Carrot Halwa: బెల్లంతో క్యారెట్ హల్వా... తింటే ఎంత ఆరోగ్యమో
తిన్నది ఒంట బట్టాలంటే అందులో పోషకాలు ఉండాలి. బెల్లంతో క్యారెట్ హల్వా చేసుకుని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
క్యారెట్ హల్వా అనగానే పంచదారతో చేసేది గుర్తొస్తుంది. కానీ పంచదారతో చేసిన ఆహారపదార్థాలు తినడం ఆరోగ్యకరం కాదు. అందుకే క్యారెట్ హల్వా బెల్లంతో చేసుకుంటే ఎ విటమిన్‌తో పాటూ, ఐరన్, కాల్షియం కూడా అందుతుంది. చేయడం కూడా చాలా సులువు.
కావాల్సిన పదార్థాలు
క్యారెట్ తురుము - రెండు కప్పులు
బెల్లం తురుము - ముప్పావు కప్పు
నీళ్లు- సరిపడినన్ని
పాలు - ఒక కప్పు
నెయ్యి - రెండు స్పూన్లు
జీడిపప్పు, కిస్ మిస్‌లు - గుప్పెడు
యాలకుల పొడి - ఒక టీస్పూను
తయారీ ఇలా...
స్టవ్ మీద కళాయి బెల్లం తురుమును వేయాలి. చిక్కని పాకం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కళాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో క్యారెట్ తురుమును వేసి వేయించాలి. పది నిమిషాల పాటూ వేయించాక పాలు కలిపి బాగా మగ్గించాలి. క్యారెట్ తురుము మెత్తగా ఉడికాక బెల్లం తురుమును కలపాలి. ఆ మొత్తం మిశ్రమం చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. చివర్లో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్లు పైన చల్లుకోవాలి. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఇది చేసి పెట్టడం చాలా సులువు. ఎక్కువ సమయం పట్టదు.
బెల్లం వల్ల లాభాలు
బెల్లం తినడం వల్ల చాలా లాభాలు కలుగుతాయి. కడుపుబ్బరం తగ్గుతుంది. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. రక్తాన్ని శుద్ధిచేయడంలో బెల్లం ముందుంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారికి బెల్లం మంచి పరిష్కారం. రోజూ చిన్న బెల్లం ముక్క తింటే వారి రక్త హీనత సమస్య తీరిపోతుంది. ఇందులో ఉండే ఐరన్ రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. నీరసాన్ని కూడా బెల్లం దూరం చేస్తుంది.
క్యారెట్ వల్ల ప్రయోజనాలు
క్యారెట్ తినడం వల్ల విటమిన్ ఎ, సి, కె పుష్కలంగా అందుతాయి. అంతేకాదు పొటాషియం కూడా శరీరంలో చేరుతుంది. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇవన్నీ అవసరం. క్యారెట్లోని సోడియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. క్యారెట్లోని కెరోటిన్ అనే పదార్థం కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మాన్ని కాంతిమంతం చేయడంలో క్యారెట్ ముందుంటుంది. క్యారెట్ తినేవారిలో కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
Read Also: వింటర్లో వేడి వేడి ఆలూ పులావ్... తింటే కిక్కే వేరప్పా
Read Also: శిల్పాశెట్టి చెప్పిన ఫ్రూట్ కేక్ రెసిపీ... చేయడం చాలా సులువు
Read Also: చల్లని సాయంత్రం వేడివేడి ఎగ్ కబాబ్స్... తింటే ఆ కిక్కే వేరప్పా
Read Also: పిల్లలకు పెట్టేందుకు సింపుల్ స్నాక్స్... అన్నీ ఆరోగ్యకరమైనవే
Read Also: మొక్కజొన్న గింజలతో ఇంట్లోనే కార్న్ సూప్... తాగితే చలి పరార్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి