Medical Miracle : చనిపోయిన మహిళ చేతులకు మళ్లీ ప్రాణం - పెయింటర్‌కు కొత్త జీవితం ప్రసాదించిన వైద్యులు
Organ Donation : అతని చేతులు ఎప్పుడూ కుంచెలతో బిజీగా ఉండేవి. విధి అతని రెండు చేతులను లాగేసుకుంది. కానీ డాక్టర్లు మాత్రం అతని తలరాతను మార్చారు.. విధిని ఎందురించి రెండు చేతులను అమర్చారు.
Surgical Excellence : అవయవదానం ఎంత గొప్పదో మరోసారి రుజువు చేస్తుంది ఈ ఘటన. చేతులే జీవనాధారంగా పని చేస్తున్న అతనిని.. విధి వెక్కిరించింది. ఢిల్లీలోని ఓ వ్యక్తి పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబం కూడా అతనిపైనే ఆధారపడి ఉంది. నిరుపేద కుంటుంబానికి చెందిన అతను.. చిన్నా.. చితక పనులు చేసుకుంటూ. ప్రశాంతంగా జీవితాన్ని సాగిస్తున్నాడు. అప్పుడే అతని జీవితంలో ఓ అనుకోని ప్రమాదం ఎదురైంది. రైలు రూపంలో వచ్చి అతని రెండు చేతులను కబలించింది.
ప్రాణం పోయిందనుకున్నాడు..
2020లో ఓ పని మీద రైలులో ప్రయాణిస్తున్న అతడికి ఓ ప్రమాదం ఎదురైంది. ఈ ఘోర ప్రమాదంలో అతని రెండు చేతులు తెగిపోయాయి. ఈ ఘటనలో అతను చనిపోయాను అనుకున్నా.. అక్కడి సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది మాత్రం అతని ప్రాణం ఉందని గుర్తించి ఆస్పత్రిలో చేర్చారు. ఎలా అయితేనే.. వైద్యులు కష్టపడి అతని ప్రాణాలు నిలిపారు. కానీ స్పృహలోకి వచ్చిన అతను తనకు చేతులు లేవనే విషయం తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బతికి ఉన్నందుకు సంతోషించాలో.. బతికి ఉన్నా ఎలాంటి పని చేయలేను అని బాధపడాలో తెలియని స్థితి అతనిది.
కానీ అద్భుతం జరిగింది..
ఆ వ్యక్తి దుస్థితిని గుర్తించిన వైద్యులు అతనికి ఏదైనా చేయాలని అనుకున్నారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో అతనికి చికిత్స అందించారు. ఇదిలా ఉండగా.. అతని జీవితంలో అద్భుతం జరిగింది. ఢిల్లోలోని ఓ పాఠశాల మాజీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మీనా మెహతా చేతులు బాధితుడిని రక్షించాయి. మెహతా ఆమె మరణ అనంతరం తన అవయవాలను దానం చేసింది. ఆమె మూత్రపిండాలు, కాలేయం మరో ముగ్గురి జీవితాలను కాపాడింది. అలాగే ఆమె చేతులు చిత్రకారుడి కలలను పునరుద్ధరించాయి.
రెండు చేతులను అతికించి..
ఢిల్లీ వైద్యుల బృందం పెయింటర్‌కు మెహతా రెండు చేతులను అతికించారు. 45 ఏళ్ల పెయింటర్‌కు శస్త్రచికిత్స ద్వారా చేతులను పురుద్ధరించారు. ఈ సర్జరీ చేసేందుకు వైద్యబృందం చాలా కష్టపడ్డారు. సుమారు 12 గంటలకు పైగా సర్జరీ చేశారు. దాత చేతులను గ్రహిత చేతుల మధ్య ఉన్న ధమని, కండరం, స్నాయువు, నరాలను అనుసంధానించారు. ఎట్టకేలకు వారు చేసిన కృషి ఫలించింది. ఒక చేతిని అతికించారనేది ఇప్పటివరకు విన్నాము కానీ.. రెండు చేతులను పునరుద్ధరించి.. అది సక్సెస్ అయిన ఘటన ఇదే.
అవయవదానం వల్లనే ఇది సాధ్యమైంది..
చేతులను తిరిగి పొందిన పెయింటర్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బి అయిపోయాడు. అతనికి చేతులను అందించిన మెహతకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపాడు. అలాగే వైద్యబృందం తనకో పునర్జన్మ ఇచ్చారని.. తిరిగి నేను పని చేసుకోగలనని సంతోషం వ్యక్తం చేశాడు. నా చేతులు మళ్లీ కుంచె పట్టుకుంటాయి అనే ఆలోచనే తనకు ఎక్కడలేని ఆనందాన్ని ఇస్తుందని తెలిపాడు. అంతేకాకుండా సిబ్బందితో కలిసి.. ఫోటోలకు ఫోజులిచ్చే సమయంలో పెయింటర్ డబుల్ థంబ్స్ అప్ చేశాడు.
Also Read : ప్రెగ్నెన్సీ సమయంలో మధుమేహం వస్తే.. పిల్లలపై ఎఫెక్ట్ ఉంటుందా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.