Contraceptive Pills: త్వరలో మగవారికీ గర్భనిరోధక మాత్రలు, అవి వస్తే ఆడవారి కష్టాలు తీరినట్టే
ఆడవారికి ఇది నిజంగా శుభవార్తే. ఇంతవరకు గర్భనిరోధక మాత్రలు మహిళలకు మాత్రమే ఉండేవి. త్వరలో మగవారికీ రాబోతున్నాయి.
గర్భనిరోధక మాత్రలు అనగానే ఆడవాళ్లకే అనుకుంటారంతా. అలా అనుకోవడానికి కారణం ఇప్పటివరకు స్త్రీలకు మాత్రమే ఆ ట్యాబ్లెట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని అధికంగా వాడి ఆరోగ్యసమస్యల బారిన పడిన వారు ఎంతోమంది. పెళ్లయిన కొత్తలో చాలా మంది వీటిని వాడతారు. వారిలో ఎంతో మందికి ఇతర సమస్యలు ఉత్పన్నమై పిల్లలు పుట్టడం కష్టమైంది. అలాగే ఈ ట్యాబ్లెట్ల వల్ల అధిక బరువు బారిన పడిన వారూ ఉన్నారు. కొందరిలో రక్తం గడ్డ కట్టడం వంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురయ్యాయి. త్వరలో ఈ కష్టాలన్నీ తీరబోతున్నాయి. మగవారికి గర్భనిరోధక మాత్రలు రాబోతున్నాయి. అంటే భర్త వేసుకుంటే చాలు, భార్య ప్రత్యేకంగా వేసుకోవాల్సిన అవసరం రాదు.
ప్రస్తుతం ట్రయల్స్...
ఈ ట్యాబ్లెట్ ప్రయోగాలు ప్రస్తుతం ట్రయల్ దశలో ఉన్నాయి. మగ ఎలుకల్లో 99 శాతం విజయవంతమయ్యాయి ఈ మాత్రలు. త్వరలో మనుషులపై ఈ మాత్రలను ప్రయోగించి చూడబోతున్నారు. వీటినే హ్యుమన్ ట్రయల్స్ అంటారు. ఇవి ఏడాదిలో పూర్తి చేస్తామని చెబుతున్నారు పరిశోధకులు. అమెరికాలోని మిన్నోసోటా యూనివర్సిటీలో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జరిగే అమెరికన్ కెమికల్ సొసైటీ మీటింగ్లో ఈ మాత్రలను ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.
అప్పట్నించి ఆడవాళ్లకే...
1960లో తొలిసారి స్త్రీ గర్భనిరోధక మాత్రలను ఆమోదించారు. అప్నట్నించి ఆడవారికే కానీ మగవారికి ఇలాంటి మాత్రలు తయారుచేయలేదు. తొలిసారి ఇప్పుడు మగవారికి రాబోతున్నాయి. ప్రస్తుతం మగవారికి అందుబాటులో గర్భనిరోధక పద్ధతులు రెండే. కండోమ్స్ వాడడం లేదా వాసెక్టమీ ఆపరేషన్. ఈ రెండింటికీ ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మాత్రలు తయారుచేస్తున్నారు. వాసెక్టమీ వందశాతం విజయవంతం కావడం లేదు. అందుకే ఇది అంతగా ప్రజలపై ప్రభావం చూపలేకపోయింది.
ఇదొక నాన్ హార్మోనల్ డ్రగ్
మగవారికోసం తయారు చేస్తున్న గర్భనిరోధక మాత్ర ఒక నాన్ హార్మోనల్ డ్రగ్. ఇది హార్మోన్లపై ఎలాంటి ప్రభావం చూపించదు. రెటినోయిక్ యాసిడ్ రిసెప్టర్ (RAR) ఆల్ఫా అనే ప్రొటీన్ ను లక్ష్యంగా చేసుకుని ఈ మాత్ర పనిచేస్తుంది. మగవారి శరీరంలో విటమిన్ ఎ, రెటినోయిక్ ఆమ్లంగా మారుతుంది. ఇది కణాల పెరుగుదలకు, వీర్యం ఏర్పడటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇదంతా చేయడానికి రెటినోయిక్ ఆమ్లం, RAR ఆల్ఫాతో కలుస్తుంది. అంటే RAR ఆల్ఫాను నిర్వీర్యం చేస్తే గర్భం దాల్చడం కష్టం. అందుకే పరిశోధకులు RAR ఆల్ఫాను నిరోధించే సమ్మేళనాన్ని తయారుచేశారు. ఆ సమ్మేళనానికి YCT529 అని పేరు పెట్టారు. ఇది స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తుంది. కలయిక సమయంలో గర్భధారణను 99 శాతం నిరోధిస్తుంది. ఈ మాత్రలు వాడడం వల్ల సైడ్ ఎఫెక్టులు ఏమైనా ఉన్నాయేమో చూశారు. కానీ ఎలుకలపై ప్రయోగించినప్పుడు అలాంటి ప్రతికూలాంశాలు ఏవీ కనిపించలేదు. కాబట్టి త్వరలో మగవారికి కాంట్రాసెప్టివ్ పిల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Also read: పోరాడుతున్నా అంతం కాని మహమ్మారి ‘క్షయ’, ఇదొచ్చే అవకాశం వారికే ఎక్కువ
Also read: చర్మక్యాన్సర్ వచ్చిన విషయాన్ని కళ్లు చెబుతాయా? లక్షణాలెలా ఉంటాయి?