Aloo Pulao: వింటర్లో వేడి వేడి ఆలూ పులావ్... తింటే కిక్కే వేరప్పా
బంగాళాదుంపతో చేసే వంటలంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మందే ఉంటారు. అందుకే ఆలూ వంటలు ఎంతో పాపులర్ అయిపోయాయి.
పిల్లలని ఫేవరేట్ కూర ఏది అని అడిగితే ఎక్కువ మంది చెప్పేది బంగాళాదుంప వేపుడనే. ప్రపంచంలో బంగాళాదుంపలు దొరకని దేశమే లేదు. అంత పాపులర్ దుంపజాతి ఇది. దీంతో రకరకాల వంటలు వండుకోవచ్చు. అందులో ఒకటి పులావ్. ఈ చలికాలంలో రాత్రికి డిన్నర్లో వేడివేడి ఆలూ పులావ్ చేసుకుని తింటే అబ్బా రుచే వేరు. కాస్త స్పైసీగా చేసుకుని, రైతా వేసుకుని తింటుంటే చికెన్ దమ్ బిర్యానీ కూడా దీని ముందు దిగదుడుపులాగే కనిపిస్తుంది.
కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - రెండు కప్పులు
ఆలూ ముక్కలు - రెండు కప్పులు
నిలువుగా తరిగిన ఉల్లిపాయలు- అరకప్పు
పెరుగు - అరకప్పు
కారం - ఒక టీ స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు
పుదీనా తరుగు - పావు కప్పు
కొత్తిమీర తరుగు - పావు కప్పు
గరం మసాలా - ఒక టీస్పూను
ధనియాల పొడి - రెండు టీ స్పూన్లు
పచ్చిమిర్చి నిలువుగా కోసినవి - మూడు
బిర్యానీ ఆకు - రెండు
మసాలా దినుసులు (అనాసపువ్వు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క) - ఒక టీస్పూన్
నెయ్యి - మూడు టీస్పూన్లు
నిమ్మరసం - ఒక టీస్పూన్
ఉప్పు - తగినంత
తయారీ ఇలా
బంగాళాదుంప ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా, పెద్దగా కాకుండా మధ్యస్థంగా కోసుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి ఈ బంగాళాదుంప ముక్కల్ని వేయించాలి. ఎర్రగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మరికొంత నెయ్యి వేసి మసాలా దినుసులన్నీ వేసి వేయించాలి. తరువాత నిలువుగా కోసిన ఉల్లిపాయముక్కల్ని వేయాలి. అవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేయాలి. తరువాత పచ్చిమిర్చి, పెరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి అన్నింటినీ కలపాలి. రెండు నిమిషాలు బాగా వేయించాక బియ్యం, వేయించిన బంగాళాదుంపలు వేయించి కలపాలి. మూడున్నర కప్పుల నీళ్లు వేసి తగినంత ఉప్పు వేసి కలపాలి. చివరలో నిమ్మరసం పిండాలి. ఉడికాక ఒక స్పూను నెయ్యిని వేయాలి. స్టవ్ కట్టేశాక... వేడివేడిగా ఆలూ పులావ్‌ను రైతాతో తినాలి. తింటే మళ్లీమళ్లీ తినాలనిపించేలా ఉంటుంది.
Also Read: కొత్త ఏడాదిలో ధనవంతులవ్వాలని ఆశపడుతున్నారా? ఇంట్లో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి...
Also Read: టీ ప్రేమికులందరికీ ఓ ప్రశ్న... రోజూ మీరు తాగే టీ మిమ్మల్ని లావుగా చేస్తోందని తెలుసా?