కరివేపాకును తక్కువగా చూసి తీసిపారేయకండి, తింటే ఎన్నో లాభాలు
కరివేపాకే కదా అని చాలామంది తీసి పడేస్తూ ఉంటారు, కానీ వాటిని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
కరివేపాకు కూడా ఒక ఆకుకూరే. దాంతో పచ్చళ్ళు, పొడులు చేసుకోవచ్చు. ఇదొక సుగంధ ద్రవ్యంగానే భావించాలి. ఇది కూరకు మంచి వాసన వచ్చేటట్టు చేయడమే కాదు, పోషక విలువలను కూడా అందిస్తుంది. పులిహోర వంటి వాటిలో కరివేపాకు వెయ్యకపోతే రుచి రాదు. మసాలా దినుసుల్లో దీన్ని కూడా ఒక మసాలా దినుసుగానే భావించాలి. ఈ ఆకులను కూడా నమిలి మింగేయడం చాలా ముఖ్యం. దీన్ని తీసి పడేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు.
కరివేపాకులో రాగి, క్యాల్షియం, ఫాస్ఫరస్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల వచ్చే క్యాలరీలు తక్కువే. కానీ శక్తి అధికంగానే ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ b6, విటమిన్ ఏ దీనిలో అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కరివేపాకులను తినడం వల్ల డయేరియా, మధుమేహం, మార్నింగ్ సిక్‌నెస్, వికారం వంటివి రాకుండా ఉంటాయి. కరివేపాకులో ఉండే సుగుణాలు శరీరంలో టాక్సిన్లు, వ్యర్థ పదార్థాలు చేరకుండా కాపాడతాయి.
కరివేపాకు తినడం వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటాయి. గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి. జీర్ణశక్తిని పెంచే గుణం కరివేపాకుకు ఉంది. ఆయుర్వేదంలో కూడా కరివేపాకులను వినియోగిస్తారు. పొట్టలోని వ్యర్ధాలను తొలగించడంలో ఇది ముందుంటుంది. ఇది విటమిన్ ఏ, విటమిన్ సి దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు కలిసి ఉన్న ఆహారాలు అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి. కరివేపాకు తినడం వల్ల జుట్టు పెరుగుదల కూడా బాగుంటుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. కంటి ఆరోగ్యానికి కరివేపాకులు చాలా అవసరం. దీనిలో కెరటోనాయిడ్లు పుష్కలంగా ఉంటుంది. ఇది కార్నియా దెబ్బతినకుండా అడ్డుకుంటుంది. త్వరగా చూపుకోల్పోవడం వంటివి రాకుండా నిరోధిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కరివేపాకు మంచి ఎంపిక. ఇది పేరుకుపోయిన కొవ్వును వదిలిస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ వంటివి శరీరంలో చేరకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఊబకాయం రాకుండా నివారించడంలో కరివేపాకులు ముందుంటాయి. కరివేపాకుల తినడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్టులు చాలా తక్కువ. క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న వాళ్ళు కీమోథెరపి, రేడియో థెరపి వంటి వాటికీ గురవుతారు. వాటి వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్టులు వస్తాయి. వాటిని నియంత్రించే శక్తి కరివేపాకుకు ఉంది. మధుమేహం బారిన పడినవారు కచ్చితంగా కరివేపాకులను తినాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెరగకుండా అడ్డుకునే శక్తి కరివేపాకులకు ఉంది.