Bizarre Case : మాంసాహారం తింటే ఒంట్లో కొవ్వు బయటకు వస్తోందట! ఇదెక్కడి సమస్యరా నాయనా!
Bizarre Case : ఓ వ్యక్తి శరీరం నుంచి కొలెస్ట్రాల్ లీక్ అయ్యే ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పరీక్షల అనంతరం వైద్యులు దీనికి కారణం ఏం చెప్పారంటే..

Bizarre Case : జనరేషన్స్, కాలం, జీవనజైలిలో మార్పులు వస్తున్నట్టే సంక్రమించే వ్యాధులూ అప్డేట్ అవుతున్నాయి. కొన్ని వ్యాధులకైతే అసలు కారణలేంటో కూడా చెప్పలేని యుగంలో కాలం గడుపుతున్నాం. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత వింత వ్యాధులు, వైరస్ లు మరింత భయపడేలా చేస్తున్నాయి. శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటుందన్న విషయం దాదాపు అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బందులు తప్పవు. అయితే యూఎస్ కు చెందిన ఓ వ్యక్తిలో ఆశ్చర్యకరమైన లక్షణాలు కనిపించాయి. తన శరీరంలోని కొవ్వు చేతులు, కాళ్ల ద్వారా లీక్ కావడం ఆసక్తి, ఆందోళనకరంగా మారింది. ఈ వ్యక్తి ఫ్లోరిడాకు చెందిన టంపాకు చెందినట్టు సమాచారం.
చేతులు, కాళ్ల ద్వారా కొలెస్ట్రాల్ లీక్
జామా కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఓ కథనం ప్రకారం, సుమారు 40 ఏళ్లున్న వ్యక్తి ప్రారంభంలో తన అరచేతులు, అరికాళ్ళు, మోచేతులపై లేత పసుపు రంగు ఛాయలను చూసి అంతగా పట్టించుకోలేదు. ఇదేం అంత పెద్ద సమస్య కాకపోవచ్చని భావించాడు. నొప్పి లేనప్పటికీ ఈ తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండడంతో భయపడిన ఆ వ్యక్తి.. మూడు వారాల తర్వాత టంపా జనరల్ హాస్పిటల్‌కు వెళ్లాడు. అతని పరిస్థితిని చూసి అవాక్కయిన వైద్యులు వెంటనే పరీక్షలు చేశారు. వచ్చిన రిపోర్టుల్లో ఏముందో చెప్పగానే అతను ఆశ్చర్యపోయాడు.
వైద్యులు ఏం చెప్పారంటే..
మెడికల్ రిపోర్టుల ప్రకారం, అతనిలో లక్షణాలు కనిపించడానికి 7, 8 నెలల ముందు అధిక స్థాయిలో కొవ్వు పదార్థాలు తీసుకున్నాడు. ఎక్కువ మొత్తంలో మాంసాహరాన్ని తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని డాక్టర్స్ తెలిపారు. అసలు ఇది ఎలా మొదలైందంటే ఆ వ్యక్తి కార్నివోరస్ డైట్ అంటే దీన్నే కీటోజెనిక్ డైట్ ను ఫాలో అయ్యాడు. ఈ డైట్ లో ఈ విధానంలో శరీరానికి కావాల్సిన శక్తి 75 శాతం వరకూ కొవ్వుల నుంచి, 20 శాతం ప్రొటీన్ల అందుతుంది. కార్బోహైడ్రేట్లు నుంచి అందే శక్తి 10 శాతానికి మించకూడదు. ఈ తరహా డైట్ ను ఫాలో అయ్యేవారు పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, గింజల జోలికి అస్సలు వెళ్లరు. అందుకే అతను తీసుకున్న ఆహారంలో 6 నుండి 9 పౌండ్ల చీజ్, వెన్న, అదనపు కొవ్వు ఉండే ఆహారాలు ఉన్నాయి" అని వైద్యులు టెస్ట్ రిపోర్ట్ లో రాశారు. అతని శరీరంలో బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ 1000 mg/dL కంటే ఎక్కువగా ఉన్నాయన్నారు. అతను మాంసాహారాన్ని తీసుకోకముందు కొలెస్ట్రాల్ లెవల్ 210 mg/dL నుంచి 300 mg/dL మధ్య ఉండేదని కార్డియాలజిస్టులు తెలిపారు. సాధారణంగా కొలెస్ట్రాల్ స్థాయిలు 200 mg/dL ఉంటే తక్కువ అని, 240 mg/dL కంటే ఎక్కువ ఉంటే దాన్ని అధిక కొలెస్ట్రాల్ లెవల్ గా పరిగణిస్తారు.
ఆ వ్యక్తికి వచ్చిన వింత పసుపు రంగు ఛాయలను వైద్యులు క్శాంథెలాస్మాగా నిర్ధారించారు. ఇది చర్మం కింద పసుపు రంగు కొవ్వు నిల్వలు ఏర్పడటానికి కారణమయ్యే ఒక పరిస్థితిని సూచిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ లేదా ఇతర కొవ్వులు పేరుకుపోవడం వల్ల సంభవిస్తుంది. వాస్తవానికి దీని వల్ల ఎలాంటి హానీ ఉండదు. ఇది అంత ప్రమాదమేం కాదు. కానీ అధిక కొలెస్ట్రాల్ లెవల్స్ అథెరోస్క్లెరోసిస్ అభివృద్ధికి దారితీస్తుంది. ఈ పరిస్థితిలో కొలెస్ట్రాల్, కొవ్వు నిల్వలు ధమనుల గోడలపై పేరుకుపోయి గుండెకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఇస్కీమిక్ స్ట్రోక్‌కు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం, ఎక్కువ కాలం మాంసాహారం తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు, బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అధిక ప్రొటీన్ తీసుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరు కూడా దెబ్బతింటుంది. మాంసాహారం కండరాల నిర్మాణం, మరమ్మత్తు వంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, దాన్ని ఎక్కువ మోతాదులో ఎక్కువ కాలం తీసుకోకూడదు.





















