Online Order: ఆర్డర్ అందలేదని ఫిర్యాదు చేసింది, ఒక్క ఫోటోతో అడ్డంగా దొరికిపోయింది
ఓ మహిళ ఆన్‌లైన్లో మోసం చేద్దామని ప్రయత్నించింది. కానీ తనకు తానే పట్టుబడిపోయింది.
కొంతమందికి ఈ కామర్స్ సైట్లలో ఫోన్ ఆర్డర్ పెడితే సబ్బు రావడం, ఆర్డర్ ఇచ్చిన ఉత్పత్తి కాకుండా వేరేవి డెలివరీ కావడం వంటివి జరుగుతుంటాయి. కానీ కొందరు కస్టమర్లు కూడా ఆన్ లైన్ సంస్థలను మోసం చేస్తుంటారు. ఆర్డర్ వచ్చినా రాలేదని అబద్దాలు చెప్పి మళ్లీ ఆర్డర్ తీసుకోవడానికి లేదా, రిఫండ్ కోసం ఎత్తులు వేస్తుంటారు. అలా ఎత్తులు వేసి అడ్డంగా దొరికిపోయింది ఓ మహిళ. ఆమె చేసిన పని అందరికీ నవ్వు తెప్పిస్తోంది కూడా. అబద్ధం చెప్పి... అది అబద్ధం అని చెప్పే సాక్ష్యాన్ని కూడా తానే పంపింది. అసలేం జరిగిందంటే..
బ్రిటన్లో ట్రెసర్ పేరుతో ఓ ఆన్‌లైన్ జ్యూయలరీ సంస్థని నడుపుతోంది అమానీ జుబైర్. ఆమె వయసు కేవలం 20 ఏళ్లు. తన తెలివితో వ్యాపారాన్ని చక్కగా నడుపుతోంది. ఆమె జ్యూయలరీ డిజైనర్ కూడా. తాను డిజైన్ చేసిన నగలను ఇన్స్ స్టాలో అమ్ముతూ ఉంటుంది. ఒక మహిళ 18 క్యారెట్ల బంగారు ఉంగరాన్ని ఆర్డర్ ఇచ్చింది. కొన్ని నెలల తరువాత ఆమె నుంచి అమానీ ఓ మెయిల్ అందుకుంది. అందులో ఇన్ని రోజులు అయినా తనకు ఆర్డర్ అందలేదని, తనకు తిరిగి ఉంగరం పంపించమని లేదా డబ్బులు రిఫండ్ చేయమని రాసుంది. అది చూసిన అమానీ తాము ఆర్డర్ పంపించామని చెబుతూ దానికి సంబంధించిన డెలివరీ తాలూకు డీటెయిల్స్ పంపింది.
ఆ మహిళ తనకు డెలివరీ వచ్చిందని, ఆ డబ్బాలో ఉంగరం లేదని మళ్లీ మెయిల్ పెట్టింది. దాంతో అమానీ ఆ డెలివరీ తాలూకు రశీదును ఫోటో తీసి పంపమని కోరింది. ఆ మహిళ అలానే చేసింది. ఆ ఫోటోనే అసలు నిజం చెప్పేసింది. ఆ ఫోటోలో డబ్బా పట్టుకున్న మహిళ చేతివేళ్లు కూడా పడ్డాయి. అందులో చూపుడు వేలికి ఉన్న ఉంగరాన్ని ఎప్పుడో చూసినట్టు అనిపించింది అమానీకి. తన దగ్గర డిజైన్లు తీసి చూసింది. అలాగే ఆ మహిళ ఆర్డర్ వివరాలు చూసింది, ఇంకేముంది ఆ ఉంగరాన్నే తాము ఆ మహిళకు అమ్మినట్టు గుర్తు పట్టింది అమానీ. అదే విషయాన్ని చెబుతూ మెయిల్ చేసింది. అటు నుంచి నో రిప్లయ్. అంతేకాదు ఆ మహిళ అమానీని బ్లాక్ చేసింది కూడా. దీనిపై ఎవరికీ కంప్లయింటు ఇవ్వలేదు ఈ అమ్మాయి. కాకపోతే అందరికీ చెప్పి తెగ నవ్వుకుంది. ఆమె ఆ ఫోటో పెట్టకపోతే తాను నిజంగానే తిరిగి ఉంగరాన్ని పంపడమో లేక డబ్బు రిఫండ్ ఇచ్చేదాన్నని తెలిపింది.
అమానీ జుబైర్ ఇన్‌స్టాగ్రామ్
[insta]
View this post on Instagram