Diwali Sweets 2025 : దీపావళి 2025 స్పెషల్ స్వీట్స్.. అరగంటలోపు ఈజీగా చేయగలిగే రెసిపీలు ఇవే
Easy Diwali Sweets : పండుగ సమయంలో అరగంటలోపు చేయగలిగే టేస్టీ స్వీట్స్ రెసిపీలు ఇక్కడున్నాయి. ఈ దీపావళికి మీరు కూడా వీటిని ట్రై చేయవచ్చు.

Tasty Diwali Sweet Recipes 2025 : దీపావళికి దీపాలు, క్రాకర్స్ ఎంత ముఖ్యమో.. స్వీట్స్ కూడా అంతే ముఖ్యం. ఈ పండక్కి చాలామంది స్వీట్స్ చేసుకుంటారు. వండి ఇతరులకు కూడా ఇస్తారు. అయితే ఈ దీపావళి 2025కి మీరు మరింత స్పెషల్‌గా స్వీట్స్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ట్రెడీషనల్ స్వీట్స్ ట్రై చేయవచ్చు. 30 నిమిషాల్లోపు చేసుకోగలిగే ఈ స్వీట్లు మీ ఫ్యామిలీ కోసం, స్నేహితుల కోసం వండుకోవచ్చు. దీపావళి వేడుకలకు ఏ మాత్రం తీసిపోని స్వీట్లు ఏంటి? వాటిని ఎలా తయారు చేయవచ్చో ఇప్పుడు చూసేద్దాం.
కాజు కట్లీ రెసిపీ
కాజు కట్లీ క్లాసిక్ దీపావళి స్వీట్. దీనిని చాలా ఎక్కువమంది ఇష్టపడతారు. జీడిపప్పు, షుగర్‌తో డైమండ్ షేప్‌లో చేసే ఈ స్వీట్.. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. దీనిని చాలా తక్కువ టైమ్‌లో తయారు చేసుకోవచ్చు. కాజు కట్లీ కోసం జీడిపప్పును నానబెట్టి మెత్తగా చేసుకోవాలి. స్టౌవ్ వెలిగించి చక్కెర పాకం చేసి.. తర్వాత జీడిపప్పు పేస్ట్ వేయాలి. సువాసన కోసం కొన్ని చుక్కల రోజ్ వాటర్, కొద్దిగా యాలకుల పొడి వేయాలి. తర్వాత దానిని ప్లేట్లో వేసి.. మీకు నచ్చే షేప్‌లో కట్ చేసుకోవాలి. అంతే కాజు కట్లీ రెడీ.
కొబ్బరి లడ్డూ రెసిపీ
కొబ్బరి లడ్డూలు చాలా రుచికరమైనవి. తక్కువ పదార్థాలతో వీటిని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎండిన కొబ్బరి, కండెన్స్డ్ మిల్క్, యాలకుల పొడితే కలిపి చేస్తారు. ముందుగా కొబ్బరిని కొద్దిగా వేయించాలి. తరువాత కండెన్స్డ్ మిల్క్ వేసి.. మిశ్రమం చిక్కబడే వరకు ఉడికించాలి. చివర్లో యాలకుల పొడి వేసుకోవచ్చు. వాటిని చిన్న లడ్డూలుగా ఒత్తుకోవాలి. కొందరు షుగర్, బెల్లం వేసుకుంటారు. మీరు షుగర్ వద్దు అనుకుంటే కొబ్బరి సహజమైన రుచికోసం కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు.
బేసన్ బర్ఫీ రెసిపీ
బేసన్ బర్ఫీ వేయించిన శనగపిండితో చేస్తారు. నట్స్‌తో వాటి రుచి మరింత హైలెట్ అవుతుంది. ముందుగా శనగపిండిని బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు నెయ్యిలో వేయించుకోవాలి. దానిలో పంచదార, కొద్దిగా పాలు వేసి ఉడికించాలి. మృదువైన, చిక్కటి పిండిని తయారు అయిన తర్వాత.. యాలకుల పొడి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి పూసిన ట్రేలో వేసి.. చదును చేయాలి. చల్లారిన తర్వాత కట్లీ షేప్‌లో కట్ చేసుకోవాలి. వాటిని నట్స్‌తో అలంకరించండి.
రవ్వకేసరి

రవ్వ కేసరి ఒక దక్షిణ భారతీయ డెజర్ట్. తయారు చేయడం కూడా చాలా సింపుల్. ముందుగా సువాసన వచ్చే వరకు రవ్వను నెయ్యిలో వేయించాలి. తరువాత చక్కెర, పాలు వేసి.. కలపాలి. నారింజ రంగు కోసం చిటికెడు కుంకుమపువ్వు కూడా వేసుకోవాలి. ఉండలు రాకుండా మిశ్రమం చిక్కబడే వరకు ఉడికించాలి. నెయ్యిలో వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్షలు దానిలో వేసి దించేయాలి. ఈ స్వీట్ 20-25 నిమిషాల్లో తయారు చేయవచ్చు.
బాదం బర్ఫీ
బాదం బర్ఫీ క్రీముగా, నోటికి రుచిగా ఉంటుంది. దీనికోసం బాదంను ముందుగా నానబెట్టుకోవాల్సి ఉంది. లేదంటే బాదంను వేడినీళ్లల్లో వేసి.. కాసేపు ఉంచితే పైన తొక్క ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత వాటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చక్కెర పాకంతో కలిపి తక్కువ మంట మీద ఉడికించి.. చిక్కటి మిశ్రమం ఏర్పడే వరకు ఉడికించాలి. నెయ్యి పోసిన ట్రేలో వేసి చదును చేసి.. కట్ చేసుకోవాలి. వీటిని సిల్వర్, గోల్డ్ ప్లేటెడ్‌తో అలంకరించుకోవచ్చు. అంతే బాదం బర్పీ రెడీ.
ఫ్రూట్ కస్టర్డ్
ఫ్రూట్ కస్టర్డ్ అనేది రిఫ్రెష్, తేలికగా చేసుకోగలిగే రంగురంగుల డెజర్ట్. ఈజీగా చేసుకోగలిగే స్వీట్ కోసం ముందుగా పాలను మరిగించాలి. వాటిలో కరిగించిన కస్టర్డ్ పౌడర్, చక్కెర వేసి చిక్కబడే వరకు కలపాలి. కొద్దిగా చల్లారిన తర్వాత.. యాపిల్, అరటి, ద్రాక్ష వంటి సీజనల్ పండ్లతో కలిపి మిశ్రమంలో వేసుకోవచ్చు. దీనిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని తినొచ్చు.
మరి ఇంకేందుకు ఆలస్యం.. ఈ దీపావళికి మీరు కూడా ఈ సింపుల్, టేస్టీ స్వీట్ రెసిపీలు చేసేయండి. అరగంటలోపు చేసుకోగలిగే ఈ స్వీట్స్ మీరు తినడానికే కాదు.. బంధు, మిత్రులకు ఇచ్చేందుకు కూడా అనువైనవి.






















