Bhopal Street Vendor: ఇలాంటి తండ్రికి పుట్టిన ఆ కూతురు ఎంత అదృష్టవంతురాలో...
కూతురు కావాలని కోరుకున్న తండ్రిని దేవుడు కరుణించాడు. ఆ తండ్రి తన సంతోషాన్ని ఊరంతా పంచాడు.
ఇంట్లో కూతురు పుడితే మహాలక్ష్మి పుట్టినట్టే భావిస్తారు చాలా మంది. అలాంటివారిలో భోపాల్ కు చెందిన ఆంచల్ గుప్తా ఒకరు. కూతురు పుట్టిన ఆనందంలో ఒక రోజంతా పానీపూరీని ఉచితంగా పంచాడు. అందుకు ఆయనకు అయిన ఖర్చు నలభై వేల రూపాయలు. అలాగని అతడేమి లక్షాధికారి కాదు, కనీసం ఉద్యోగస్తుడు కూడా కాదు. పానీపూరీ సెంటర్ తో కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి. కూతురి పుట్టిన ఆనందం ముందు డబ్బులు ఎక్కువ కాదని భావించాడు ఆంచల్. కొన్ని వందల మంది ఆయన షాపుకు వచ్చి ఉచితంగా తిని వెళ్లారు.
మధ్యప్రదేశ్ లోని భోపాల్ దగ్గరలోని కోలార్ ప్రాంతంలో నివసిస్తున్నాడు ఆంచల్ గుప్తా. రోడ్డు పక్కన చిన్నపానీ పూరీ సెంటర్ ను నడుపుతున్నాడు. మూడేళ్ల క్రితం అతని భార్య తొలిసారి గర్భవతి అయ్యింది. ఆ సమయంలో కూతురే పుట్టాలని కనిపించిన దేవుడినల్లా మొక్కాడు. కానీ కొడుకు పుట్టాడు. ఈ ఏడాదిలో రెండోసారి అతడి భార్య గర్భవతి అయ్యింది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి కూతురే పుట్టాలని గట్టిగా కోరుకున్నాడు. కనిపించిన దేవాలయాలన్నింటిని దర్శించుకున్నాడు. ఈసారి దేవుడు కరుణించాడు. అతడి భార్య కూతురిని ప్రసవించింది. విషయం తెలిశాక ఆంచల్ ఆనందానికి అవధుల్లేవు. ఒక రోజంతా తన షాపులో ఉచితంగా పానీపూరీ పంచాలని నిర్ణయించుకున్నాడు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వచ్చిన వారందరికీ ప్లేటు పానీపూరీ తినిపించాడు. ఈ సందర్భంగా భోపాల్ వాసులకు ‘బేటీ హై... తో కల్ హై’ అన్న నినాదాన్ని ఇచ్చాడు. అంటే తెలుగులో ‘కూతురుంటేనే భవిష్యత్తున్నట్టు’అని అర్థం. ఆ పానీపూరీల ధర దాదాపు నలభై వేల రూపాయల దాకా తేలింది. నా కూతురి ముందు ఈ ఖర్చు పెద్ద లెక్క కాదు అని చెబుతున్నాడు ఆంచల్ గుప్తా. అతడు 8వతరగతి మాత్రమే చదివాడు. ఆర్దిక సమస్యలు కూడా తక్కువేమీ కాదు.
ఆంచల్ గుప్తా ఆడపిల్లల విషయంలో ఆధునిక భావాలను కలిగి ఉన్నాడు. తన భార్యకు కూడా ఆర్ధిక స్వతంత్రత ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఆమె చేత టైలరింగ్ షాపు పెట్టిస్తానని, తద్వారా ఆమె కూడా సంపాదించగలదని అన్నాడు. మహిళలకు సమానహక్కులు ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ఒకటినని చెబుతున్నాడు ఆంచల్. తన చేతనైనంత వరకు కొడుకుతో సమానంగా, కూతురిని చదివిస్తానని అంటున్నాడు.
ఇంట్లో ఆడపిల్లల చదువుకు విలువ ఇవ్వకుండా, పెళ్లి చేసి పంపించేద్ధామన్న పాతకాలపు ఆలోచనలు చేసే తల్లిదండ్రులంతా ఆంచల్ ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
Also read: ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకండి... వైద్యుడిని కలవండి
Also read: రోజుకో రెండు తమలపాకులు నమలండి... ఈ రోగాలు దరిచేరవు
Also read: మీరు వాడే వంటనూనె మంచిదో, కల్తీదో తెలుసా? ఇలా చేస్తే ఇట్టే తెలిసిపోతోంది...