుంచి బయటపడవచ్చు. తరచూ అనారోగ్యం బారిన పడకుండా ఇది కాపాడుతుంది. ఇందులో ఉండే అశ్వగంధ స్త్రీ, పురుషులను వంధ్యత్వం (సంతానం కలగని సమస్య) నుంచి బయటపడేలా చేస్తుంది. అలాగే కీళ్ల నొప్పులు, నిద్రలేమికి కూడా చికిత్స అందిస్తుంది. ఇక ఇందులో ఉండే తులసి మధుమేహం, అధిక రక్తపోటు నుంచి కాపాడుతుంది. ఇందులో ఉండే నెయ్యి శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా కాపాడుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటూ జీర్ణశక్తిని పెంచుతుంది. బ్రహ్మి శరీరంలో మంటను, ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. ఇందులో వాడు అర్జున ఆకుల వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలకు చికిత్స అందించవచ్చు.
Also read: షుగర్ టెస్టుకు ముందు కాఫీ, టీ తాగొచ్చా? ఉపవాసం కచ్చితంగా ఉండాలా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.