Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Rice Smuggling: ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై విచారణకు ఆరుగురు సభ్యులతో ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది.
SIT On Rice Smuggling In Kakinada: ఏపీలో రేషన్ బియ్యం (Ration Rice) అక్రమ రవాణా ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా వినీత్ బ్రిజ్ లాల్ వ్యవహరిస్తారు. సీఐడీ ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్ వర్ధన్, గోవిందరావు, బాలసుందర్ రావు, రత్తయ్య ఇలా బృందంలో మొత్తం ఆరుగురు సభ్యులుంటారు. సిట్‌కు పూర్తి స్థాయి అధికారాలు అప్పగించిన ప్రభుత్వం.. 15 రోజులకోసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
కాగా, అక్రమ రవాణాపై కాకినాడలో నమోదైన ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా సిట్ విచారణ జరపనుంది. ఈ వ్యవహారంపై మొత్తం 13 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఆఫ్రికా దేశాలకు ఎగుమతులపై సిట్ పూర్తి స్థాయి విచారణ చేయనుంది. పీడీఎస్ రైస్‌ను ఎక్స్‌పోర్ట్ డాక్యుమెంట్లలో ఎలా నివేదించారో సిట్ వెలికితీయనుంది. దోషులుగా తేలితే వెంటనే అరెస్ట్ చేసే అధికారాన్ని సైతం సిట్‌కు ప్రభుత్వం ఇచ్చింది.
అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారం సంచలనం సృష్టించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల కాకినాడ పోర్టును సందర్శించి అక్రమంగా రేషన్ బియ్యం తరలిపోతున్నట్లు గుర్తించారు. షిప్‌ను సీజ్ చేయాలని ఆదేశించారు. కాకినాడ కేంద్రంగా జరిగిన ఘటనలు, ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులపై సీబీసీఐడీతో విచారణ చేయిస్తామని ఇప్పటికే మంత్రి ప్రకటించారు. బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటోందని.. ఇప్పటివరకు కోటీ 20 టన్నుల బియ్యం అక్రమ రవాణా జరిగినట్లు తమకు సమచారం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 1,066 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. 729 మందిని అరెస్ట్ చేసి.. 102 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
కాకినాడ నుంచే అధికంగా..
రాష్ట్రం నుంచి 62 వేల టన్నుల బియ్యం అక్రమంగా రవాణా జరిగిందని.. వాటి విలువ సుమారు రూ.240 కోట్లు అని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. విశాఖ, కృష్ణపట్నం పోర్టుల కంటే కాకినాడ పోర్టు నుంచే ఎక్కువ మొత్తంలో తరలిపోయాయని.. ఇందులో అధికారుల పాత్ర కూడా ఉందన్నారు. స్టెల్లా షిప్‌లో అన్ని విభాగాలను కలెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారని.. బియ్యం అక్రమంగా తరలించే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గత జూన్‌లో కాకినాడలో 28 గోదాములపై దాడులు చేయగా.. 51 లక్షల టన్నుల రేషన్ బియ్యం పట్టుబడ్డాయని చెప్పారు. అప్పటి నుంచీ కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న అక్రమ బియ్యం తరలింపు వ్యవహారంలో స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆ పోర్టు స్మగ్లింగ్ డెన్‌గా మారిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
Also Read: YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు