Diabetes Tea: రోజూ ఈ టీ తాగితే మధుమేహం వచ్చే అవకాశమే ఉండదు
ప్రతిరోజూ టీ తాగడం వల్ల మధుమేహం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్టు మరొకసారి రుజువైంది.
ప్రతిరోజూ టీ తాగడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని సగానికి తగ్గించుకోవచ్చని సరికొత్త అధ్యయనం చెబుతోంది. అయితే మీరు తాగాల్సింది ఇంత పంచదార, పాలు పోసుకుని టేస్టీగా ఉండే మిల్క్ టీ మాత్రం కాదండోయ్. రోజు కనీసం ఒక కప్పు డార్క్ టీని తాగే వాళ్ళలో మధుమేహం వచ్చే అవకాశం 47 శాతం తక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, గట్ బూస్టింగ్ ఎఫెక్ట్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగ్గా ఉండటంలో సహాయపడుతుందని వాళ్ళు తెలిపారు. బిల్డర్స్ బ్రూ లేదా గ్రీన్ టీ తో సహా ఏదైనా టీ తాగడం వల్ల మధుమేహం ప్రమాదాన్ని 28 శాతం తగ్గించుకున్నట్టే. రక్తంలో చక్కెర స్థాయిల నిర్వహణపై టీ ఎటువంటి రక్షణ ప్రభావాలు చూపిస్తుందనే దాని గురించి నిపుణులు పరిశోధనలు జరిపారు.
డార్క్ టీ తాగేవారిలో మధుమేహం రాకుండా ఎక్కువ ప్రయోజనాలు పొందినట్టుగా తేలింది. ప్రపంచంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్యగా డయాబెటిస్ నిలిచింది. శరీరం గ్లూకోజ్ ని విచ్చిన్నం చేసే ఇన్సులిన్ ని ఎలా ఉత్పత్తి చేస్తుంది అనే దాని మీద రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, తగ్గడం అనేది ఆధారపడి ఉంటుంది. టీ తాగడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఇప్పటికే వచ్చిన పలు పరిశోధనల్లో తేలింది. అయితే ఇది ఎలా జరుగుతుందనేది స్పష్టంగా ఎవరూ చెప్పలేకపోయారు. హాంబర్గ్ యూరోపియన్ అసోసియేషన్ ఫర్ డి స్టడీ ఆఫ్ డయాబెటిస్ సమర్పించిన తాజా అధ్యయనం టీ మధుమేహ ప్రభావాన్ని ఎలా తగ్గిస్తుందో పరిశీలించింది.
అధ్యయనం సాగింది ఇలా..
చైనాలోని దాదాపు 1923 మంది పెద్దలని పరిశీలించారు. వాళ్ళు తరచుగా ఎటువంటి టీ తాగుతారని అడిగారు. ఆకుపచ్చ, నలుపు, ముదురు ఫార్ ఈస్ట్ నుంచి ఒక రకమైన పులియబెట్టిన టీలో వేటిని ఎక్కువగా తాగుతారో కనుక్కున్నారు. పరిశోధకులు వారి రక్తం, మూత్రం రెండింటినీ పరీక్షించారు. ఇన్సులిన్ నిరోధకత, చక్కెర స్థాయిలు ఏ విధంగా ఉన్నాయనేది పరిశీలించారు. కేవలం బ్లాక్ టీ తాగే వ్యక్తుల్లో మధుమేహం వచ్చే అవకాశం ఎనిమిది శాతం తక్కువగా ఉన్నట్టు తేలింది. ప్రతిరోజూ డార్క్ టీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు.
గ్రీన్ టీ కూడా తగ్గిస్తుంది..
గతంలో యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ద స్టడీ ఆఫ్ డయాబెటిస్ గ్రీన్ టీ గురించి పరిశోధన జరిపింది. దాదాపు పది లక్షల మందిపై పరిశోధన చేశారు. రోజుకు నాలుగు కప్పుల టీని తీసుకోవడం వల్ల టైప్2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 17% తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. పదేళ్లపాటు రోజుకు నాలుగు కప్పుల గ్రీన్ టీ ని తాగిన వారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గినట్టు గుర్తించారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: టాయిలెట్‌లోకి ఫోన్ వద్దని చెబితే వినలే, చూడండి ఇప్పుడు ఎన్ని రోగాలో - ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త!