Blood Thinner Drug: పాము విషానికి చౌకైన విరుగుడు, ఆస్ట్రేలియన్ పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ
పాము విషానికి చౌకైన విరుగుడును కనుగొన్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. రక్తాన్ని పలుచగా మార్చేందుకు ఉపయోగించే ఔషధమే పాము విషానికి విరుగుడుగా పని చేస్తుందని గుర్తించారు.
Blood Thinner Drug: పాము కాటు కారణంగా దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియన్ పరిశోధకులు సరికొత్త విషయాన్ని కనుగొన్నారు. రక్తాన్ని పలుచగా మార్చే హెపారిన్ ఔషధంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఈ మందు పాము విషానికి విరుగుడుగా పని చేస్తుందని వెల్లడించారు. అంతేకాదు, ఈ ఔషధం తక్కువ ఖర్చులో లభిస్తుందన్నారు.
పాము విషానికి విరుగుడు హెపారిన్
పాము కరిచిన ప్రదేశంలో చర్మం నల్లగా మారిపోతుంది. దీనిని నెక్రోసిస్ అని పిలుస్తారు. నెమ్మదిగా ఆ ప్రదేశంలో కణజాలం చనిపోతుంది. తీవ్రమైన సమస్యగా మారుతుంది. కొన్నిసార్లు ఈ కారణంగా అవయవాలను తొలగించే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సిడ్నీ వర్సిటీ పరిశోధకులు క్రిస్పర్ టెక్నాలజీ సాయంతో జన్యు మార్పిడి చేశారు. తాచు పాము విషానికి విరుగుడుకు పలు మార్గాలను గుర్తించారు. హెపారిన్ తో పాటు రక్తాన్ని పల్చగా మార్చే పలు మెడిసిన్స్ లో మార్పులు చేశారు. తాజాగా ఈ ఔషధాలను ఎలుకల మీద ప్రయోగించారు. పాము కాటు కారణంగా ఏర్పడే నెక్రోసిస్‌ను హెపారిన్ సమర్థవంతంగా అడ్డుకుంటుందని గుర్తించారు.
"తాచుపాము కరిచిన చోట చర్మం నల్లగా మారిపోతుంది. పాము కాటుతో ఏర్పడే గాయాలను నయం చేసేందుకు మేం చాలా విషయాలు కనుగొన్నాం. హెపారిన్ ఔషధం పాము కరిచిన తర్వాత శరీరంలో విషం వేగంగా విస్తరించకుండా అడ్డుకుంటుంది. పాము కాటుకు గురైనా, చనిపోయే ముప్పును తగ్గిస్తుంది’’ అని సిడ్నీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గ్రెస్ నీలే వెల్లడించారు. రక్తాన్ని పలుచబరిచే మెడిసిన్స్ కు పాము విషాన్ని అదుపు చేసే సత్తా ఉన్నట్లు తెలిపారు.
హెపారిన్ తో నెక్రోసిస్ కు చెక్
వాస్తవానికి ఆసియా, ఆఫ్రికా దేశాల్లో పాము కాటుతో ప్రతి ఏటా సుమారు లక్షకు పైగా మంది చనిపోతున్నారు. వీరిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్లు ఉన్నారు. పాము కాటుకు గురైన వాళ్లలో చాలా మంది నెక్రోసిస్ అనే సమస్య తలెత్తతుంది. అయితే, సిడ్నీ పరిశోధకులు రూపొందించిన హెపారిన్ ఔషధంతో నెక్రోసిన్ ను సమర్థవంతంగా ఎదుర్కోనే అవకాశం ఉంది. అయితే, ఈ ఔషధం అన్నిరకాల పాముల విషాలను తగ్గించడంలో విఫలం అయినట్లు పరిశోధకులు తెలిపారు.
తాచు పాము సహా పలు పాముల విషాన్ని కంట్రోల్ చేస్తుందన్నారు. ప్రస్తుతం పాము కాటు నుంచి కాపాడే యాంటీ వీనమ్ మెడిసిన్స్ తో పోల్చితే హెపారిన్ చాలా చౌకగా దొరుకుతుందని తెలిపారు. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీ వీనమ్ మందులు పాము విషానికి మాత్రమే విరుగుడుగా పని చేస్తాయని, నెక్రోసిస్ ను తగ్గించలేవన్నారు. హెపారిన్ మాత్రం నెక్రోసిస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తెలిపారు. ఎలుకల మీద హెపారిన్ ప్రయోగం సక్సెస్ అయిన నేపథ్యంలో త్వరలో మనుషుల మీద ప్రయోగాలు నిర్వహించనున్నట్లు సిడ్నీ వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.
Read Also: ఈ లక్షణాలకు కనిపిస్తే గుండె లయ తప్పినట్టే, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోతాయ్ జాగ్రత్త