Chalimidi: వేసవిలో చలువ చేసే చలిమిడి, పిల్లలకు రుచిగా చేసి ఇవ్వండి
చలిమిడి తినడం వల్ల శరీరానికి ఎంతో చలువ అందుతుంది.
తెలుగింటి పెళ్లిళ్లలో చలిమిడిది ప్రత్యేక స్థానం. చలిమడి లేకుండా ఏ తెలుగింటి సారె కూడా సిద్ధం అవ్వదు. పెళ్లికూతురు వెంట చలిమిడి బిందె కూడా వెళ్లాల్సిందే. ఆ చలిమిడిని పంచడం వల్ల జంటకు ఎంతో మేలు జరుగుతుందని అంటారు. చలిమిడి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇది శరీరానికి చలువ చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. బియ్యం పిండితో చేసే ఒక సాంప్రదాయమైన రుచికరమైన వంటకం ఇది. దీన్ని కేవలం పెళ్లిళ్లలోనే కాదు, అప్పుడప్పుడు ఇంట్లో చేసుకొని పిల్లలకు తినిపిస్తే ఎంతో మంచిది. ముఖ్యంగా వేసవిలో చలిమిడి తినడం వల్ల శరీరానికి శీతలీకరణ లక్షణాలు లభిస్తాయి. దీన్ని సింపుల్‌గా ఎలా తయారు చేయాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - రెండు గ్లాసులు
బెల్లం - ముప్పావు కప్పు
పచ్చి కొబ్బరి ముక్కలు - అరకప్పు
జీడిపప్పులు - గుప్పెడు
యాలకుల పొడి - అర స్పూను
నెయ్యి - రెండు స్పూన్లు
తయారీ ఇలా
1. చలిమిడిని నేరుగా బియ్యం పిండిని కొని తయారు చేసుకోవచ్చు. బియ్యంతో తయారు చేసుకున్న మంచిదే.
2. ఒకవేళ బియ్యంతో తయారు చేసుకుంటే ముందుగా బియ్యాన్ని 6 గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి.
3. నానబెట్టిన తర్వాత బియ్యాన్ని వడకట్టి కాటన్ వస్త్రంలో నీరంతా పోయేవరకు ఉంచాలి.
4. ఆ తడి బియ్యాన్ని మిక్సీలో వేసి పిండిలా చేసుకోవాలి. జల్లెడతో జల్లించి మెత్తని పిండిని వేరు చేయాలి.
5. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు మరో గిన్నెలో బెల్లాన్ని బాగా తురిమాలి. ఆ తురుము మునిగే వరకు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి.
7. బెల్లం తీగపాకం వస్తుంది. తీగ పాకం వచ్చాక స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు అందులో యాలకుల పొడి. కొబ్బరి ముక్కలు కూడా వేసి బాగా కలపాలి.
8. ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని అందులో కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి.
9. ఒకేసారి పిండిని వేస్తే ఉండలు కట్టే అవకాశం ఉంది. కాబట్టి ఒకరు కలుపుతూ ఉంటే మరొకరు పిండిని వేస్తూ ఉండాలి.
10. ఇలా చలిమిడి గట్టిగా తయారయ్యే వరకు పిండిని వేసి బాగా కలపాలి.
11. దీన్ని గాలి, తడి తగలననివ్వకుండా నిల్వ చేసుకోవాలి. ఒకసారి చేసుకుంటే వారం రోజులు పాటు ఇది నిల్వ ఉంటుంది. పిల్లలకు వేసవిలో తినిపించడం వల్ల చలువ కలుగుతుంది
Also read: మనదేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు, ఆ రాష్ట్రంలోనే ఎక్కువమంది
Also read: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడే మహిళలు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువ
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.