Back Pain: మెడ, నడుము నొప్పులతో బాధపడుతున్నారా? ఇలా చేస్తే పూర్తిగా ఉపశమనం
మనలో చాలామంది మెడ, నడుము నొప్పులతో బాధపడుతుంటారు. అలాంటి వారు తమ పడుకునే పద్ధతిలో కొన్ని రకాల పొజిషన్లలో పడుకుంటే నొప్పుల నుంచి ఉపశమనంతో పాటూ, సుఖమైన నిద్రపోయే అవకాశం ఉందట.
ఆకలి రుచెరుగదు.. నిద్ర సుఖమెరుగదు అంటుంటారు మన పెద్దలు. మానవ జీవితంలో నిద్ర చాలా అవసరం. నిద్ర వల్ల అనేక లాభాలున్నాయి. మనిషికి నిద్ర తగ్గితే ఆ ప్రభావం అతని శారీరక, మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా పడుకునే పొజిషన్ సరిగ్గా లేకపోతే మెడనొప్పి, నడుము నొప్పిలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి అలాంటి సమస్యలు ఉన్నవారికి సుఖమైన నిద్ర పట్టాలంటే ఎలాంటి పొజిషన్స్ సహాయపడతాయో మనం ఇప్పుడు చూద్దాం!
వెల్లకిలా పడుకోవడం ద్వారా..
పడుకునేటప్పుడు వెల్లకిలా పడుకోవడం వెన్నుముకకు మంచిది. అయితే ఇలా పడుకున్నప్పుడు నాణ్యమైన దిండును, పరుపును వాడాలి. మనం ఎప్పుడు పడుకున్న సరే మన కాళ్లు, చేతులు, మెడ, నడుము ఎప్పుడూ సమాంతరంగా వెన్నుముకకు సపోర్ట్ ఇచ్చేలా చూసుకోవాలి. ఇలా వెల్లకిలా పడుకుంటే శరీరానికి రక్తప్రసరణ సమంగా జరుగుతుంది. మెడ, తల, వెన్నుముక నరాలపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ పొజిషన్ లో పడుకోవడానికి మరీ ఇబ్బందిగా అనిపిస్తే తల దగ్గర మాత్రమే కాకుండా కాళ్ల కింద, నడుము దగ్గర కూడా ఒక మెత్తటి దిండును పెట్టుకుంటే మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. స్పాండలైటిస్ సమస్య ఉన్నవారు మాత్రం ఈ పొజిషన్ లో పడుకోకపోవడమే బెటర్.
పక్కకి తిరిగి పడుకోవడం ద్వారా
కొంతమందికి మెడ, వెన్నుముక సమస్యలు తీవ్రతరంగా ఉంటాయి. అలాంటి వారు వెల్లకిలా పడుకోలేరు. అలాంటి వారు ఎడమ వైపు లేదా కుడివైపుకి తిరిగి పడుకోవచ్చు. అసిడిటీలాంటి సమస్యలు ఉన్నవారు ముఖ్యంగా ఎడమ వైపుకి తిరిగి పడుకుంటే చాలా మంచిది. అయితే ఇలా పడుకునేటప్పుడు మన చెవి, భుజానికి సమాంతరంగా ఉండాలి లేకుంటే వెన్నుముక నొప్పి వస్తుంది. అలాంటప్పుడు రెండు కాళ్ల మధ్యన ఒక తలగడని పెట్టుకుని ఒక కాలుని ముడుచుకుని పడుకుంటే ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఈ పొజిషన్ లో ఎక్కువ సేపు ఉండలేమనుకుంటే ఒకవైపు నుంచి మరోవైపు తిరిగి కూడా పడుకోవచ్చు. ఇక గర్భిణులు ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల పిండానికి, గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కడుపులో ఉన్న బిడ్డకు నేరుగా పోషకాలు చేరతాయి. ఇలా పడుకోవడంతో వెన్నెముక మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది. తద్వారా సౌకర్యంగా అనిపించి నిద్ర బాగా పడుతుంది.
గర్భస్థ శిశువులా పడుకోవడం
గర్భంలో శిశువు రెండు కాళ్లను ముడుచుని పడుకుని ఉంటుంది కదా.. అలాంటి పొజిషన్ లో పడుకోవడం వల్ల కూడా నడుము నొప్పి తగ్గుతుందట. ఈ పొజిషన్ ఎక్కువగా డిస్క్ సమస్యలు ఉన్నవారికి ఉపయోగకరం. ఎందుకంటే రెండు మోకాళ్లను ఛాతి వరకు తెచ్చి, ఒక పక్కన పడుకోవడం వల్ల వెన్నుముక వంగడం తగ్గుతుందట. ఈ స్థితిలో మరింత సౌకర్యవంతంగా ఉండడానికి తల కింద, వెన్నుముక కింద ఒక మెత్తటి దిండును పెట్టుకుంటే నొప్పి రాకుండా ఉంటుంది.
పొట్టపై పడుకోవడం
బోర్లాగా పొట్టపైన పడుకోవడం వల్ల కొందరికి మంచి నిద్ర వస్తుంది. ఒకసారి ఈ భంగిమలో పడుకోవడానికి అలవాటు పడితే చాలామంది మానేయలేరు. డిస్క్ సమస్యలు ఉన్నవారు సాధ్యమైనంత వరకు ఈ భంగిమలో పడుకోకపోవడమే ఉత్తమం. కానీ దీనివల్ల వెన్నుముక, మెడ నొప్పి కలుగుతాయి. గురక సమస్య కూడా వస్తుంది. రక్తప్రవాహం సక్రమంగా జరగదు. నిద్రపట్టని వారు ఇలా పడుకోవాలని అనుకుంటే కనుక మెడ దగ్గర, కడుపు దగ్గర, తుంటికి దిగువన ఒక మెత్తటి దిండును ఉపయోగిస్తే మంచిది.